సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి ఇంటర్ పరీక్షలు రాస్తున్నట్లుగా జేఈఈ మెయిన్ దరఖాస్తుల్లో మార్పు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చర్యలు చేపట్టిందని తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం వచ్చే నెల 4న ఆఫ్‌లైన్‌లో, 10, 11 తేదీల్లో ఆన్‌లైన్‌లో జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టిందని పేర్కొంది.
ఇందులో భాగంగా తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డుకు చెందిన విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు తాము తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి పరీక్షలు రాస్తున్న అభ్యర్థులుగా వివరాలను నమోదు చేయాలని, ఆ తరువాతే హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ బోర్డు పేరు ఉన్న చోట తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ పేరు నమోదు చేయాలని స్పష్టం చేసింది. అలాగే దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఆప్షన్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి మార్చుకోవచ్చని వివరించింది. విద్యార్థులు స్టేట్ ఆప్షన్‌ను మార్చుకునేందుకు తమ దరఖాస్తు నంబరును jeemain@nic.in మెయిల్‌కు పంపించాలని సూచించింది.
జేఈఈ మెయిన్‌లో ‘తెలంగాణ బోర్డు’
Published Sun, Mar 15 2015 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM
Advertisement