గతవారం బిజినెస్‌ | last week business story's | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్‌

Published Mon, Feb 27 2017 2:08 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM

గతవారం బిజినెస్‌ - Sakshi

మార్చి 8న డి–మార్ట్‌ ఐపీఓ
డి–మార్ట్‌ సూపర్‌ మార్కెట్‌ రిటైల్‌ చెయిన్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మార్చి 8న రానున్నది. అదే నెల 10న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ సంస్థ రూ.1,870 కోట్లు సమీకరించనున్నది. గత ఏడాది అక్టోబర్‌లో వచ్చిన రూ.3,000 కోట్ల పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఐపీఓ తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపులకు, కొత్త స్టోర్ల ఏర్పాటుకు వినియోగించాలని అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ యోచిస్తోంది. కాగా రైల్వేలకు చెందిన మూడు సంస్థలు ఐఆర్‌సీటీసీ, ఐఆర్‌ఎఫ్‌సీ, ఐఆర్‌సీఓఎన్‌లు త్వరలో ఐపీఓకు రానున్నాయి. ఈ మూడు సంస్థల్లో కొంత వాటాలను ఐపీఓ ద్వారా విక్రయించనున్నారు.

‘భారత్‌క్యూఆర్‌ కోడ్‌’ ఆవిష్కరణ
క్యాష్‌లెస్‌ ఎకానమీ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రపంచపు తొలి ఇంటర్‌పోర్టబుల్‌ పేమెంట్‌ యాక్సప్టెన్సీ సొల్యూషన్‌ ’భారత్‌క్యూఆర్‌ కోడ్‌’ను ఆవిష్కరించింది. దీంతో రిటైల్‌ ఎలక్ట్రానిక్‌ పేమెంట్స్‌ మరింత సులభతరం కానున్నాయి.  ’భారత్‌క్యూఆర్‌ కోడ్‌’ విధానంలో వ్యాపారుల ఐడీ, ఫోన్‌ నంబర్‌ వంటివి అవసరం లేకుండానే లావాదేవీలు నిర్వహించవచ్చు. వ్యాపారులు కేవలం ఒక క్యూఆర్‌ కోడ్‌ను మాత్రమే కలిగి ఉంటారు. కస్టమర్లు ఆ కోడ్‌ను స్కాన్‌ చేసి అమౌంట్‌ను ఎంటర్‌ చేసి పేమెంట్‌ చేసేయొచ్చు. ఇక్కడ డబ్బులు డైరెక్ట్‌గా మర్చంట్‌ బ్యాంక్‌ ఖాతాకు చేరిపోతాయి. స్వైపింగ్‌ మెఫీన్లతో పనిలేదు.  

యాహూ–వెరిజోన్‌ డీల్‌ విలువ తగ్గింపు
వరుసగా రెండు సార్లు డేటా హ్యాకింగ్‌ ఉదంతాల నేపథ్యంలో టెక్నాలజీ దిగ్గజం యాహూ తమ ఇంటర్నెట్‌ వ్యాపార విభాగం విక్రయ విలువను 350 మిలియన్‌ డాలర్ల మేర తగ్గించింది. యాహూ ఇంటర్నెట్‌ వ్యాపారాన్ని వెరిజోన్‌ కొనుగోలు చేయనున్న సంగతి తెలిసిందే. తాజా మార్పుల ప్రకారం డీల్‌ విలువ 4.48 బిలియన్‌ డాలర్లకు తగ్గుతుంది. అలాగే హ్యాకింగ్‌పై సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్చంజ్‌ కమిషన్‌ విచారణకు, షేర్‌హోల్డర్లు వేసిన దావాల వ్యయాల భారాన్ని యాహూనే భరిస్తుంది. అయితే, ప్రభుత్వపరంగా ఎదురయ్యే ఇతరత్రా వితరణలకయ్యే వ్యయాలను ఇరు సంస్థలు భరిస్తాయి.

15 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు పచ్చజెండా
ప్రభుత్వం 15 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటి విలువ రూ.12,000 కోట్లు. ఆమోదం పొందిన వాటిల్లో డాక్టర్‌ రెడ్డీస్, అపోలో హాస్పిటల్స్, హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్, వొడాఫోన్, తదితర సంస్థల ఎఫ్‌డీఐ ప్రతిపాదనలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌ అధ్యక్షతన గల ఫారిన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డ్‌ (ఎఫ్‌ఐపీబీ) మొత్తం 24 ప్రతిపాదనలను పరిశీలించింది. వీటిల్లో మూడింటిని తిరస్కరించిందని, ఆరింటిపై నిర్ణయాలను వాయిదా వేసిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వాయిదా పడిన వాటిల్లో రూ.8,000 కోట్ల విలువైన గ్లాండ్‌ ఫార్మా ప్రతిపాదన కూడా ఉంది. ఇక ఆమోదం పొందిన వాటిల్లో రూ.9,000 కోట్ల ట్విన్‌స్టార్‌ టెక్నాలజీస్‌ ప్రతిపాదన, రూ.750 కోట్ల విలువైన అపోలో హాస్పిటల్స్‌ ప్రతిపాదనలు ఉన్నాయి.

భీమ్‌ యాప్‌ డౌన్‌లోడ్స్‌@1.7 కోట్లు
దేశీ డిజిటల్‌ పేమెంట్స్‌ యాప్‌ భారత్‌ ఇంటర్‌ఫేస్‌ ఫర్‌ మనీ (భీమ్‌) డౌన్‌లోడ్స్‌ 1.7 కోట్లకు చేరాయని నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ తెలిపారు. క్యాష్‌లెస్‌ ట్రాన్సాక్షన్లు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే (డిసెంబర్‌ 30న) ఈ యాప్‌ను ఆవిష్కరించింది. నవంబర్‌–జనవరి మధ్యకాలంలో యూఎస్‌ఎస్‌డీ ప్లాట్‌ఫామ్‌లోని లావాదేవీలు 45% పెరిగాయని పేర్కొన్నారు. నోట్ల రద్దుకు ముందు దేశంలో 8 లక్షల పీవోఎస్‌ మెషీన్లు ఉంటే.. ఇప్పుడు వీటి సంఖ్య 28 లక్షలకు పెరిగిందని తెలిపారు.  

ఏప్రిల్‌ 1 నుంచి డేటాకు చార్జీలు: జియో
ప్రమోషనల్‌ ఆఫర్ల కింద ఇప్పటిదాకా ఉచితంగా లభిస్తున్న రిలయన్స్‌ జియో డేటా సర్వీసులకు ఏప్రిల్‌ 1 నుంచి చార్జీలు అమల్లోకి రానున్నాయి. అయితే ప్రస్తుత యూజర్లు మాత్రం వన్‌ టైమ్‌ జాయినింగ్‌ ఫీజు కింద రూ. 99 కడితే నెలకు రూ. 303 టారిఫ్‌తో ప్రస్తుత ప్రయోజనాలను మరో 12 నెలల పాటు పొందవచ్చు. రిలయన్స్‌ జియో చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. జియో సర్వీసులు ప్రారంభించిన తర్వాత 170 రోజుల్లోనే 10 కోట్ల మంది యూజర్ల మైలురాయిని అధిగమించిందని చెప్పారు.

27 నుంచి ఏడో విడత బంగారు బాండ్లు
గోల్డ్‌ బాండ్ల ఏడో విడత జారీకి కేంద్రం ముహూర్తం నిర్ణయించింది. వీటికోసం ఔత్సాహికులు ఈ నెల 27 నుంచి మార్చి 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో భాగంగా ఒక్కరు 500 గ్రాముల బంగారం విలువకు సరిపడా సెక్యూరిటీలను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది.  

మెడికల్‌ టూరిజంతో ఫార్మా పరుగు
దేశీ ఫార్మాస్యూటికల్స్‌ మార్కెట్‌ 2020 నాటికి 15.92 శాతం చొప్పున వార్షిక వృద్ధి రేటుతో 55 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అసోచామ్‌ అంచనా వేసింది. ఈ వృద్ధికి మెడికల్‌ టూరిజం బాగా దోహదపడుతుందని తెలియజేసింది. అసోచామ్‌ తాజాగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐటీటీఎం)తో కలిసి ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. 2005లో 6 బిలియన్‌ డాలర్లుగా ఉన్న దేశీ ఫార్మా మార్కెట్‌ 2016 నాటికి 17.46 శాతం వార్షిక వృద్ధి రేటుతో 36.7 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఇది 2020 నాటికి 55 బిలియన్‌ డాలర్లకు చేరనుంది.

జీఎస్‌టీపై మొబైల్‌ యాప్‌
త్వరలో అమల్లోకి రానున్న వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ ఆవిష్కరించింది. జీఎస్‌టీలో కొంగొత్త మార్పులు, చేర్పులకు సంబంధించిన అప్‌డేట్‌ సమాచారాన్ని పన్ను చెల్లింపుదారులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్‌ గాంగ్వార్‌ తెలిపారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ డివైజ్‌లకు ఇది అందుబాటులో ఉంటుందని, తర్వాత ఐఓఎస్‌ వెర్షన్‌ కూడా ప్రవేశపెడతామని ఆయన వివరించారు. జీఎస్‌టీ విధానానికి మారేందుకు మార్గదర్శకాలు, తదితర వివరాలు ఈ యాప్‌లో ఉంటాయి.

డీల్స్‌..
మరో రెండు ఆర్థిక సంస్థల మధ్య విలీనం జరుగుతుందన్న అంచనాలు మార్కెట్లో మొదలయ్యాయి. ప్రైవేటు రంగ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లో నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూ జన్‌ (గతంలో ఎస్‌కేఎస్‌ మైక్రోఫైనాన్స్‌) విలీనమయ్యేందుకు చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
టెలికం సంస్థ రిలయన్స్‌ జియో తాజాగా ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్‌తో చేతులు కలిపింది. జియో యూజర్లు ఇకపై జియోమనీ యాప్‌ ద్వారా ఉబెర్‌ ట్యాక్సీలను బుక్‌ చేసుకునేందుకు, చెల్లింపులు జరిపేందుకు ఈ ఒప్పందం తోడ్పడనుంది.
భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌)లో 5 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.1,600 కోట్లు సమీకరించింది.
దేశీ టెలికం అగ్రగామి భారతీ ఎయిర్‌టెల్‌.. టెలినార్‌ ఇండియాను చేజిక్కించుకుంది. దేశంలో టెలినార్‌కు ఉన్న ఏడు సర్కిళ్లలో కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు టెలినార్‌ సౌత్‌ ఏషియా ఇన్వెస్ట్‌మెంట్స్‌ తో ఒప్పందం ఖరారు చేసుకుంది. డీల్‌ ప్రకారం ఎయిర్‌టెల్‌ టెలినార్‌కు నగదు రూపంలో ఎలాంటి చెల్లింపులూ చేయదు. అయితే, ఆ కంపెనీ భవిష్యత్తులో స్పెక్ట్రం లైసెన్స్‌ కోసం చెల్లించాల్సిన ఫీజులు, మొబైల్‌ టవర్ల అద్దెలు అన్నీ కలుపుకొని రూ.1,600 కోట్లను ఎయిర్‌టెల్‌ భరిస్తుంది.
కేజీ–బేసిన్‌లోని గ్యాస్‌ బ్లాక్‌లో జీఎస్‌పీసీకి ఉన్న మొత్తం 80 శాతం వాటాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్‌జీసీ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ డీల్‌ విలువ 1.2 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 8,000 కోట్లు).

Advertisement
Advertisement
Advertisement