జాలువారుతున్న డుడుమ జలపాతం
సహజ ప్రకృతి సందడి చేస్తోంది.. పర్యాటకుల పలకరింతలతో కొండకోనలు పులకరిస్తున్నాయి.. అలరారుతున్న అందాలని చూసి.. ఎన్నాళ్లకెన్నాళ్లకంటూ సందర్శకులు సంబరపడుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఇన్నాళ్లూ ఒంటరైన పర్యాటకం.. సందర్శకుల అడుగుల సడితో కొత్త రూపు సంతరించుకుంది. కోవిడ్–19 కారణంగా వెలవెలబోయిన టూరిజం.. నెమ్మది నెమ్మదిగా కోలుకుంటోంది. ప్రస్తుతం రోజుకు వెయ్యి మంది వరకూ జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు.
సాక్షి, విశాఖపట్నం: కరోనా కారణంగా పడకేసిన పర్యాటక రంగం మళ్లీ ఊపందుకుంది. సుమారు ఐదున్నర నెలల పాటు మూతపడిన పర్యాటక కేంద్రాలు కళకళలాడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల పునఃప్రారంభానికి ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన ప్రకృతి ప్రేమికులు.. ఇప్పుడు సందర్శన స్థలాల్లో విహరించేందుకు అడుగులు వేస్తున్నారు.
ఆగస్ట్‌లో లక్ష మంది మాత్రమే..
పర్యాటక ప్రాంతాలతో, సహజ సిద్ధమైన అందాలతో భాసిల్లుతున్న విశాఖ జిల్లాకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకుల తాకిడి క్రమంగా పెరుగుతోంది. కరోనాకు పూర్వం జిల్లాలో నెలకు సుమారు 15 నుంచి 18 లక్షల మంది పర్యాటకులు వచ్చేవారు. కోవిడ్–19 కారణంగా లాక్‌డౌన్ విధించడంతో సందర్శకుల సంఖ్య సున్నాకు పడిపోయింది. 2019 జనవరి నుంచి జూలై వరకూ 1,57, 86,500 మంది పర్యాటకులు జిల్లాను సందర్శించగా.. ఈ ఏడాది మార్చి 21 వరకూ 26,71,579 మంది మాత్రమే సందర్శించారు. జూలై వరకు లాక్‌డౌన్ ఉండటంతో ఒక్క పర్యాటకుడు కూడా జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లలేదు. అదే విధంగా.. 2019 ఆగస్టులో 19,43,392 మంది రాగా.. ఈ ఏడాది ఆగస్ట్‌లో కేవ లం లక్ష మంది మాత్రమే సందర్శకులు వచ్చారు. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఆంధ్రా ఊటీకి రోజుకు 200 మంది..
ఆంధ్రా ఊటీ అరకు ప్రాంతానికి సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ఇన్నాళ్లూ టూరిస్టులు లేక బోసిపోయిన మన్యం.. ఇప్పుడు వారి రాకతో కళకళలాడుతోంది. ఇప్పుడిప్పుడే పర్యాటకానికి అనుమతులు లభించడంతో అక్టోబర్‌నాటి కల్లా.. పర్యాటకం పుంజుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. అరకు, పాడేరు, బొర్రా గుహలు మొదలైన ప్రాంతాలను రోజుకు 200 మంది సందర్శిస్తున్నారు. వారాంతాల్లో మాత్రం ఈ సంఖ్య 5 రెట్లకు పెరిగి వెయ్యి మంది వరకు వస్తున్నారు. అయితే గతేడాది మాత్రం ఏజెన్సీకు రోజుకు 1000 నుంచి 1500 మందికి పైగా రాగా.. వారాంతాల్లో 3 వేలకు పైగా మన్యం అందాలు చూసేందుకు పర్యాటకులు వచ్చేవారు.
డముకు వ్యూ పాయింట్ వద్ద సందర్శకులు..
తీర ప్రాంతాల్లో జనసందడి
ఐదున్నర నెలల తరువాత వీఎంఆర్‌డీఏ ఆధీనంలో ఉన్న పార్కులు, మ్యూజియాలు, సందర్శన కేంద్రాలు తెరుచుకున్నాయి. కైలాసగిరి, వైఎస్సార్ సెంట్రల్ పార్కు, తెన్నేటి పార్కులతో పాటు అన్నింటినీ పునఃప్రారంభించడంతో సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. తీర ప్రాంతాల్లో జనసందడి నెలకొంటుంది. బీచ్ ఒడ్డున సేదతీరుతూ ఆస్వాదిస్తున్నారు.
దసరాకు పెరిగే అవకాశం
జిల్లాకు వస్తున్న పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆర్‌కే బీచ్, ఏజెన్సీలు కళకళలాడుతున్నాయి. ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రతి పర్యాటక కేంద్రం వద్ద పూర్తి రక్షణాత్మక చర్యలు చేపడుతున్నాం. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నాం. కొన్ని ప్రాంతాలకు ఇంకా సందర్శకులకు అనుమతి లేకపోవడంతో నెమ్మదిగా పుంజుకుంటోంది. దసరా నాటికి పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నాం.
– ఆర్.పూర్ణిమాదేవి, జిల్లా పర్యాటక అధికారి
అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే..
కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం, టీయూ –142 మ్యూజియం వంటి ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున.. వాటిలో సందర్శకులకు ఇంకా అనుమతించలేదు. కైలాసగిరి రోప్‌వే, టాయ్ ట్రైన్ ఆరు నెలలుగా ప్రారంభించకపోవడంతో వాటికి పూర్తిస్థాయి మరమ్మతులు నిర్వహిస్తున్నాం. ట్రయల్ రన్ వేసి, తర్వాత ప్రారంభిస్తాం.
–పి.కోటేశ్వరరావు, వీఎంఆర్‌డీఏ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment