న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో కన్సాలిడెటెడ్ నష్టాలు డిసెంబర్ త్రైమాసికంలో రూ.346 కోట్లకు పెరిగిపోయాయి. అంతక్రితం ఏడాడి ఇదే కాలానికి సంస్థ నష్టం కేవలం రూ.67 కోట్లుగానే ఉంది. అధిక వ్యయాలు, ఆన్‌లైన్ ఫుడ్ వ్యాపారం నిదానించడం, బ్లింకిట్ నుంచి పెరిగిపోయిన నష్టాలు ఈ పరిస్థితికి దారితీశాయి. కార్యకలాపాల ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,112 కోట్ల నుంచి రూ.1,948 కోట్లకు పెరిగింది.
వ్యయాలు రూ.1,642 కోట్ల నుంచి రూ.2,485 కోట్లకు చేరాయి. ‘‘పరిశ్రమ వ్యాప్తంగా ఫుడ్ డెలివరీ వ్యాపారం గతేడాది అక్టోబర్ (దీపావళి తర్వాత) నుంచి తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండగా, ముఖ్యంగా టాప్ 8 పట్టణాల్లో మరింత అధికంగా ఉంది’’అని జొమాటో సీఎఫ్‌వో అక్షత్ గోయల్ తెలిపారు. ఫుడ్ డెలివరీ వ్యాపారం డిమాండ్ వాతావరణం సవాలుగా ఉన్నట్టు వ్యాఖ్యానించారు.
‘‘ఇటీవలి వారాల్లో డిమాండ్ పరంగా తిరిగి సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. కనుక గడ్డు పరిస్థితి ముగిసినట్టేనని భావిస్తున్నాం’’అని గోయల్ పేర్కొన్నారు. జనవరిలో దేశవ్యాప్తంగా 225 చిన్న పట్టణాల్లో తాము కార్యకలాపాలు నిలిపివేసినట్టు చెప్పారు. డిసెంబర్ త్రైమాసికంలో ఈ పట్టణాల నుంచి వచ్చిన ఆదాయం మొత్తం ఆదాయంలో 0.3 శాతమే ఉన్నట్టు తెలిపారు. దీర్ఘకాలంలో ఫుడ్ డెలివరీ వృద్ధి అవకాశాల పరంగా ఇప్పటికీ ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ పేర్కొన్నారు.
ప్రస్తుతం పరిశ్రమలో వృద్ధి తగ్గడం అన్నది మధ్యస్థాయి మార్కెట్ విభాగంలో మందగమనం, ప్రీమియం విభాగంలో బయటకు వెళ్లి ఆహారం తీసుకోవడం, ప్రీమియం పర్యాటక యాత్రలు తదితర పరిణామాలను ఆయన ప్రస్తావించారు. ఎబిట్డా స్థాయిలో లాభ, నష్టాలు లేని స్థాయికి 2023–24 రెండో త్రైమాసికంలో చేరుకునే విషయంలో ఎటువంటి సందేహం లేదన్నారు. సంస్థ రూ.265 కోట్ల నిర్వహణ నష్టాలు ప్రకటించగా, ఇందులో బ్లింకిట్‌ను మినహాయిస్తే నిర్వహణ నష్టం కేవలం రూ.38 కోట్లుగానే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment