Board of Intermediate
-
తెలంగాణలో అక్టోబర్ 25 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. 2020-21 విద్యాసంవత్సరానికి చెందిన ఫస్టియర్ విద్యార్థులకు (ప్రస్తుతం సెకండియర్‌లో ఉన్న విద్యార్థులు) పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 70 శాతం సిలబస్ నుంచే ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందినే విధుల్లోకి తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్లో ఒకటి, రెండు ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, ఏఎన్ఎం లేదా స్టాఫ్ నర్సు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. చదవండి: సివిల్స్-2020 ఫలితాలు విడుదల పరీక్షల షెడ్యూల్ ► అక్టోబర్ 25న సెకండ్ లాంగ్వేజ్ ►అక్టోబర్ 26న: ఇంగ్లీష్ పేపర్ 1 ►అక్టోబర్ 27న: మాథ్స్ పేపర్1a,బొటనీ పేపర్1, పొలిటికల్ సైన్స్ 1 ►అక్టోబర్ 28న: మాథ్స్ పేపవర్ 1బీ, జూవాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 ►అక్టోబర్ 29న: ఫిజిక్స్ పేపర్1, ఎకనమిక్స్ పేపర్1 ►అక్టోబర్ 30 న: కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 ► నవంబర్ 1న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ►2న మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పేపర్లకు పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది విద్యాశాఖ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించని విషయం తెలిసిందే. నేరుగా సెకండ్ ఇయర్‌కు విద్యార్థులను ప్రమోట్ చేసింది. అయితే ప్రమోట్ అయిన విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. కరోనా పరిస్థితులు మళ్ళీ తలెత్తితే సెకండ్ ఇయర్లో మార్కులు కేటాయించడంపై ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రస్తుతం వారికి పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. -
సైన్స్‌లో సోనాలి కామర్స్‌లో సుగంధ ఆర్ట్స్‌లో భారతి
ఇంటర్ పరీక్షల నిర్వహణలో బిహార్ బోర్డు ఈసారి అన్ని రాష్ట్రాల కన్నా ముందుంటే, బిహార్ పరీక్షా ఫలితాల్లో అమ్మాయిలు ముందున్నారు. అమ్మాయిలు ముందుండటం అన్నీ రాష్ట్రాల్లోనూ యేటా అదొక సంప్రదాయంగా వస్తున్నప్పటికీ, కరోనా పరిస్థితుల్లో మనోబలాన్ని సడలనివ్వకుండా చక్కగా చదివి.. ఆర్ట్స్, కామర్స్, సైన్స్.. ఈ మూడు స్ట్రీమ్‌లలోనూ అమ్మాయిలే టాపర్లుగా నిలవడం విశేషం. సైన్స్‌లో సొనాలి కుమారి 94.2 శాతం మార్కులతో స్టేట్ ఫస్ట్ వచ్చింది. సైన్సే కష్టం అనుకుంటే, ఆమె కుటుంబ పరిస్థితులు ఇంకా కష్టమైనవి. రెండు కష్టాల మధ్య విజేతగా చదువును లాక్కొచ్చొని సొనాలి తండ్రి రిక్షా పుల్లర్! సోనాలికి స్వీట్ తినిపిస్తున్న కుటుంబ సభ్యులు. చిత్రంలో జీత్ సార్, సోనాలి తల్లిదండ్రులు (కుడి చివర) మార్చి 26 శుక్రవారం బిహార్ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలు వెల్లడయ్యాయి. మూడు విభాగాల్లో టాపర్‌గా విజయ కేతనాన్ని ఎగరేసిన వారు ముగ్గురూ అమ్మాయిలే! బిహార్‌లోని ఖగరియాకు చెందిన మధు భారతి 92.6 శాతం మార్కులతో ఆర్ట్స్‌లో, ఔరంగాబాద్‌కు చెందిన సుగంధ కుమారి 94.2 శాతం మార్కులతో కామర్స్‌లో స్టేట్ టాపర్లుగా నిలిచారు. సైన్స్‌లో టాప్ ర్యాంక్ కొట్టిన సోనాలి 500 కు 471 మార్కులు సాధించి తండ్రి కష్టానికి తగ్గ ఫలితాన్ని సాధించింది. సోనాలి నలందలోని శ్రీమతి పరమేశ్వరీ దేవి ఉఛ్తార్ మాధ్యమిక పాఠశాల విద్యార్థిని. బిహార్ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 13 వరకు జరిగాయి. మొత్తం 13.4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వాళ్లల్లో 10.45 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణశాతం 78.04. ఆ శాతం కంటే కూడా ఈ ముగ్గురు అమ్మాయిలు వ్యక్తిగతంగా సాధించిన శాతమే ఎక్కువ. ముగ్గురూ 90 అంకెను దాటేశారు. సోనాలి చదివిన పాఠశాలకు సమీపంలో బిహార్ షరిఫ్ అనే ప్రాంతంలో ఒక బస్టాండ్ ఉంది. ఆ బస్టాండ్‌లోనే తోపుడు బండిపై తినుబండారాలను అమ్ముతారు సోనాలి తండ్రి చున్నులాల్. ఆ సంపాదనే వారి కుటుంబానికి జీవనాధారం. ఓపిక ఉన్నప్పుడు ఆయన రిక్షాబండి లాగుతారు. గత ఏడాది లాక్డౌన్ అన్ని బతుకు బండ్ల ఇరుసులను లాగేసినట్లే సోనాలి తండ్రి జీవికనూ కనాకష్టం చేసేసింది. మరో వైపు సోనాలి పంతం పట్టినట్టుగా చదివింది. లాక్డౌన్ సమయం మొత్తాన్ని చదువుకే అంకితం చేసింది. ‘‘నాన్న కష్టపడేవారు. జీత్ సర్ కష్టపడి నన్ను చదివించేవారు. అమ్మ కష్టపడి నాకు అన్నీ అమర్చేది. జీత్ సార్ టెన్త్‌లో కూడా దగ్గరుండి మరీ నా డౌట్లు తీర్చేవారు. లాక్డౌన్లో సార్ మా ఇంటికే వచ్చి నాకు సబ్జెక్ట్‌లు టీచ్ చేసేవారు. ఆన్ లైన్ స్టడీస్ కోసం అప్పుడప్పుడు తన సెల్‌ఫోన్‌ను నాకు ఇచ్చేవారు. అమ్మ ఎప్పుడూ నా ఆకలిని కనిపెట్టుకుని ఉండేది. ఇంతమంది పడిన కష్టం మందు నేను ర్యాంకు సాధించడం పెద్ద విషయం కాదు అనిపిస్తుంది నాకు’’ అంటోంది సోనాలి! జీత్సార్కి, అమ్మకు నాన్నకు థ్యాంక్స్ చెబుతోంది. సోనాలి ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ అవాలని కలగంటోంది. ‘‘భవిష్యత్తులో యు.పి.ఎస్.సి. పరీక్షకు ప్రిపేర్ అవుతాను. నాకెప్పుడూ సమాజానికి, పేదవాళ్లకు సాయం చేయాలని ఉంటుంది. నాలా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం కూడా ఐ.ఎ.ఎస్. అధికారిగా నేను తప్పకుండా ఏదైనా చేసి తీరుతాను. ప్రతి విద్యార్థిలో ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభ వెలుగులోకి రాకుండా పేదరికం అడ్డుపడుతుంటుంది. కడుపులో పేగుల్ని ఆకలి మెలిపెడుతుంటే పుస్తకం ముందేసుకుని చదవగలడం కూడా ఆ పూటకు సాధించిన ర్యాంకే నా దృష్టిలో..’’ అంటోంది సోనాలి. -
అక్రమాలకు ‘బోర్డు’!
ఇంటర్మీడియట్ బోర్డులో అవినీతి బాగోతం - వాసవి కాలేజీ ఉదంతంతో మరోసారి బయటపడిన తీరు - రెండేళ్లుగా అనుమతి లేకున్నా కొనసాగిన కాలేజీ - గతేడాది అనుమతుల కోసం దరఖాస్తు - రూ. లక్షల్లో ముడుపులు పుచ్చుకున్న అధికారులు - తనిఖీలు చేశాక మరింత లంచం కోసం డిమాండ్ - యాజమాన్యం ఇవ్వకపోవడంతో పక్కన పెట్టిన వైనం - ముడుపులు ఇవ్వనందుకే బోర్డు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వలేదంటున్న యాజమాన్యం సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ బోర్డులో అవినీతి, అక్రమాల బాగోతం మరోసారి బయటపడింది. ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల నుంచి ముడుపులు పుచ్చుకునేందుకు అలవాటు పడిన అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు వాసవి కాలేజీ ఉదంతంతో స్పష్టమవుతోంది. రెండేళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండానే వనస్థలిపురంలో వాసవి కాలేజీ కొనసాగుతున్నట్లు అధికారులకు తెలిసినా.. లంచాలు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాసవి కాలేజీ అధికారుల అండదండలతో గతేడాది మరో ప్రైవేటు కాలేజీ ద్వారా తమ విద్యార్థులతో పరీక్షలు రాయించగా.. ఈసారి తమ కాలేజీ పేరిటే పరీక్షలు రాయించేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. రూ.లక్షల్లో ముడుపులు పుచ్చుకున్న అధికారులు అనుమతుల జారీ ప్రక్రియలో భాగంగా గతేడాది జూలైలోనే వాసవి కాలేజీలో తనిఖీలు చేశారు. అయినా అనుమతివ్వకుండా మరిన్ని ముడుపుల కోసం తమను పీడించారని కాలేజీ యాజమాన్యం ఆరోపిస్తోంది. పైగా తనిఖీలు చేసిన అధికారులు గుర్తింపు ఇస్తున్నారా, లేదా? అన్నది తేల్చకుండా ఇప్పటివరకు కాలేజీని ఎలా కొనసాగించారన్న దానికి బోర్డు నుంచి ఎలాంటి సమాధానం లేదు. మామూళ్ల మత్తులోనే..! అసలు సూర్యాపేటలో మూతపడిన వాసవి కాలేజీని రెండేళ్ల కిందట వనస్థలిపురంలో ఏర్పాటు చేసినా.. బోర్డు అధికారులు మామూళ్ల మత్తులో పడి చూసీ చూడనట్లు వదిలేశారు. అంతేకాదు గత జనవరిలో జరిగిన పర్యావరణ విద్య, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షలకు ఆ కాలేజీ విద్యార్థులు హాజరుకాలేదు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరగాల్సిన ప్రాక్టికల్ పరీక్షలనూ నిర్వహించలేదు. చివరకు యాజమాన్యం ఒత్తిడితో సూర్యాపేటలోని కాలేజీ పేరుతోనే విద్యార్థులు పరీక్ష రాసేందుకు వీలుగా వివరాలను అప్లోడ్ చేసేందుకు లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చారు. దాంతో వాసవి కాలేజీ యాజమాన్యం విద్యార్థుల వివరాలను అప్లోడ్ చేసింది. ఎలాగూ విద్యార్థుల వివరాలు అప్లోడ్ చేశాం కాబట్టి హాల్‌టికెట్లు వచ్చేస్తాయని, విద్యార్థులు పరీక్షలు రాస్తారని భావించింది. కానీ చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదుగానీ ఆ విద్యార్థులకు హాల్‌టికెట్లు రాలేదు. ఫలితంగా కాలేజీలోని 300 మందికి పైగా విద్యార్థులు ఒక విద్యా సంవత్సరం నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. దీనిపై తల్లిదండ్రులంతా ఆందోళనకు దిగడంతో కాలేజీ యాజమాన్యం చేసిన మోసం, బోర్డు అధికారుల అక్రమాలు బయటపడ్డాయి. అయితే విద్యార్థులు నష్టపోవద్దనే ఉద్దేశంతో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. ఆ కాలేజీ విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. లాగిన్ ఐడీ ఎలా ఇచ్చారు? ఇంటర్ చదివే విద్యార్థులు కచ్చితంగా పర్యవరణ విద్య, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షలు రాస్తేనే ఇంటర్ పరీక్ష పాస్ సర్టిఫికెట్ వస్తుంది. లేకపోతే ఇంటర్ ఉత్తీర్ణత పొందినట్లు సర్టిఫికెట్ ఇవ్వరు. ఇది బోర్డు అధికారులకు తెలుసు. పైగా విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు కూడా హాజరుకాలేదు. మరి ఈ రెండూ జరిగిపోయాక కూడా బోర్డు అధికారులు సూర్యాపేటలోని పాత కాలేజీ పేరుతో లాగిన్ ఐడీ ఎలా ఇచ్చారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అక్కడి కాలేజీ పేరుతో విద్యార్థుల వివరాలను ఎలా అప్లోడ్ చేయించారన్నది తేలాల్సి ఉంది. యాజమాన్యం వద్ద భారీగా ముడుపులు పుచ్చుకొని అధికారులే ఈ తప్పిదానికి కారణమయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లంచం ఇవ్వనందుకే.. ‘‘ఇంటర్ బోర్డు అధికారులు అడిగిన లంచం ఇవ్వనందుకే మా కళాశాల విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వలేదు. మా విద్యార్థులకు జరిగిన అన్యాయానికి బోర్డు అధికారులదే బాధ్యత. వారిపై చర్యలు చేపట్టాలి. గతేడాది జూన్‌లోనే అనుమతి కోసం దరఖాస్తు చేశాం. తనిఖీలు కూడా చేశారు. రూ.2 లక్షలు లంచం కూడా తీసుకున్నారు. ఇంకా రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వనందుకు జూన్ నుంచి బోర్డు చుట్టూ తిప్పుకుని చివరకు ఫిబ్రవరిలో లాగిన్ ఇచ్చారు. తీరా ప్రాక్టికల్స్‌కు హాజరుకాలేదంటూ హాల్‌టికెట్లు ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్ నాశనం చేశారు..’’ – వాసవి కాలేజీ యజమాని శ్రీనివాస్ కాలేజీపై క్రిమినల్ కేసు ‘‘వాసవి కాలేజీ యాజమాన్యం విద్యార్థులను, ఇంటర్ బోర్డును కూడా మోసం చేసింది. కాలేజీ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. మేధా అనే ఒక మూతపడే కాలేజీ నుంచి వాసవి కాలేజీ ద్వితీయ సంవత్సర విద్యార్థులను తీసుకున్నారు. పర్యవరణ విద్య పరీక్ష రాయనపుడు, ప్రాక్టికల్స్ చేయనపుడు తల్లిదండ్రులు స్పందించలేదు. అప్పుడే స్పందించి ఉంటే ఇలా నష్టం జరిగేది కాదు..’’ – ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ -
జేఈఈ మెయిన్‌లో ‘తెలంగాణ బోర్డు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి ఇంటర్ పరీక్షలు రాస్తున్నట్లుగా జేఈఈ మెయిన్ దరఖాస్తుల్లో మార్పు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చర్యలు చేపట్టిందని తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం వచ్చే నెల 4న ఆఫ్‌లైన్‌లో, 10, 11 తేదీల్లో ఆన్లైన్లో జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టిందని పేర్కొంది. ఇందులో భాగంగా తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డుకు చెందిన విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు తాము తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి పరీక్షలు రాస్తున్న అభ్యర్థులుగా వివరాలను నమోదు చేయాలని, ఆ తరువాతే హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ బోర్డు పేరు ఉన్న చోట తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ పేరు నమోదు చేయాలని స్పష్టం చేసింది. అలాగే దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఆప్షన్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి మార్చుకోవచ్చని వివరించింది. విద్యార్థులు స్టేట్ ఆప్షన్‌ను మార్చుకునేందుకు తమ దరఖాస్తు నంబరును jeemain@nic.in మెయిల్‌కు పంపించాలని సూచించింది.