ఐడియా నష్టాలు 6,439 కోట్లు | Vodafone Idea reports consolidated loss of Rs 6,438.8 cr in Dec quarter | Sakshi
Sakshi News home page

ఐడియా నష్టాలు 6,439 కోట్లు

Published Fri, Feb 14 2020 5:25 AM | Last Updated on Fri, Feb 14 2020 5:25 AM

Vodafone Idea reports consolidated loss of Rs 6,438.8 cr in Dec quarter - Sakshi

న్యూఢిల్లీ: వొడాఫోన్‌ ఐడియాకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) డిసెంబర్‌ క్వార్టర్లో నష్టాలు మరింతగా పెరిగాయి. గత క్యూ3లో రూ.5,005 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ3లో రూ.6,439 కోట్లకు చేరాయి. ఏజీఆర్‌(సవరించిన స్థూల రాబడి)కు సంబంధించిన వడ్డీ వ్యయాలు, ఆస్తులకు సంబంధించిన అధిక తరుగుదల కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని వొడాఫోన్‌ ఐడియా ఎండీ, సీఈఓ రవీందర్‌ టక్కర్‌ చెప్పారు. మరిన్ని వివరాలు.....

30 శాతం పెరిగిన వడ్డీ వ్యయాలు...
గత క్యూ3లో రూ.11,983 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 5 శాతం పతనమై రూ.11,381 కోట్లకు తగ్గింది. వడ్డీ వ్యయాలు 30 శాతం ఎగసి రూ.3,722 కోట్లకు, తరుగుదల వ్యయాలు 23 శాతం వృద్ధితో రూ.5,877 కోట్లకు పెరిగాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే, ఈ కంపెనీ నష్టాలు తగ్గాయి. గత క్యూ2లో రూ.50,922 కోట్ల నికర నష్టాలను కంపెనీ ప్రకటించింది. ఏజీఆర్‌ బకాయిల కేటాయింపుల కారణంగా ఈ కంపెనీకి ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయి.  

టారిఫ్‌ల పెంపుతో మెరుగుపడుతున్న ఆదాయం....
ఏజీఆర్‌కు సంబంధించిన ఊరటనివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నామని రవీందర్‌ టక్కర్‌ పేర్కొన్నారు. కీలక మార్కెట్లలో కెపాసిటీ విస్తరణ, 4జీ కవరేజ్, నెట్‌వర్క్‌ ఇంటిగ్రేషన్‌పై ప్రధానంగా దృష్టి పెడుతున్నామని వివరించారు. ఇటీవల టారిఫ్‌లను పెంచడం వల్ల సెప్టెంబర్‌ నుంచి ఆదాయం పుంజుకుంటోందని పేర్కొన్నారు. గత డిసెంబర్‌లో టారిఫ్‌లను మరింతగా పెంచడం వల్ల ఆదాయం మరింతగా మెరుగుపడగలదని వివరించారు. కాగా వొడాఫోన్‌ ఐడియా చెల్లించాల్సిన ఏజీఆర్‌ బకాయిలు రూ.53,000 కోట్ల మేర ఉన్నాయి.  
 ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో వొడాఫోన్‌ ఐడియా షేర్‌ 0.6 శాతం నష్టంతో రూ.4.48 వద్ద ముగిసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement