ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు వాసవి కాలేజి విద్యార్థుల ఆందోళన
ఇంటర్మీడియట్ బోర్డులో అవినీతి బాగోతం
- వాసవి కాలేజీ ఉదంతంతో మరోసారి బయటపడిన తీరు
- రెండేళ్లుగా అనుమతి లేకున్నా కొనసాగిన కాలేజీ
- గతేడాది అనుమతుల కోసం దరఖాస్తు
- రూ. లక్షల్లో ముడుపులు పుచ్చుకున్న అధికారులు
- తనిఖీలు చేశాక మరింత లంచం కోసం డిమాండ్
- యాజమాన్యం ఇవ్వకపోవడంతో పక్కన పెట్టిన వైనం
- ముడుపులు ఇవ్వనందుకే బోర్డు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వలేదంటున్న యాజమాన్యం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ బోర్డులో అవినీతి, అక్రమాల బాగోతం మరోసారి బయటపడింది. ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల నుంచి ముడుపులు పుచ్చుకునేందుకు అలవాటు పడిన అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు వాసవి కాలేజీ ఉదంతంతో స్పష్టమవుతోంది. రెండేళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండానే వనస్థలిపురంలో వాసవి కాలేజీ కొనసాగుతున్నట్లు అధికారులకు తెలిసినా.. లంచాలు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వాసవి కాలేజీ అధికారుల అండదండలతో గతేడాది మరో ప్రైవేటు కాలేజీ ద్వారా తమ విద్యార్థులతో పరీక్షలు రాయించగా.. ఈసారి తమ కాలేజీ పేరిటే పరీక్షలు రాయించేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. రూ.లక్షల్లో ముడుపులు పుచ్చుకున్న అధికారులు అనుమతుల జారీ ప్రక్రియలో భాగంగా గతేడాది జూలైలోనే వాసవి కాలేజీలో తనిఖీలు చేశారు. అయినా అనుమతివ్వకుండా మరిన్ని ముడుపుల కోసం తమను పీడించారని కాలేజీ యాజమాన్యం ఆరోపిస్తోంది. పైగా తనిఖీలు చేసిన అధికారులు గుర్తింపు ఇస్తున్నారా, లేదా? అన్నది తేల్చకుండా ఇప్పటివరకు కాలేజీని ఎలా కొనసాగించారన్న దానికి బోర్డు నుంచి ఎలాంటి సమాధానం లేదు.
మామూళ్ల మత్తులోనే..!
అసలు సూర్యాపేటలో మూతపడిన వాసవి కాలేజీని రెండేళ్ల కిందట వనస్థలిపురంలో ఏర్పాటు చేసినా.. బోర్డు అధికారులు మామూళ్ల మత్తులో పడి చూసీ చూడనట్లు వదిలేశారు. అంతేకాదు గత జనవరిలో జరిగిన పర్యావరణ విద్య, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షలకు ఆ కాలేజీ విద్యార్థులు హాజరుకాలేదు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరగాల్సిన ప్రాక్టికల్ పరీక్షలనూ నిర్వహించలేదు. చివరకు యాజమాన్యం ఒత్తిడితో సూర్యాపేటలోని కాలేజీ పేరుతోనే విద్యార్థులు పరీక్ష రాసేందుకు వీలుగా వివరాలను అప్‌లోడ్ చేసేందుకు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఇచ్చారు. దాంతో వాసవి కాలేజీ యాజమాన్యం విద్యార్థుల వివరాలను అప్‌లోడ్ చేసింది. ఎలాగూ విద్యార్థుల వివరాలు అప్‌లోడ్ చేశాం కాబట్టి హాల్‌టికెట్లు వచ్చేస్తాయని, విద్యార్థులు పరీక్షలు రాస్తారని భావించింది. కానీ చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదుగానీ ఆ విద్యార్థులకు హాల్‌టికెట్లు రాలేదు. ఫలితంగా కాలేజీలోని 300 మందికి పైగా విద్యార్థులు ఒక విద్యా సంవత్సరం నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. దీనిపై తల్లిదండ్రులంతా ఆందోళనకు దిగడంతో కాలేజీ యాజమాన్యం చేసిన మోసం, బోర్డు అధికారుల అక్రమాలు బయటపడ్డాయి. అయితే విద్యార్థులు నష్టపోవద్దనే ఉద్దేశంతో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. ఆ కాలేజీ విద్యార్థులు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు.
లాగిన్ ఐడీ ఎలా ఇచ్చారు?
ఇంటర్ చదివే విద్యార్థులు కచ్చితంగా పర్యవరణ విద్య, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షలు రాస్తేనే ఇంటర్ పరీక్ష పాస్ సర్టిఫికెట్ వస్తుంది. లేకపోతే ఇంటర్ ఉత్తీర్ణత పొందినట్లు సర్టిఫికెట్ ఇవ్వరు. ఇది బోర్డు అధికారులకు తెలుసు. పైగా విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు కూడా హాజరుకాలేదు. మరి ఈ రెండూ జరిగిపోయాక కూడా బోర్డు అధికారులు సూర్యాపేటలోని పాత కాలేజీ పేరుతో లాగిన్ ఐడీ ఎలా ఇచ్చారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అక్కడి కాలేజీ పేరుతో విద్యార్థుల వివరాలను ఎలా అప్‌లోడ్ చేయించారన్నది తేలాల్సి ఉంది. యాజమాన్యం వద్ద భారీగా ముడుపులు పుచ్చుకొని అధికారులే ఈ తప్పిదానికి కారణమయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
లంచం ఇవ్వనందుకే..
‘‘ఇంటర్ బోర్డు అధికారులు అడిగిన లంచం ఇవ్వనందుకే మా కళాశాల విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వలేదు. మా విద్యార్థులకు జరిగిన అన్యాయానికి బోర్డు అధికారులదే బాధ్యత. వారిపై చర్యలు చేపట్టాలి. గతేడాది జూన్‌లోనే అనుమతి కోసం దరఖాస్తు చేశాం. తనిఖీలు కూడా చేశారు. రూ.2 లక్షలు లంచం కూడా తీసుకున్నారు. ఇంకా రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వనందుకు జూన్ నుంచి బోర్డు చుట్టూ తిప్పుకుని చివరకు ఫిబ్రవరిలో లాగిన్ ఇచ్చారు. తీరా ప్రాక్టికల్స్‌కు హాజరుకాలేదంటూ హాల్‌టికెట్లు ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్ నాశనం చేశారు..’’
– వాసవి కాలేజీ యజమాని శ్రీనివాస్
కాలేజీపై క్రిమినల్ కేసు
‘‘వాసవి కాలేజీ యాజమాన్యం విద్యార్థులను, ఇంటర్ బోర్డును కూడా మోసం చేసింది. కాలేజీ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. మేధా అనే ఒక మూతపడే కాలేజీ నుంచి వాసవి కాలేజీ ద్వితీయ సంవత్సర విద్యార్థులను తీసుకున్నారు. పర్యవరణ విద్య పరీక్ష రాయనపుడు, ప్రాక్టికల్స్ చేయనపుడు తల్లిదండ్రులు స్పందించలేదు. అప్పుడే స్పందించి ఉంటే ఇలా నష్టం జరిగేది కాదు..’’
– ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్