గెరిల్లా వార్‌ నుంచి.. పీపుల్స్‌ ఆర్మీ దిశగా.. | Maoists to observe Week Celebrations from December 2 to December 8 | Sakshi
Sakshi News home page

గెరిల్లా వార్‌ నుంచి.. పీపుల్స్‌ ఆర్మీ దిశగా..

Published Sun, Dec 1 2024 1:47 PM | Last Updated on Sun, Dec 1 2024 6:27 PM

Maoists to observe Week Celebrations from December 2 to December 8

డిసెంబర్‌ 2 నుంచి వారోత్సవాలకు పిలుపు 

ఆరంభంలో పీఎల్‌జీఏ వరుస విజయాలు 

ఆపరేషన్‌ కగార్‌తో కుదేలవుతున్న పీఎల్‌జీఏ

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భారత సాయుధ దళాలు బస్తర్‌ జంగిల్‌లో వేగంగా చొచ్చుకుపోతున్నాయి. మరోవైపు మావోయిస్టు పార్టీకి చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) 24వ వారోత్సవాలకు సిద్ధమవుతోంది. తుపాకుల నీడలో డిసెంబర్‌ 2 నుంచి 8 వరకు జరగనున్న వారోత్సవాల నేపథ్యంలో పీఎల్‌జీఏ ప్రస్థానంపై ప్రత్యేక కథనమిది.

చేజారుతున్న దండకారణ్యం
మావోయిస్టు పార్టీకి ఉన్న అనేక కమిటీల్లో అత్యంత శక్తివంతమైనది దండకారణ్యం స్పెషల్‌ జోనల్‌ కమిటీ. పదేళ్ల కిందట ఇక్కడ ఐదువేల మంది సాయుధ సభ్యులు ఆ పార్టీకి ఉన్నట్టుగా చెబుతారు. మావోయిస్టుల జనతన సర్కార్‌ కల ఇక్కడ సాకారమైంది. అయితే ఇప్పుడిక్కడ సాయుధ దళాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టుగా పేరున్న హిడ్మా సొంతూరు పూవర్తిలో.. ప్రభుత్వ దళాలు ఫిబ్రవరిలో క్యాంపు ఏర్పాటు చేశాయి. అంతేకాదు.. విప్లవ పోరాటాలకు నాంది పలికిన నేతల్లో ఒకరైన కొండపల్లి సీతారామయ్య పేరు మీద ఏర్పాటైన కొండపల్లి గ్రామంలోనూ ఇటీవల క్యాంపు వచ్చింది. మరోవైపు మావోయిస్టుల కంచుకోటైన అబూజ్‌మడ్‌లో అక్టోబర్‌ 4న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 38 మంది చనిపోయారు. ఇటీవల చోటుచేసుకుంటున్న ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లు, అరెస్టులతో మావోయిస్టుల బలం తగ్గుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

భీకర దాడులు
పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీలో ప్రధానంగా జన మిలీషియా, గెరిల్లా స్క్వాడ్, ప్లాటూన్‌/కంపెనీలు ఉంటాయి. క్షేత్రస్థాయిలో పని చేసే జన మిలీషియాలో గ్రామస్తులే ఎక్కువ మంది ఉంటారు. ఆయుధం పట్టడం కంటే.. పార్టీకి ఇంటెలిజెన్స్‌ వింగ్‌లో పని చేస్తే, సంచరించే ప్లాటూన్లు అక్కడి పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తాయి. మెరుపు దాడుల పని గెరిల్లా దళాలది. పీఎల్‌జీఏ ఏర్పాటైన తర్వాత తొలి ఐదారేళ్లలో దేశవ్యాప్తంగా రెడ్‌ కారిడార్‌ పరిధిలోకి వచ్చే రాష్ట్రాల్లో అనేక దాడులు జరిగాయి. 2004 నుంచి 2011 వరకు చేపట్టిన దాడుల్లోనే 2 వేల వరకు ఆయుధాలు, రెండు లక్షల రౌండ్లకు పైగా తూటాలను ప్రభుత్వ బలగాల నుంచి మావోలు లూటీ చేయగలిగారు. ఈ సమయంలో రెడ్‌ కారిడార్‌ పరిధిలో పదివేల మందికి పైగా సభ్యులు పీఎల్‌జీఏకు ఉన్నట్టు అంచనా. ఇలా పెరిగిన సాయుధ సంపత్తితో అనేక హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ రక్తపాతం సృష్టించారు. అత్యధికంగా 2010లోనే మావోయిస్టులు జరిపిన దాడుల్లో 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

‘కొయ్యూరు’తో బీజం
పీపుల్స్‌ వార్‌ నక్సలైట్ల ప్రభావం 90వ దశకంలో ఉత్తర తెలంగాణలో ఎక్కువగా ఉండేది. ఈ సమయంలో 1999 డిసెంబర్‌ 2న.. అప్పటి కరీంనగర్‌ జిల్లా కొయ్యూరు దగ్గర జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోశ్‌రెడ్డి, శీలం నరేశ్‌ మృతి చెందారు. వీరి ప్రథమ వర్ధంతి సందర్భంగా పీపుల్స్‌ గెరిల్లా ఆర్మీని.. 2000 డిసెంబర్‌ 2న పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత దేశంలో ఉన్న సాయుధ విప్లవ శక్తులన్నీ కలిసి 2004 సెప్టెంబర్‌ 21న భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)గా ఒక్కతాటిపైకి వచ్చాయి. దీంతో పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ పేరును పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)గా మార్చారు. 

ఈ సందర్భంగా మావోయిస్టు అగ్రనేతలు మాట్లాడుతూ.. ప్రజల ఇబ్బందులను తెలుసుకుని వాటి పరిష్కారానికి పీఎల్‌జీఏ ప్రయత్నిస్తుందని ప్రకటించారు. తమ సమస్యలు పరిష్కారమైనప్పుడు ప్రజలే స్వచ్ఛందంగా పీఎల్‌జీఏకు మద్దతుగా నిలుస్తారని, ఆ మద్దతు సాయంతో సాయుధ విప్లవం విజయవంతమవుతుందనే ధీమా వ్యక్తం చేశారు. విప్లవం సిద్ధించిన తర్వాత గెరిల్లా ఆరీ్మనే పీపుల్స్‌ ఆర్మీ (ప్రజా సైన్యం)గా రూపాంతరం చెందుతుందని నమ్మారు.

కౌంటర్‌ ఎటాక్‌ 
పెరిగిన హింసతో మావోయిస్టుల ఏరివేతకు ప్రభుత్వం 2009లో ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ను ప్రారంభించింది. అయితే ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం రెడ్‌ కారిడార్‌లో మావోయిస్టులకు గట్టి పట్టు చిక్కేలా చేస్తే, అక్కడి దట్టమైన అడవులు, ఎత్తయిన కొండలు, పొంగిపొర్లే వాగులు ఆ ప్రాంతాన్ని శత్రుదుర్భేద్యంగా మార్చాయి. ఫలితంగా ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌కు ఆరంభంలోనే అనేక ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ ఘటనల నుంచి పాఠాలు నేర్చుకున్న ప్రభుత్వ బలగాలు ఆపరేషన్‌ సమాధాన్, ప్రహార్‌ అంటూ పక్కా ప్రణాళికతో మావోయిస్టులపై పోరాటానికి దిగాయి. దీంతో క్రమంగా రెడ్‌కారిడార్‌ కుచించుకుపోతూ వచ్చింది. ఆపరేషన్‌ కగార్‌ (ఫైనల్‌ మిషన్‌)తో ఆఖరికి బస్తర్‌ అడవుల్లోనూ పీఎల్‌జీఏకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.

నంబాళ్ల.. కిషన్‌జీ.. హిడ్మా
పీఎల్‌జీఏకు అనేక మంది నాయకత్వం వహించినా.. ప్రస్తుత చీఫ్‌ నంబాళ్ల కేశవరావు ఆలియాస్‌ బస్వరాజ్, మల్లోజుల కోటేశ్వరరావు ఆలియాస్‌ కిషన్‌జీ, మడావి హిడ్మా చేపట్టిన డేరింగ్‌ ఆపరేషన్లు సంచలనం సృష్టించాయి. 2010లో జరిగిన చింతల్నార్‌ ఘటనలో 76 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు పీఎల్‌జీఏ దాడిలో చనిపోగా.. ఆ తర్వాత 2013లో జరిపిన దాడిలో సల్వాజుడుం సృష్టికర్త మహేంద్రకర్మతో పాటు 27 మంది మృతి చెందారు. 

చ‌ద‌వండి: ఏపీ జడ్జిగా తెలంగాణ అమ్మాయి

కిషన్‌జీ నేతృత్వంలో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన పోరాటాలు సుదీర్ఘ కాలం అక్కడ కొనసాగిన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చేశాయి. ప్రస్తుతం పీఎల్‌జీఏ కంపెనీ 6కు నాయకత్వం వహిస్తున్న హిడ్మా, ఇప్పుడు అత్యంత ప్రమాదకర మావోయిస్టుగా గుర్తింపు పొందారు. 2021 ఏప్రిల్‌ 4న హిడ్మా నాయకత్వంలో తెర్రం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిపిన దాడిలో 22 మంది జవాన్లు మృత్యువాత పడ్డారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement