నైపుణ్యం, ఉద్యోగ డిమాండ్ల మధ్య తీవ్ర వ్యత్యాసం
ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యయనంలో వెల్లడి
సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో 52 శాతం మహిళలు
80 శాతం మంది 40 ఏళ్ల లోపే కెరీర్ విరమణ
ప్రపంచ జెండర్ గ్యాప్‌లో 129వ స్థానంలో భారత్
సాక్షి, అమరావతి : భారతదేశంలో సైన్స్ వర్క్ ఫోర్స్ తక్కువగా ఉన్నట్టు తేలింది. లింగ వివక్ష, భౌగోళిక పరిమితులు, చేసిన కోర్సుకు సరిపోయే పని లేకపోవడం వంటి కారణాలతో దేశ సైంటిఫిక్ టాలెంట్ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడం లేదు. దాంతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో నైపుణ్యం కలిగిన వారి కొరత ఉండటంతో ఆయా ఖాళీలు అలాగే ఉన్నాయని గుర్తించారు. ఇటీవల ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నైపుణ్యం గలవారి సరఫరా, ఉద్యోగ డిమాండ్ల మధ్య అసమతుల్యత, లింగ బేధం మహిళలను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని ఆ సంస్థ పేర్కొంది. దీంతో మహిళలు చాలా మంది తాము ఇష్టపడి ఎంచుకున్న రంగాల్లోనూ పూర్తి కాలం పని చేయకుండానే వెనుదిరుగుతున్నట్టు తేలింది.
కెరీర్ వదిలేసిన తర్వాత రీ–ఎంట్రీపై సరైన అవగాహన లేకపోవడంతో గ్యాప్ ఉత్పన్నమవుతోందని నివేదిక పేర్కొంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులు చేసి, శిక్షణ పొందిన చాలా మంది తమ నైపుణ్యానికి సరిపడే ఉద్యోగాలు చేయడం లేదని ఇండియన్ నేషనల్ యంగ్ అకాడమీ ఆఫ్ సైన్స్ గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, ఇంజినీరింగ్ వంటి రంగాల్లో 52 శాతం మంది మహిళలు ఉన్నారు. వీరిలో సగం మందికి పైగా 30 ఏళ్లలోపు వారే ఉన్నారని, అయితే పనిచేసే చోట వయసు ఆధారిత పక్షపాతం చూపడంతో 40 సంవత్సరాలకే 80 శాతం మంది కెరీర్‌ను వదులుకుంటున్నారని అధ్యయనంలో తేలింది. దేశంలో పరిశోధన– అభివృద్ధి (ఆర్ అండ్ డీ) రంగంలో సరఫరా డిమాండ్ మధ్య కూడా ఇదే వ్యత్యాసం కనిపిస్తోందని, నిపుణులు పెరుగుతున్నప్పటికీ అవకాశాలు తక్కువగా ఉన్నట్టు ఐఐటీ రోపాపర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నేహా సర్దానా పేర్కొన్నారు. విద్యా సంస్థలు, పరిశ్రమ అవసరాల మధ్య సమన్వయం లేకపోవడం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్టు అభిప్రాయపడ్డారు.
స్కిల్ ఉన్నా రీ ఎంట్రీపై అవగాహన లేమి
సైన్స్ రంగంలో ఉపాధి అవకాశాలు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా లేవని, భౌగోళికంగా అసమానతలు ఉన్నట్టు సర్వేలో గుర్తించారు. ఇది చాలా మంది నిపుణుల ఎంపికలను పరిమితం చేస్తోందని, ఆర్థిక లేదా కుటుంబ కారణాలతో మెట్రోపాలిటన్ ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారని గుర్తించారు. దీంతో నైపుణ్యం గల సైన్స్ అండ్ టెక్నాలజీ నిపుణుల సేవలను పెద్ద మొత్తంలో ఉపయోగించుకోలేకపోతున్నారు. కెరీర్‌లో విరామం తీసుకున్న నిపుణులకు అందుబాటులో ఉన్న రీ–ఎంట్రీ స్కీమ్‌లు, సపోర్ట్ ప్రోగ్రామ్‌లపై కూడా అవగాహన లేదని తేల్చారు.
ఐఐటీ–బొంబాయిలోని సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మాజీ సీఈవో పోయిని భట్ మాట్లాడుతూ.. వర్క్‌ఫోర్స్‌లోకి తిరిగి ప్రవేశించే మహిళలకు కొన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పారు. పని చేయించుకుంటున్న సంస్థలు లేదా కంపెనీలు మహిళలకు చైల్డ్ కేర్ సపోర్ట్ ఇవ్వాలని, పనిలో ఫ్లెక్సిబుల్ అవర్స్‌ని కల్పించాలన్నారు. ఇది నైపుణ్యం గల మహిళలు కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే తమ కెరీర్‌ను కొనసాగించేందుకు వీలు కల్పిస్తుందని తెలిపారు. భారత సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం మహిళా శాస్త్రవేత్తల రీ ఎంట్రీకి ‘వైజ్ కిరణ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టినా, దీని గురించి పెద్దగా ఎవరికీ తెలియదని సర్వే వెల్లడించింది.
ప్రపంచ సగటు కంటే చాలా తక్కువ
⇒ భారతదేశంలో పరిశోధన అభివృద్ధి (ఆర్ అండ్ డీ) విభాగంలో పనిచేసే వర్క్‌ఫోర్స్ ప్రపంచ సగటు కంటే చాల తక్కువగా ఉన్నట్టు సర్వే తేల్చింది. ఈ రంగంలో ప్రపంచ సగటు ప్రతి పది లక్షల మందిలో 1,198 మంది పని చేస్తుండగా, భారత్‌లో మాత్రం 255 మందే ఉన్నట్టు ప్రకటించింది.
⇒ వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం 2024 నివేదిక ప్రకారం భారత్‌లో జెండర్ గ్యాప్ గతేడాది కంటే పెరిగినట్టు పేర్కొంది. ప్రపంచంలో 146 దేశాల్లో చేసిన సర్వే ప్రకారం 2023లో ప్రపంచంలో భారత్ 127 స్థానంలో ఉండగా, గతేడాది ఈ ర్యాంకు 129కి చేరింది.
⇒ ర్యాంకింగ్‌లో మాల్దీవులు, పాకిస్థాన్ కంటే భారత్ కాస్త ముందుంది. ఈ గ్యాప్ తగ్గించాలంటే సౌకర్యవంతమైన పని ప్రదేశం, పార్ట్–టైమ్ అవకాశాలు, రిమోట్ విధానంలో పని చేసే అవకాశం కల్పించాలని శివ్ నాడార్ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ రూపమంజరి ఘోష్ తెలిపారు. ఈ విధానం ద్వారా మరింత మంది మహిళలు సైన్స్ వర్క్ ఫోర్స్‌లోకి వచ్చేందుకు అవకాశం లభిస్తుందన్నారు. వర్క్‌ఫోర్స్ నుంచి విరామం తీసుకుని, తిరిగి పనిలోకి వచ్చే మహిళలపై చిన్నచూపు ఉందని, ఇది తొలగి పోవాలన్నారు.
⇒ విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య భాగస్వామ్యం.. నైపుణ్యాల మధ్య అంతరాన్ని తగ్గిస్తుందని, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా స్కిల్స్ పెంచవచ్చని ఘోష్ చెప్పారు. అలాగే, ఉద్యోగాల పదోన్నతుల్లో ‘బయోలాజికల్ ఏజ్’ కంటే ‘విద్యా వయస్సు’ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా నైపుణ్యం గల సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment