న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ఫుడ్ ఆపరేటర్లపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన వ్యవస్థను మెరుగుపర్చుకోవడానికి తీసుకుంటున్న చర్యల గురించి 15 రోజుల్లోగా ప్రతిపాదనలను సమర్పించాలని స్విగ్గీ, జొమాటో తదితర ఆపరేటర్లను ఆదేశించింది. ప్రస్తుతం పాటిస్తున్న విధానం, అలాగే మెరుగుపర్చే ప్రతిపాదనలను ఇవ్వాలంటూ వినియోగదారుల వ్యవహారాల విభాగం బడా ఈ–కామర్స్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లను (ఎఫ్‌బీవో) ఆదేశించినట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ సారథ్యంలో సోమవారం ఎఫ్‌బీవోలతో జరిగిన సమావేశం సందర్భంగా ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొంది.
గడిచిన 12 నెలల వ్యవధిలో నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్ నంబరుకు (1915) స్విగ్గీపై 3,631, జొమాటోపై 2,828 పైచిలుకు ఫిర్యాదులు వచ్చినట్లు వివరించింది. డెలివరీ చార్జీలు, ప్యాకేజింగ్ చార్జీలు, పన్నులులాంటి ప్రతి చార్జీ గురించి వినియోగదారులకు పారదర్శకంగా చూపాలని సూచించినట్లు తెలిపింది. స్విగ్గీ, జొమాటో సహా ఎఫ్‌బీవోలు, రెస్టారెంట్ల సమాఖ్య ఎన్‌ఆర్‌ఏఐ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హెల్ప్‌లైన్‌కి వచ్చిన ఫిర్యాదులపై ఇందులో చర్చించారు. తాము మెరుగైన సర్వీసులు అందించడానికి లేకుండా ఎఫ్‌బీవోలు కస్టమర్ల వివరాలను ఇవ్వడం లేదంటూ ఎన్‌ఆర్‌ఏఐ ఆరోపించింది. ప్రతి ఆర్డరుపై 20 శాతం కమీషన్ తీసుకోవడంతో పాటు డెలివరీ చార్జీలను కూడా ఎఫ్‌బీవోలే ఇష్టానుసారంగా నిర్ణయిస్తున్నాయని పేర్కొంది. మరోవైపు, తాము ఇప్పటికే ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను అమలు చేస్తున్నామని, దీన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు అవకాశం ఉందని ఎఫ్‌బీవోలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment