ముంబై: కరోనా టైంలో అన్నివర్గాలను ఆకర్షించి.. విపరీతంగా లాభాలు ఆర్జించింది డీమార్ట్ బ్రాండ్ సూపర్ మార్కెట్. తాజాగా ఈ స్టోర్ల ప్రమోటర్ రాధాకృష్ణన్ ఎస్.దమానీ తాజాగా ప్రపంచ సంపన్నుల జాబితాలో చేరారు. 19.2 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1.42 లక్షల కోట్లు) నెట్‌వర్త్‌ను సాధించడం ద్వారా బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 98వ ర్యాంకులో నిలిచారు. వెరసి టాప్–100 గ్లోబల్ కుబేరుల్లో ఒకరిగా తొలిసారి ఆవిర్భవించారు. ప్రపంచ సంపన్నులపై రోజువారీ ర్యాంకింగ్‌లను ఈ ఇండెక్స్ ప్రకటిస్తుంటుంది. డీమార్ట్ రిటైల్ చైన్ నిర్వాహక సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌కు ప్రమోటర్ అయిన దమానీ.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ కూడా.
దేశీ కుబేరులు: టాప్–100 గ్లోబల్ జాబితాలో దమానీ కంటే ముందు వరుసలో దేశీ దిగ్గజాలు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, విప్రో వ్యవస్థాపకులు అజీమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గౌరవ చైర్మన్ శివ నాడార్, స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్ సైతం నిలిచారు. కాగా.. డీమార్ట్ రిటైల్ స్టోర్ల విస్తరణ నేపథ్యంలో దమానీ సంపద వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. ముఖ్యంగా దాదాపు ప్రతీ ప్రొడక్టులు.. వాటిపై రీజనబుల్ డిస్కౌంట్‌ల ప్రకటన, ఎక్కువ ప్రొడక్టులతో వినియోగదారుల్ని ఆకర్షించడం, టౌన్‌లకు సైతం విస్తరించిన మార్ట్‌లు,
ముఖ్యంగా కరోనా టైం నుంచి అన్ని వర్గాలను మార్ట్‌లకు రప్పించుకోవడం ద్వారా డీమార్ట్ వాల్యూను విపరీతంగా పెంచుకోగలిగారాయన. తద్వారా స్టాక్ మార్కెట్లలో మధ్య, చిన్నతరహా కంపెనీలలో అత్యధికంగా ఇన్వెస్ట్ చేసే దమానీ.. వేల్యూ ఇన్వెస్టర్‌గా గుర్తింపు పొందారు. పెట్టుబడులను దీర్ఘకాలంపాటు కొనసాగిస్తుంటారు. అయితే సంపద వృద్ధికి ప్రధానంగా ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ దోహదం చేసింది. దమానీకి అధిక వాటాలున్న లిస్టెడ్ కంపెనీలలో వీఎస్‌టీ ఇండస్ట్రీస్, ఇండియా సిమెంట్స్, సుందరం ఫైనాన్స్, ట్రెంట్‌లను పేర్కొనవచ్చు.
డీమార్ట్ దూకుడు
ఐపీవో ద్వారా 2017 మార్చిలో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ షేరు రేసుగుర్రంలా పరుగు తీసింది. దీంతో రూ. 39,813 కోట్ల నుంచి ప్రారంభమైన కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువ) తాజాగా రూ. 2.36 లక్షల కోట్లకు దూసుకెళ్లింది. ఇది ఆరు రెట్ల వృద్ధికాగా.. దమానీ, ఆయన కుటుంబ వాటా విలువ రూ. 32,870 కోట్ల నుంచి రూ. 1.77 లక్షల కోట్లకు జంప్ చేసింది. గత ఏడాది కాలంలోనే డీమార్ట్ షేరు 62 శాతం పురోగమించడం గమనించదగ్గ అంశం!.
Comments
Please login to add a commentAdd a comment