న్యూఢిల్లీ: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్‌ఎఫ్ డిసెంబర్ త్రైమాసికానికి మెరుగైన పనితీరును నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 27 శాతం వృద్ధితో రూ.666 కోట్లుగా నమోదైంది. ఆదాయం 6 శాతం వృద్ధితో రూ.1,643 కోట్లకు చేరింది. వ్యయాలు మాత్రం రూ.1,152 కోట్ల నుంచి రూ.1,132 కోట్లకు పరిమితం అయ్యాయి.
క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.518 కోట్లు, ఆదాయం రూ.1,560 కోట్ల చొప్పున ఉన్నాయి. ఢిల్లీలోని కంపెనీ కార్యాలయ భవనం ‘డీఎల్‌ఎఫ్ సెంటర్’ను గ్రూపు సంస్థ డీఎల్‌ఎఫ్ సైబర్ సిటీ డెవలపర్స్ (డీసీసీడీఎల్)కు రూ.825 కోట్లకు విక్రయించేందుకు బోర్డ్ ఆమోదం తెలిపింది. ‘‘రెంటల్ వ్యాపారాన్ని (అద్దె ఆదాయాన్నిచ్చే ఆస్తులు) స్థిరీకరించే వ్యూహంలో భాగంగా డీఎల్‌ఎఫ్ సెంటర్ విక్రయ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు సంస్థ వివరణ ఇచి్చంది.
డీసీసీడీఎల్ అనేది డీఎల్‌ఎఫ్, సింగపూర్ సావరీన్ వెల్త్ ఫండ్ జీఐఎస్ జాయింట్ వెంచరీ కావడం గమనార్హం. ఇందులో డీఎల్‌ఎఫ్‌కు 67 శాతం వాటా ఉంది. ఒక త్రైమాసికంలో అత్యధిక విక్రయాలు (బుకింగ్‌లు) రూ,9,407 కోట్లు నమోదైనట్టు డీఎల్‌ఎఫ్ ప్రకటించింది. గురుగ్రామ్‌లో కొత్త ప్రాజెక్టు ఆరంభించిన మూడు రోజుల్లోనే 1,113 లగ్జరీ అపార్ట్‌మెంట్లు రూ.7,200 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలిపింది.
బీఎస్‌ఈలో డీఎల్‌ఎఫ్ షేరు ఒక శాతం లాభంతో రూ.747 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment