revenue target
-
రూ.1,000 కోట్లు టార్గెట్.. హైదరాబాద్‌లో తయారీ కేంద్రం
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ఉత్పత్తుల సంస్థ ‘మివి’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) రూ.1,000 ఆదాయాన్ని సాధించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. మరిన్ని విభాగాల్లో ఉత్పత్తులను ఆవిష్కరించడంతోపాటు మరిన్ని ప్రాంతాలకు కార్యకలాపాలను విస్తరించడం, కొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, మార్కెటింగ్ వ్యూహాల అమలు ద్వారా దీన్ని సాధించనున్నట్టు మివి సహ వ్యవస్థాపకులు మిధుల దేవభక్తుని, విశ్వనాథ్ కందుల ప్రకటించారు.ఈ సంస్థ 2024–25లో రూ.300 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయడం గమనార్హం. 1,500 మందికి ఉపాధి కల్పిస్తోంది. కంపెనీ విస్తరణ ప్రణాళికల గురించి ఓ వార్తా సంస్థతో సహ వ్యవస్థాకులు వివరాలు పంచుకున్నారు. ఐవోటీ డివైజ్‌లు, స్మార్ట్ వేరబుల్స్, స్మార్ట్ సీసీటీవీ కెమెరాలు, స్పీకర్లలోని ప్రవేశించనున్నట్టు చెప్పారు. అలాగే, ప్రస్తుత ఆడియో, మొబైల్ యాక్సెసరీల కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్టు తెలిపారు. ఇయర్ బడ్స్‌ను విడుదల చేయడం ద్వారా తొలుత ఇయర్ఫోన్లలోకి ప్రవేశించనున్నట్టు మిధుల ప్రకటించారు.ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్ ‘మివి ఏఐ’ని కంపెనీ ఇటీవలే ఆవిష్కరించడం గమనార్హం. తన ఉత్పత్తులకు ఏఐ టెక్నాలజీని జోడించడం ద్వారా కస్టమర్లకు మెరుగైన అనుభవం ఇచ్చే లక్ష్యంతో ఉంది. ఈ ఏఐ ప్లాట్‌ఫామ్ సాయంతో తమ ఆదాయాలను రెట్టింపు చేసుకోనున్నట్టు కంపెనీ వ్యవస్థాపకులు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ప్రజల నుంచి నిధులు (ఐపీవో) సమీకరించనున్నట్టు చెప్పారు. హైదరాబాద్ కేంద్రంలో కార్యకలాపాలు...హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న తయారీ కేంద్రం జూన్ నాటికి కార్యకలాపాలు మొదలు పెడుతుందని మివి ప్రమోటర్లు ప్రకటించారు. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ సదుపాయం ద్వారా విడిభాగాల తయారీపై దృష్టి సారిస్తామని, అంతర్జాతీయ బ్రాండ్లతో భాగస్వామ్యాలను కుదుర్చుకోనున్నట్టు తెలిపారు. యూఎస్, మధ్యప్రాచ్యం, యూరప్ మార్కెట్లలోకి విస్తరించనున్నట్టు చెప్పారు. -
ఐపీఓ అరంగేట్రం.. రిక్రూట్మెంట్ కంపెనీ సన్నాహాలు
రిక్రూట్మెంట్ అండ్ టెక్నాలజీ కన్సల్టింగ్ సంస్థ ఎక్స్‌ఫెనో మరింత వృద్ధిపై దృష్టి సారించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.300 కోట్ల ఆదాయాన్ని సాధించిన ఉత్సాహంతో 2026 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.500 కోట్ల ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో రాబోయే ఐపీఓ అరంగేట్రం కోసం కంపెనీ సన్నాహాలు చేస్తోంది.ఐపీవో సన్నాహాల్లో భాగంగా సీనియర్ లీడర్ షిప్లో కీలక మార్పులు చేసింది. గతంలో సహ వ్యవస్థాపకులు కమల్ కారంత్, అనిల్ ఎథనూర్ నిర్వహించిన బాధ్యతలను క్రమబద్ధీకరిస్తూ ఫ్రాన్సిస్ పడమడన్ను కాబోయే సీఈఓగా ప్రకటించింది. ఈ నాయకత్వ మార్పుతో కంపెనీ స్పెషలిస్ట్ సిబ్బంది, వ్యూహాత్మక గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ భాగస్వామ్యాల అభివృద్ధి, కొత్త ప్రాంతాలకు విస్తరించడంపై దృష్టి పెడుతోంది."ఎదుగుదలలో మేమిప్పడు కీలక దశలో ఉన్నాం. ఫ్రాన్సిస్ నాయకత్వంలో మా నాయకత్వ బృందం నడవడం స్పెషలిస్ట్ స్టాఫింగ్ స్పేస్‌లో ఆధిపత్య కంపెనీగా మారడానికి ఒక కీలకమైన దశ" అని ఎక్స్‌ఫెనో సహ వ్యవస్థాపకుడు కమల్ కారంత్ అన్నారు.భారతదేశ 6 బిలియన్ డాలర్ల స్పెషలిస్ట్ స్టాఫింగ్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏటా 40 కి పైగా కొత్త జీసీసీలు దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ఐటీ టాలెంట్ పూల్స్ నుండి సుమారు 20,000 కొత్త నియామకాలు ఉన్నాయి. అదే సమయంలో ప్రతి సంవత్సరం 50,000 మందికి పైగా సాఫ్టవేర్ ఇంజనీర్లు భారత్ నుండి వలసపోతున్నారని, ఇది ప్రత్యేకమైన సిబ్బంది అవకాశాలను సృష్టిస్తుందని కంపెనీ తెలిపింది.2017లో స్థాపించిన ఎక్స్‌ఫెనో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్పెషలిస్ట్ స్టాఫింగ్ సంస్థ. ఇది జీసీసీలు, పెద్ద సంస్థల కోసం 23,000 మందికి పైగా టెక్ నిపుణులను నియమించింది. ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై, హైదరాబాద్ సహా ముఖ్యమైన భారతీయ నగరాలతో పాటు అంతర్జాతీయంగా యూఎస్‌లోనూ ఉనికిని కలిగి ఉంది. -
భారీ లక్ష్యంతో దిశగా ఐఆర్ఈడీఏ - 2025 నాటికి..
న్యూఢిల్లీ: భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి ఏజెన్సీ (ఐఆర్ఈడీఏ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4,350 కోట్ల ఆదాయన్ని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. అలాగే, 2025 మార్చి నాటికి రూ.5,220 కోట్లకు చేరుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర నూతన, పునరుత్పాదక శాఖ (ఎంఎన్ఆర్ఈ)తో ఇందుకు సంబంధించి పనితీరు ఆధారిత అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ఎంవోయూ ప్రకారం నిర్ధేశించిన మేర ఆదాయ లక్ష్యాలను ఐఆర్ఈడీఏ చేరుకోవాల్సి ఉంటుంది. రిటర్న్ ఆన్ నెట్‌వర్త్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయీడ్, రుణాల్లో ఎన్పీఏ రేషియో, అస్సెట్ టర్నోవర్ రేషియో తదితర పనితీరు ఆధారిత లక్ష్యాలు ఇందులో భాగంగా ఉన్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.3,482 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసినట్టు ఐఆర్ఈడీఏ ప్రకటించింది. ‘‘జూన్ త్రైమాసికంలో రుణాల పంపిణీలో 272 శాతం వృద్ధి నమోదు చేశాం. పన్ను అనంతరం లాభంలో 30 శాతం వృద్ధి నమోదైంది’’అని ఐఆర్ఈడీఏ సీఎండీ ప్రదీప్ కుమార్ దాస్ తెలిపారు. నికర నిర్ధరక రుణాలు (ఎన్పీఏలు) 2.92 శాతం నుంచి 1.61 శాతానికి తగ్గినట్టు చెప్పారు. -
రెవెన్యూ లక్ష్యాన్ని అధిగమిస్తాం
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల నూతన డీఐజీ లక్ష్మీకుమారి కాకినాడ లీగల్ : ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖకు ఇచ్చిన రెవెన్యూ లక్ష్యాన్ని అధిగమించేందుకు కృషి చేస్తామని జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ పి.లక్ష్మీకుమారి శనివారం విలేకరులకు తెలిపారు. హైదరాబాద్‌లో ఐజీ కార్యాలయంలో డీఐజీగా విధులు నిర్వహిస్తూ, బదిలీపై ఆమె జిల్లాకు వచ్చారు. ఇప్పటి వరకు విధులు నిర్వహించిన డీఐజీ ఎం.సాయిప్రసాద్ కర్నూలు నోడల్ డీఐజీగా బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా డీఐజీ లక్ష్మీకుమారి మాట్లాడుతూ జిల్లాలో స్టాంపుల ముద్రణ యంత్రాలు మరమ్మతులకు గురయ్యాయని, నూతన యంత్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పారు. అలాగే క్రయవిక్రయదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. నోటరీ అడ్వకేట్లు రెన్యువల్ చేసుకోకుండా నోటరీ చేయరాదని తెలిపారు. ఆమెను జిల్లా రిజిస్ట్రార్ బాలప్రకాష్, సబ్ రిజిస్ట్రార్లు ఎం.రాజబాబు, ఆర్వీ రామారావు తదితరులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.