Improved
-
డీఎల్ఎఫ్ పనితీరు ఫర్వాలేదు
న్యూఢిల్లీ: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్ డిసెంబర్ త్రైమాసికానికి మెరుగైన పనితీరును నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 27 శాతం వృద్ధితో రూ.666 కోట్లుగా నమోదైంది. ఆదాయం 6 శాతం వృద్ధితో రూ.1,643 కోట్లకు చేరింది. వ్యయాలు మాత్రం రూ.1,152 కోట్ల నుంచి రూ.1,132 కోట్లకు పరిమితం అయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.518 కోట్లు, ఆదాయం రూ.1,560 కోట్ల చొప్పున ఉన్నాయి. ఢిల్లీలోని కంపెనీ కార్యాలయ భవనం ‘డీఎల్ఎఫ్ సెంటర్’ను గ్రూపు సంస్థ డీఎల్ఎఫ్ సైబర్ సిటీ డెవలపర్స్ (డీసీసీడీఎల్)కు రూ.825 కోట్లకు విక్రయించేందుకు బోర్డ్ ఆమోదం తెలిపింది. ‘‘రెంటల్ వ్యాపారాన్ని (అద్దె ఆదాయాన్నిచ్చే ఆస్తులు) స్థిరీకరించే వ్యూహంలో భాగంగా డీఎల్ఎఫ్ సెంటర్ విక్రయ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు సంస్థ వివరణ ఇచి్చంది. డీసీసీడీఎల్ అనేది డీఎల్ఎఫ్, సింగపూర్ సావరీన్ వెల్త్ ఫండ్ జీఐఎస్ జాయింట్ వెంచరీ కావడం గమనార్హం. ఇందులో డీఎల్ఎఫ్కు 67 శాతం వాటా ఉంది. ఒక త్రైమాసికంలో అత్యధిక విక్రయాలు (బుకింగ్‌లు) రూ,9,407 కోట్లు నమోదైనట్టు డీఎల్ఎఫ్ ప్రకటించింది. గురుగ్రామ్‌లో కొత్త ప్రాజెక్టు ఆరంభించిన మూడు రోజుల్లోనే 1,113 లగ్జరీ అపార్ట్మెంట్లు రూ.7,200 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలిపింది. బీఎస్ఈలో డీఎల్ఎఫ్ షేరు ఒక శాతం లాభంతో రూ.747 వద్ద ముగిసింది. -
PM Narendra Modi: మూడోసారీ మేమే...
న్యూఢిల్లీ: వరుసగా మూడో పర్యాయం ప్రధాని పదవిని చేపడతానని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. తమ మూడో పర్యాయంలో మెరుగైన వృద్ధిరేటుతో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అన్నారు. 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారనే నీతి ఆయోగ్ నివేదికను ప్రస్తావిస్తూ భారత్ తప్పకుండా పేదరిక నిర్మూలన సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2014లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టినపుడు భారత్ ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండగా... ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గుర్తుచేశారు. -
పెట్రోల్, డీజిల్‌పై మెరుగుపడిన మార్జిన్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ సంస్థలకు మార్జిన్లు మెరుగుపడ్డాయి. అయినప్పటికీ అవి .. రేట్లను మాత్రం ఇప్పటికిప్పుడు తగ్గించే యోచనలో లేవు. గతేడాది వాటిల్లిన నష్టాలను భర్తీ చేసుకున్న తర్వాతే ధరల అంశాన్ని పరిశీలించే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. నష్టాల భర్తీ మాత్రమే కాకుండా చమురు ధరల తగ్గుదల ఎన్నాళ్ల పాటు కొనసాగుతుందో కూడా వేచి చూడాలని ఆయిల్ కంపెనీలు యోచిస్తున్నట్లు వివరించారు. 2022 నాలుగో త్రైమాసికం నుంచి పెట్రోల్ విక్రయాలపై ఆయిల్ కంపెనీల మార్జిన్లు సానుకూలంగా మారాయని, గత నెల నుంచి డీజిల్ అమ్మకాలపైనా లీటరుకు 50 పైసల మేర లాభం వస్తోందని అధికారి చెప్పారు. కానీ గతేడాది వాటిల్లిన నష్టాలను భర్తీ చేసుకునేందుకు ఇది సరిపోదన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో గతేడాది మార్చిలో చమురు ధర బ్యారెల్‌కు 139 డాలర్ల స్థాయికి ఎగిసింది. ప్రస్తుతం 75–76 డాలర్లకు దిగి వచ్చింది. కొన్నాళ్లుగా రేట్లను సవరించకపోవడంతో చమురు కంపెనీలు పెట్రోల్‌పై లీటరుకు రూ. 17.4, డీజిల్‌పై రూ. 27.7 చొప్పున నష్టపోయాయి. 2022 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో పెట్రోల్‌పై మార్జిను లీటరుకు రూ. 10 మేర వచ్చినప్పటికీ డీజిల్‌పై మాత్రం రూ. 6.5 చొప్పున నష్టం కొనసాగింది. తర్వాత త్రైమాసికంలో పెట్రోల్‌పై మార్జిన్ రూ. 6.8 స్థాయికి తగ్గగా.. డీజిల్‌పై మార్జిన్ రూ. 0.50కి మెరుగుపడింది. -
భారత్ వృద్ధికి ఢోకా లేదు
న్యూఢిల్లీ: ప్రపంచ ద్రవ్య, పరపతి విధానాలు కఠినంగా ఉన్నప్పటికీ, స్థూల ఆర్థిక స్థిరత్వం విషయంలో రాబోయే సంవత్సరాల్లో భారతదేశం మెరుగైన స్థితిలో ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక గురువారం తెలిపింది. ఖరీఫ్ పంట చేతికి అందడంతో రానున్న నెలల్లో ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గుతుందని, అదే సమయంలో వ్యాపార అవకాశాలు మెరుగుపడటంతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని పేర్కొంది. ఈ మేరకు అక్టోబర్ 2022కు సంబంధించి నెలవారీ నివేదికను విడుదల చేసింది. అమెరికా వడ్డీరేట్లు పెంపు ‘‘భవిష్యత్ ఇబ్బంది’’కి సంబంధించినది పేర్కొంటూ, స్టాక్ ధరలు తగ్గడానికి దారితీసే అంశం ఇదని పేర్కొంది. దీనితోపాటు బలహీన కరెన్సీలు, అధిక బాండ్ ఈల్డ్స్, అధిక వడ్డీరేట్ల సమస్యలు పలు ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొనాల్సి రావచ్చని పేర్కొంది. వృద్ధి అవకాశాల మందగమనం, అధిక ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రపంచాన్ని మాంద్యం ముందు నిలబెట్టే పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. భారత్ ఎగుమతులపై ఇది ప్రభావం చూపినప్పటికీ, దేశీయ డిమాండ్, ఇన్వెస్ట్మెంట్ సైకిల్ పటిష్టత, వ్యవస్థాగత సంస్కరణలు భారత్‌కు రక్షణగా ఉంటున్నట్లు పేర్కొంది. -
వాహనాలకు పండగొచ్చింది
న్యూఢిల్లీ: తయారీ సంస్థల నుంచి డీలర్లకు సరఫరా మెరుగుపడటంతో పండుగల సీజన్లో వాహన పరిశ్రమ కళకళ్లాడుతోంది. కస్టమర్లకు డెలివరీలూ పుంజుకుంటున్నాయి. దీంతో గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ సెప్టెంబర్‌లో దేశీయంగా ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు 11 శాతం వృద్ధి చెందాయి. 13,19,647 యూనిట్ల నుంచి 14,64,001 యూనిట్లకు పెరిగాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) మంగళవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పండుగల సీజన్ కావడంతో అక్టోబర్‌లో విక్రయాలు మరింత పుంజుకోగలవని అంచనా వేస్తున్నట్లు ఎఫ్ఏడీఏ ఆశాభావం వ్యక్తం చేసింది. ‘దశాబ్దకాలంలోనే ఈ పండుగ సీజన్ అత్యుత్తమమైనదిగా ఉండగలదని డీలర్లు అంచనా వేస్తున్నారు‘ అని పేర్కొంది. ట్రాక్టర్లు, కొన్ని రకాల త్రిచక్ర వాహనాలు మినహా మిగతా అన్ని ప్యాసింజర్, వాణిజ్య వాహనాలు.. ద్విచక్ర వాహనాలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో మెరుగైన అమ్మకాలు నమోదు చేశాయని ఎఫ్ఏడీఏ తెలిపింది. ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాలు గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 2,37,502 యూనిట్ల నుంచి 10 శాతం వృద్ధి చెంది 2,60,556 యూనిట్లకు చేరాయి. ‘సెమీకండక్టర్ల సరఫరా మెరుగుపడి కార్ల లభ్యత పెరగడం, వినూత్న ఫీచర్లతో కొత్త వాహనాలను ఆవిష్కరించడం తదితర అంశాల కారణంగా కస్టమర్లు తమకు నచ్చిన వాహనాల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు‘ అని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. మరోవైపు, సెమీకండక్టర్ల సరఫరా మెరుగుపడుతున్న నేపథ్యంలో అమ్మకాలకు ఊతం లభించేలా డిమాండ్‌కి అనుగుణంగా వాహనాలను అందించడంపై మరింతగా దృష్టి పెట్టాలని తయారీ సంస్థలను కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలు.. ► సెప్టెంబర్‌లో ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లు 9 శాతం పెరిగి 9,31,654 యూనిట్ల నుంచి 10,15,702 యూనిట్లకు చేరాయి. ఎంట్రీ స్థాయి బైక్‌ల అమ్మకాలు గణనీయంగా దెబ్బతినడంతో మొత్తం టూవీలర్ల విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడింది. ► వాణిజ్య వాహనాల విక్రయాలు 59,927 యూనిట్ల నుంచి 19 శాతం వృద్ధితో 71,233 యూనిట్లకు పెరిగాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 53,392 నుంచి 52,595 యూనిట్లకు తగ్గాయి. ► ప్యాసింజర్ వాహనాల విభాగంలో కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ అమ్మకాలు 99,276 యూనిట్ల నుంచి 1,03,912 యూనిట్లకు పెరిగాయి. హ్యుందాయ్ 39,118, టాటా మోటార్స్ 36,435 కార్లు విక్రయించాయి. ► ద్విచక్ర వాహనాల విభాగంలో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అత్యధికంగా 2,84,160 యూనిట్లు విక్రయించింది. హీరో మోటోకార్ప్ 2,50,246 వాహనాల అమ్మకాలు నమోదు చేసింది. త్రిచక్ర వాహనాలకు సంబంధించి 19,474 యూనిట్లతో బజాజ్ ఆటో అగ్రస్థానంలో నిల్చింది. -
ఆన్లైన్లో టీనేజర్స్ : మంచీ మర్యాద!
సాక్షి, హైదరాబాద్: భారతీయులు ఆన్లైన్ ప్రపంచంలో కొంత మర్యాద నేర్చుకున్నారని మైక్రోసాఫ్ట్ సంస్థ చెబుతోంది. ‘సివిలిటీ, సేఫ్టీ అండ్ ఇంటరాక్షన్స్ ఆన్లైన్’పేరుతో ఈ ఐటీ దిగ్గజం ఇటీవల ఓ వార్షిక నివేదిక విడుదల చేసింది. ఆన్లైన్ వినియోగదారుల మర్యాద విషయంలో డిజిటల్ సివిలిటీ ఇండెక్స్ (డీసీఐ)2020లో భారత్ 2019లో ఉన్న 71వ స్థానం నుంచి 68వ స్థానానికి పెరిగింది. అంటే ఆన్లైన్లో కొంచెం తక్కువ మంది దురుసు ప్రవర్తన ఎదుర్కొంటున్నారని అర్థం. అయితే ఆసియా పసిఫిక్ దేశాల్లో మాత్రం ఇతర దేశాలతో పోలిస్తే భారత్ స్థానం దిగువనే ఉండటం గమనార్హం. అంతేకాదు.. 2016తో పోలిస్తే విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం రెట్టింపు అయ్యిందని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం, స్కామ్‌లు, మోసాలు 5 శాతం వరకు పెరిగి ప్రస్తుతం 22 శాతంగా నమోదైంది. వివక్ష అంశంలోనూ భారతీయుల ఆన్లైన్ ప్రవర్తన సరిగా లేదు. 2016లో ఇది 10 శాతంగా ఉంటే 2020 నాటికి 6 శాతం పెరిగింది. సానుకూల సంభాషణలతో మంచి సంబంధాలు.. డీసీఐ తాజా సర్వే కోసం మైక్రోసాఫ్ట్ ఆస్ట్రేలియా, ఇండియా, ఇండొనేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం వంటి దేశాల్లోని మొత్తం 32 ప్రాంతాల్లో 16 వేల మందిని ప్రశ్నించారు. ఆన్లైన్లో సంభాషణలు, ప్రమాదాలు వంటి అంశాలపై అడిగిన సర్వేలో పెద్దవారితో పాటు యువత కూడా పాల్గొంది. ఆన్లైన్ సంభాషణలు సానుకూలంగా ఉండేలా ప్రోత్సహించేందుకు మైక్రోసాఫ్ట్ ఈ సర్వే నిర్వహిస్తోందని, డిజిటల్ టెక్నాలజీల వినియోగం అంతకంతకూ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఆన్లైన్ అనుభవం బాగా ఉంటేనే సమాజ సామరస్యం సాధ్యమవుతుందని మైక్రోసాఫ్ట్ ఉన్నతాధికారి కేశవ్ ధక్కడ్ తెలిపారు. మార్పులో యువతదే ప్రధాన పాత్ర ఆన్లైన్ ప్రవర్తనలో కొంత మార్పులు వచ్చిన విషయంలో యువతది (13–16 మధ్య వయస్కులు) ప్రధానపాత్ర అని డీసీఐ 2020 సర్వే తెలిపింది. ఆన్లైన్లో మర్యాద పాటించే వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన సూచీలో పెద్దలు 69 స్కోరు సాధించగా, యువత 67 స్కోరు సాధించారు. భారత్‌లో సర్వేకు స్పందించిన వారిలో 38 శాతం మంది కరోనా సమయంలో ఆన్లైన్ మర్యాద మెరుగ్గా ఉందని వ్యాఖ్యానించగా, చాలామంది ఇతరులకు సాయపడాలన్న దృక్పథాన్ని కనబరిచారని ఈ సర్వే తెలిపింది. ఇదే సమయంలో 22 శాతం మంది కరోనా సమయంలో ఆన్లైన్లో మర్యాదపూర్వక ధోరణి తగ్గిందని, తప్పుడు సమాచారం ఎక్కువగా ప్రసారమైందని, వ్యక్తిగత దూషణలు, నెగెటివ్ కామెంట్స్ ఎక్కువయ్యాయని అభిప్రాయపడ్డారు. -
వచ్చే క్వార్టర్‌కల్లా మెరుగుపడతాం
న్యూఢిల్లీ: నిధుల లభ్యతపరంగా ప్రస్తుతం తీవ్ర ఒత్తిళ్లు ఉన్నప్పటికీ సెప్టెంబర్ త్రైమాసికానికల్లా పరిస్థితులు మెరుగుపడగలవని ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఆశిస్తోంది. లిక్విడిటీ(ద్రవ్య లభ్యత) సమస్యల నుంచి బైటపడేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్) ఎస్కే గుప్తా వెల్లడించారు. వివిధ సర్కిల్స్‌లో చీఫ్ జనరల్ మేనేజర్స్ (సీజీఎం)కు రాసిన లేఖలో ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు. టారిఫ్‌ల పరమైన పోరుతో టెలికం రంగంలో గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర పోటీ నెలకొందని గుప్తా చెప్పారు. ‘లిక్విడిటీ ఒత్తిళ్లను అధిగమించేందుకు బీఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. సమీప భవిష్యత్‌లో కంపెనీ పరిస్థితి మెరుగుపడగలదని అంచనా వేస్తున్నాం’ అని మే 16న రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. పోటీ సంస్థల కారణంగా ఆదాయానికి గండిపడుతున్నా.. కస్టమర్ బేస్‌ను కాపాడుకోగలుగుతున్నామని గుప్తా వివరించారు. -
నోట్ల కష్టాలపై తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నగదు కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ఏటీఎంల వద్ద నగదు లభ్యత క్రమంగా మెరుగవుతున్నదని ఎస్బీఐ పేర్కొంది. గత 24 గంటల్లో నగదు సరఫరా క్రమంగా పుంజుకుందని తెలిపింది. ఏటీఎంల వద్ద నగదు కొరత కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని పీఎన్బీ, కెనరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు పేర్కొన్నాయి. గత 24 గంటల్లో ఎస్బీఐ ఏటీఎంల వద్ద నగదు లభ్యత మెరుగైందని, నగదు కొరత నెలకొన్న ప్రాంతాల్లోనూ నగదు సరఫరా పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని, త్వరలోనే నగదు అందుబాటు సాధారణ స్థితికి చేరుకుంటుందని ఎస్బీఐ సీఓఓ నీరజ్ వ్యాస్ చెప్పారు. తమ ఏటీఎంల్లో నగదు లభ్యత పెంచేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామని ఎస్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు తమ ఏటీఎంల వద్ద నగదు లభ్యత మెరుగ్గా ఉందని, ఎలాంటి సమస్యలూ లేవని ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఇతర బ్యాంకుల ఖాతాదారులు నగదు విత్‌డ్రా కోసం తమ ఏటీఎంలకు రావడంతోనే కొన్నిచోట్ల ఏటీఎంల్లో నగదు కొరత ఏర్పడిందని పేర్కొంది. ఇక కరెన్సీ కొరతను అధిగమించేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామని, తగినంత నగదు సరఫరా ఉందని ఆర్బీఐ స్పష్టం చేయగా రూ. 500 నోట్ల ముద్రణను ఐదు రెట్లు పెంచామని కేంద్రం తెలిపింది. -
కీళ్లనొప్పులకు మెరుగైన చికిత్స!
కీళ్లనొప్పులకు మరింత మెరుగైన చికిత్స కల్పించే లక్ష్యంతో యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. కీళ్లలోనే సరికొత్త మృదుకణజాలాన్ని వృద్ధి చేయగల సరికొత్త మందును వీరు కనుక్కోగలిగారు. ఆర్సీజీడీ 423 అని పిలుస్తున్న ఈ సరికొత్త రసాయనాన్ని ఇంజెక్షన్ రూపంలో కీళ్లల్లోకి ఎక్కించుకుంటే చాలు.. ఆ ప్రాంతంలో వాపు/మంట తగ్గడమే కాకుండా కొంతకాలానికి అరిగిపోయిన కణజాలం స్థానంలో కొత్త కణజాలం పుట్టుకొస్తుంది. శరీరంలోని గ్లైకోప్రోటీన్ 130ను ప్రభావితం చేయడం ద్వారా ఇది పనిచేస్తుందని... కణజాలాన్ని అభివృద్ధి చేయాలన్న సందేశాన్ని చేరవేస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఎవ్సీన్కో చెప్పారు. పరిశోధనశాలలో చేసిన ప్రయోగాల్లో ఆర్సీజీడీ 423ని ఉపయోగించినప్పుడు కీళ్లలోని కణాలు వేగంగా ఎదగడంతోపాటు.. మరణాల రేటు గణనీయంగా తగ్గిందని, కణజాలం అరిగిపోయిన ఎలుకల్లోకి దీన్ని జొప్పించినప్పడు తక్కువ సమయంలనే సమస్య మాయమైపోయిందని తెలిపారు. ఎముకలు గుల్లబారే సమస్యతోపాటు చిన్న వయస్కుల్లో కనిపించే కీళ్లనొప్పులకూ ఈ కొత్త మందును ప్రయోగించేందుకు ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. -
మెరుగుపడనున్న కంపెనీల రేటింగ్
ముంబై: భారత కంపెనీల క్రెడిట్ రేటింగ్ వచ్చే ఏడాది మెరుగుపడే అవకాశాలున్నాయని అంతర్జాతీయ రేటింగ్ కంపెనీ,మూడీస్ తెలిపింది. జీఎస్టీ సంబంధిత సమస్యలు క్రమక్రమంగా తొలగిపోతున్నాయని, ఆర్థిక కార్యకలాపాలు మెల్లమెల్లగా పుంజుకుంటున్నాయని, దీంతో కంపెనీల పరపతి రేటింగ్ మెరుగుపడుతుందని మూడీస్ పేర్కొంది. కంపెనీల స్థూల లాభం 5–6 శాతం వృద్ధి ! వచ్చే ఏడాది జీడీపీ 7.6 శాతంగా ఉండనున్నదని, ఫలితంగా అమ్మకాలు పుంజుకుంటాయని మూడీస్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ ఎనలిస్ట్ కౌస్తుభ్ చౌబల్ చెప్పారు. ఉత్పత్తి సామర్థ్యాలు మెరుగుపడటం, కమోడిటీ ధరలు తగిన స్థాయిలోనే ఉండటం, వంటి కారణాల వల్ల 12–18 నెలల కాలంలో భారత కంపెనీల స్ఠూల లాభం 5–6 శాతం పెరుగుతుందని పేర్కొన్నారు. ఆయిల్, రియల్టీ, వాహన, వాహన విడిభాగాలు, ఐటీ సర్వీసుల కంపెనీలకు నిలకడ అవుట్‌లుక్‌ను ఇస్తున్నామని తెలిపారు. తీవ్రమైన పోటీ కారణంగా ఆదాయం, మార్జిన్లపై ఒత్తిడి నెలకొంటుందని, అందుకని టెలికం కంపెనీలకు మాత్రం ‘ప్రతికూలం’ అవుట్‌లుక్‌ను ఇస్తున్నామని పేర్కొన్నారు. రుణ పరిస్థితులు మెరుగుపడతాయ్.. వచ్చే ఏడాది పలు కంపెనీలు తమ రుణ పునర్వ్యవస్థీకరణ అవసరాలను సులభంగానే నిర్వహించుకోగలవని చౌబల్ వివరించారు. జీఎస్టీ పన్ను రేట్లలో మరింతగా సరళీకరణ, ఇతర సంస్థాగత సంస్కరణలు, తదితర అంశాల కారణంగా కంపెనీల నిర్వహణ లాభం పెరుగుతుందని పేర్కొన్నారు. దీంతో కంపెనీల రుణ పరిస్థితులు మెరుగుపడతాయని వివరించారు. ఆస్తుల వేల్యూయేషన్లు మెరుగుపడటం కూడా కొన్ని కంపెనీల రుణ పరిస్థితులు మెరుగుపడటటనికి దారితీస్తుందని పేర్కొన్నారు. అయితే వృద్ధి 6 శాతం కంటే తక్కువగా ఉండటం, కమోడిటీ ధరలు తగ్గడం వంటి ప్రతికూలతలు చోటు చేసుకుంటే మాత్రం కంపెనీల స్థూల లాభాల్లో వృద్ధి తక్కువగా ఉండే ప్రమాదం ఉందని హెచ్చరించారు. -
ఇంటర్నెట్ స్పీడ్ పెరిగింది!
ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలోనే భారత్ ఇంటర్నెట్ స్పీడ్ అతి తక్కువగా ఉన్నట్లు గుర్తించడంతో దాన్ని సగటున 3.5 ఎంబిపీఎస్ ఉండేట్లుగా పెంచారు. దీంతో గత త్రైమాసికంతో పోలిస్తే 24 శాతం పెరిగినట్లు అకమాయ్ నివేదికలు నిర్థారించాయి. అయినప్పటికీ ప్రపంచ ర్యాంకుతో పోలిస్తే 114వ స్థానంలోనే నిలిచినట్లు నివేదికలు చెప్తున్నాయి. దేశంలో ఇంటర్నెట్ వాడకం వేగంగా పెరుగుతున్నప్పటికీ కేవలం 138 శాతం మాత్రమే వృద్ధి కనిపిస్తోంది. భారతదేశంలో రోజురోజుకూ ఇంటర్నెట్ వినియోగంలో పెరుగుతున్న వృద్ధి చూస్తే నిజంగా గర్వ పడాలి. కానీ వేగంలో మాత్రం ఇప్పటికీ ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే అత్యంత వెనుకబడి ఉండటం విస్మయాన్ని కలిగిస్తుంది. అకమాయ్ అందించిన కొత్త నివేదికల ప్రకారం ఇండియాలో అతితక్కువ వేగంతో ఉన్న ఇంటర్నెట్ స్పీడ్ ను 3.5 ఎంబిపీఎస్ లకు పెంచాలని అమెరికాకు చెందిన కంటెంట్ డెలివరీ, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ సూచించింది. ప్రపంచంలోని ఇంటర్నెట్ స్థితిగతుల్లో కనిపించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను అకమాయ్ బయటపెట్టింది. టాప్ లో ఉన్న దక్షిణ కొరియా సగటు ఇంటర్నెట్ వేగం 29 ఎంబిపిఎస్ నుంచి గరిష్ఠంగా 103.6 ఎంబీపీఎస్ వరకూ ఉంది. మొత్తం ప్రపంచ సగటు వేగం 6.4 ఎంబీపీఎస్ ఉండగా.. భారతదేశం గరిష్ఠ వేగం కేవలం 25.5 ఎంబీపీఎస్ మాత్రమే ఉన్నట్లుగా అంచనా వేసింది. భారత సర్వీస్ ప్రొవైడర్లు 25 ఎంబీపీస్ నుంచే ప్రణాళికలను అందించడం ప్రారంభిస్తున్నాయని, యు బ్రాడ్ బ్యాండ్, యాక్ట్ బ్రాడ్ బ్యాండ్ 100 ఎంబీపీఎస్ వరకూ ఆఫర్లు ఇస్తున్నట్లు అకమాయ్ నివేదికలను బట్టి తెలుస్తోంది. అయితే ఇది భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగంతో పోలిస్తే చాలా తక్కువగా భావించింది. ఇండియాలో 15 ఎంబీపీఎస్ స్పీడ్ దాటిన కనెక్షన్లు కేవలం 2 శాతమే ఉన్నప్పటికీ వినియోగంలో 210 శాతం అభివృద్ధి కనిపిస్తున్నట్లు నివేదిక్లోల తెలిపింది. దీన్ని బట్టి రాబోయే కాలంలో హైస్పీడ్ కనెక్షన్ల వినియోగదారులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటర్నెట్ వ్యాప్తి స్థాయిని గమనిస్తే.. భారతదేశ జనాభాలో మూడవ వంతు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే నవంబర్ 2015 నాటి ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) లెక్కల ప్రకారం దేశంలో 25 శాతం వ్యాప్తి ఉన్నట్లు నిర్థారించింది. అది ఈపాటికి గణనీయంగా పెరిగేందుకు ఎంతో అవకాశం ఉన్నట్లు ఐఏఎంఏఐ చెప్తోంది. ప్రస్తుత కొత్త ప్రాజెక్టులు, డిజిటల్ ఇండియా వంటి వాటితో ఇంటర్నెట్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్తోంది. గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించేందుకు గూగుల్ సైతం ప్రయత్నాలు చేయడం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి ప్రభుత్వాలు ప్రజలకు ఇంటర్నెట్ సేవలను చవుకగా అందించే పథకాలను ప్రవేశ పెట్టడం కూడ ఇంటర్నెట్ వినియోగం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే ఇంటర్నెట్ వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు ఇటీవల మేరీ మీకర్ తన నివేదికల్లో వెల్లడించింది. అంతేకాక దేశంలో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ల అమ్మకాలతోపాటు, పలు కంపెనీలు తక్కువ ధరలకే స్మార్ట్ ఫోన్లను ఎగుమతి చేస్తుండటం కూడ భారత్ రెండో స్థానంలో ఉందన్న వాస్తవాన్ని ప్రతిబింబిస్తోంది. -
బుల్లెట్ వేగంతో బ్లూటూత్ 5
మొబైల్ ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్స్, గేమింగ్ కన్ సోల్స్ లో డేటా షేరింగ్ కు ఎక్కువగా ప్రాచుర్యం పొందిన వైర్ లెస్ టెక్నాలజీ బ్లూటూత్ లో ఓ పెద్ద అప్ డేషన్ యూజర్ల ముందుకు రాబోతోంది. అప్ డేటెడ్ బ్లూటూత్ వెర్షన్-5 ను జూన్ 16న లండన్ లో ఆవిష్కరించనున్నట్టు బ్లూటూత్ స్ఫెషల్ ఇంటరెస్ట్ గ్రూప్(ఎస్ఐజీ) ప్రకటించింది. ప్రస్తుతమున్నపరిధి కంటే రెండింతలు ఎక్కువ పరిధిలో పనిచేసేలా ఈ వెర్షన్ అప్ గ్రేడ్ చేశారు. అలాగే డేటా ట్రాన్ ఫర్ కూడా ఈ వెర్షన్ తో నాలుగురెట్లు అధికంగా ఉండబోతోంది. ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) డివైజ్ లన్నింటికీ కూడా ఈ వెర్షన్ సపోర్టు చేసేలా దీన్ని రూపొందించారు. స్థాన సంబంధిత సమాచారం, నావిగేషన్ వంటి కనెక్షన్ సర్వీసులకు కొత్త కార్యచరణగా ఈ వెర్షన్ ఉపయోగపడనుంది. అడ్వర్ టైజింగ్ ట్రాన్సిమిషన్ లో ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు, ఇతర డివైజ్ లు ఈ కొత్త బ్లూటూత్ స్టాండర్డ్ ను ఎప్పుడు, ఎలా ఉపయోగించుకోవాలో లండన్ లో జరగబోయే ఈవెంట్ లో వివరిస్తామని ఎస్ఐజీ తెలిపింది. ఈ వెర్షన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కంపెనీ లండన్ ఈవెంట్ లోనే వెల్లడించనుంది.