చింతపల్లి: మంచు ముసుగేసుకున్న ప్రకృతిని.. శీతల గాలుల మధ్య వీక్షించేందుకు పర్యాటకులు లంబసింగికి పరుగులు తీస్తారు. అత్యంత ఎత్తులో ఉన్న ఆ ప్రదేశంలో వాతావరణం భిన్నంగా ఉంటుంది. అక్కడ రాత్రి బస చేస్తే ఆ అనుభూతే వేరు. అలాంటి ఎన్నో మధురానుభూతులను సొంతం చేసుకునేందుకు టూరిజం శాఖ ప్రత్యేక ప్యాకేజీని ప్రారంభించింది. శనివారం పర్యాటకులు ప్రత్యేక బస్సులో విశాఖ నుంచి లంబసింగి చేరుకున్నారు. స్థానిక టూరిజం మేనేజర్ సూరెడ్డి అప్పలనాయుడు అక్కడి నుంచి లాంఛనంగా ఈ యాత్రను ప్రారంభించారు.
ప్రతి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు..
ఈ యాత్ర విశాఖ ఎంవీపీ కాలనీలోని ఏపీ టూరిజం వారి హరిత హోటల్ నుంచి ప్రతి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుందని టూరిజం మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. అక్కడ భోజనాలు చేసిన తర్వాత బయలుదేరి నర్సీపట్నం మీదుగా లంబసింగి చేరుకుని ఇక్కడ రాత్రి బస చేస్తారు. ఇక్కడి అందాలను వేకువజామున వీక్షించిన తర్వాత అల్పాహారం ముగించి జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతాలకు బయలుదేరుతారు.
అక్కడ నుంచి పాడేరు మోదకొండమ్మ ఆలయం, హుకుంపేట మండలంలోని మత్స్యగుండం పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. అక్కడ నుంచి పాడేరు మీదుగా విశాఖపట్నం తిరుగు పయనమవుతారు. పర్యాటకులు బయలుదేరిన దగ్గర నుంచి లంబసింగిలో బస, రెండు రోజుల భోజనం, అల్పాహారం, బస్సు చార్జీతో కలిపి పెద్దలకు రూ.1970, పిల్లలకు రూ.1650లు టికెట్ ధరగా నిర్ణయించారు.
వావ్.. బొర్రా కేవ్స్
అనంతగిరి (అరకు): ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు పర్యాటకులు శనివారం పోటెత్తారు. ప్రస్తుతం పిక్నిక్ సీజన్ కావడంతో మన్యంలోఅందాలు తిలకించేందుకు భారీగా తరలివస్తున్నారు. వలిసెపూల తోటలు పర్యాటకులను ఆహ్వానం పలుకుతున్నాయి. అరకు–డుంబ్రిగుడ, అనంతగిరి విశాఖ ప్రధాన రహదారి ఆనుకుని వలిసెపూల మధ్య సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడిచేస్తున్నారు. శనివారం బొర్రాగుహలను 5400 మంది తిలకించగా, సుమారు రూ.3.74 లక్షల ఆదాయం వచ్చిందని మేనేజర్ గౌరీ శంకర్ తెలిపారు.
కొత్తపల్లి.. అందాల లోగిలి
జి.మాడుగుల: పలు ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులతో కొత్తపల్లి జలపాతాల వద్ద సందడి నెలకొంది. వీకెండ్ కావడంతో భారీగా పర్యాటకులు తరలివచ్చారు. జలపాతాల్లో గంటలు తరబడి సందర్శకులు జలకాలాడారు. జలపాతాల వ్యూపాయింట్ వద్ద
సెలీ్ఫలతో సందడి చేశారు.
సీతమ్మ పర్వతం.. అద్భుతం
హుకుంపేట : మన్యంలో అతిపెద్ద కొండ సీతమ్మ పర్వతాన్ని (జెండాకొండా) సబ్ కలెక్టర్ వి.అభిõÙక్ సందర్శించారు. శనివారం వేకువ జామునే పాడేరు నుంచి తీగలవలస పంచాయతీ ఓలుబెడ్డా గ్రామానికి చేరుకుని అక్కడనుంచి గిరిజనులతో కలిసి వేకువ జామునే సుమారు నాలుగు కిలోమీటర్లు మేర కాలినడకన ప్రయాణించారు. కొండలు, గుట్టలు, వాగులు దాటుకుంటూ కొండపైకి చేరుకుని మంచు అందాలను ఆస్వాదించారు. కొండాలో ఉన్న చరిత్ర కలిగిన తేనేపట్టు గుహలు, దింసారాళ్లు, తిరిగలి రాళ్లు, బ్రిటిషు వాళ్లు నిర్మించిన జెండా కోటను చూసి ఆకర్షితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో జెండాకొండ పర్యాటక కేంద్రంగా భాసిల్లడం ఖాయమన్నారు.
సబ్ కలెక్టర్‌కు సన్మానం
జెండా కొండకు మొదటిసారి సబ్ కలెక్టర్ అభిషేక్ రావడంతో గిరిజనులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, జిల్లా వ్యవసాయ సలహామండలి సభ్యుడు ముత్యంగి విశ్వేశ్వరరావు, తీగలవలస సర్పంచ్ పంగి బేసు, ఎంపీటీసీ కొర్ర నాగరాజు, నాయకులు భవాణి శంకర్ తదితరులు సత్కరించారు.
మంచుకురిసే వేళలో..
పాడేరు : పొగమంచుతో పాటు మేఘాల కొండగా విశ్వవ్యాప్తి పొందిన వంజంగి హిల్స్‌కు శనివారం వేకువజామున పర్యాటకులు పోటెత్తారు. రెండవ శనివారం కావడంతో వీకెండ్ డేస్‌ను దృష్టిలో పెట్టుకుని అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులంతా వంజంగి హిల్స్‌కు చేరుకుని ఇక్కడ ప్రకృతి అందాలను వీక్షించారు. పర్యాటకుల రద్దీతో వంజంగి హిల్స్‌లోని అన్ని ప్రాంతాలు సందడిగా మారాయి. ఇక్కడ ప్రకృతి అందాలను పర్యాటకులు వీక్షించి పరవశించారు. ఉదయం 10గంటల వరకు వంజంగి హిల్స్‌లో పర్యాటకుల తాకిడి నెలకొంది. అలాగే పాడేరు ఘాట్‌తో పాటు మోదకొండమ్మ తల్లి ఆలయానికి కూడా పర్యాటకులు భారీగా తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment