సైన్స్‌లో సోనాలి కామర్స్‌లో సుగంధ ఆర్ట్స్‌లో భారతి | Street Vendor Daughter who Topped Bihar Board Class 12 Exam | Sakshi

సైన్స్‌లో సోనాలి కామర్స్‌లో సుగంధ ఆర్ట్స్‌లో భారతి

Published Mon, Mar 29 2021 5:48 AM | Last Updated on Mon, Mar 29 2021 6:35 AM

Street Vendor Daughter who Topped Bihar Board Class 12 Exam - Sakshi

సోనాలి, సుగంధ, భారతి

ఇంటర్‌ పరీక్షల నిర్వహణలో బిహార్‌ బోర్డు ఈసారి అన్ని రాష్ట్రాల కన్నా ముందుంటే, బిహార్‌ పరీక్షా ఫలితాల్లో అమ్మాయిలు ముందున్నారు. అమ్మాయిలు ముందుండటం అన్నీ రాష్ట్రాల్లోనూ యేటా అదొక సంప్రదాయంగా వస్తున్నప్పటికీ, కరోనా పరిస్థితుల్లో మనోబలాన్ని సడలనివ్వకుండా చక్కగా చదివి.. ఆర్ట్స్, కామర్స్, సైన్స్‌.. ఈ మూడు స్ట్రీమ్‌లలోనూ అమ్మాయిలే టాపర్‌లుగా నిలవడం విశేషం. సైన్స్‌లో సొనాలి కుమారి 94.2 శాతం మార్కులతో స్టేట్‌ ఫస్ట్‌ వచ్చింది. సైన్సే కష్టం అనుకుంటే, ఆమె కుటుంబ పరిస్థితులు ఇంకా కష్టమైనవి. రెండు కష్టాల మధ్య విజేతగా చదువును లాక్కొచ్చొని సొనాలి తండ్రి రిక్షా పుల్లర్‌!

సోనాలికి స్వీట్‌ తినిపిస్తున్న కుటుంబ సభ్యులు. చిత్రంలో జీత్‌ సార్, సోనాలి తల్లిదండ్రులు (కుడి చివర)

మార్చి 26 శుక్రవారం బిహార్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు ఫలితాలు వెల్లడయ్యాయి. మూడు విభాగాల్లో టాపర్‌గా విజయ కేతనాన్ని ఎగరేసిన వారు ముగ్గురూ అమ్మాయిలే! బిహార్‌లోని ఖగరియాకు చెందిన మధు భారతి 92.6 శాతం మార్కులతో ఆర్ట్స్‌లో, ఔరంగాబాద్‌కు చెందిన సుగంధ కుమారి 94.2 శాతం మార్కులతో కామర్స్‌లో స్టేట్‌ టాపర్‌లుగా నిలిచారు. సైన్స్‌లో టాప్‌ ర్యాంక్‌ కొట్టిన సోనాలి 500 కు 471 మార్కులు సాధించి తండ్రి కష్టానికి తగ్గ ఫలితాన్ని సాధించింది. సోనాలి నలందలోని శ్రీమతి పరమేశ్వరీ దేవి ఉఛ్తార్‌ మాధ్యమిక పాఠశాల విద్యార్థిని. బిహార్‌ ఇంటర్‌ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 13 వరకు జరిగాయి. మొత్తం 13.4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వాళ్లల్లో 10.45 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణశాతం 78.04. ఆ శాతం కంటే కూడా ఈ ముగ్గురు అమ్మాయిలు వ్యక్తిగతంగా సాధించిన శాతమే ఎక్కువ. ముగ్గురూ 90 అంకెను దాటేశారు.

సోనాలి చదివిన పాఠశాలకు సమీపంలో బిహార్‌ షరిఫ్‌ అనే ప్రాంతంలో ఒక బస్టాండ్‌ ఉంది. ఆ బస్టాండ్‌లోనే తోపుడు బండిపై తినుబండారాలను అమ్ముతారు సోనాలి తండ్రి చున్నులాల్‌. ఆ సంపాదనే వారి కుటుంబానికి జీవనాధారం. ఓపిక ఉన్నప్పుడు ఆయన రిక్షాబండి లాగుతారు. గత ఏడాది లాక్‌డౌన్‌ అన్ని బతుకు బండ్ల ఇరుసులను లాగేసినట్లే సోనాలి తండ్రి జీవికనూ కనాకష్టం చేసేసింది. మరో వైపు సోనాలి పంతం పట్టినట్టుగా చదివింది. లాక్‌డౌన్‌ సమయం మొత్తాన్ని చదువుకే అంకితం చేసింది. ‘‘నాన్న కష్టపడేవారు. జీత్‌ సర్‌ కష్టపడి నన్ను చదివించేవారు. అమ్మ కష్టపడి నాకు అన్నీ అమర్చేది. జీత్‌ సార్‌ టెన్త్‌లో కూడా దగ్గరుండి మరీ నా డౌట్‌లు తీర్చేవారు. లాక్‌డౌన్‌లో సార్‌ మా ఇంటికే వచ్చి నాకు సబ్జెక్ట్‌లు టీచ్‌ చేసేవారు. ఆన్‌ లైన్‌ స్టడీస్‌ కోసం అప్పుడప్పుడు తన సెల్‌ఫోన్‌ను నాకు ఇచ్చేవారు. అమ్మ ఎప్పుడూ నా ఆకలిని కనిపెట్టుకుని ఉండేది. ఇంతమంది పడిన కష్టం మందు నేను ర్యాంకు సాధించడం పెద్ద విషయం కాదు అనిపిస్తుంది నాకు’’ అంటోంది సోనాలి! జీత్‌సార్‌కి, అమ్మకు నాన్నకు థ్యాంక్స్‌ చెబుతోంది.  

సోనాలి ఐ.ఎ.ఎస్‌. ఆఫీసర్‌ అవాలని కలగంటోంది. ‘‘భవిష్యత్తులో యు.పి.ఎస్‌.సి. పరీక్షకు ప్రిపేర్‌ అవుతాను. నాకెప్పుడూ సమాజానికి, పేదవాళ్లకు సాయం చేయాలని ఉంటుంది. నాలా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం కూడా ఐ.ఎ.ఎస్‌. అధికారిగా నేను తప్పకుండా ఏదైనా చేసి తీరుతాను. ప్రతి విద్యార్థిలో ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభ వెలుగులోకి రాకుండా పేదరికం అడ్డుపడుతుంటుంది. కడుపులో పేగుల్ని ఆకలి మెలిపెడుతుంటే పుస్తకం ముందేసుకుని చదవగలడం కూడా ఆ పూటకు సాధించిన ర్యాంకే నా దృష్టిలో..’’ అంటోంది సోనాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement