న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ కంపెనీ టాటా టెక్నాలజీస్ డిసెంబర్‌తో అంతమైన త్రైమాసికంలో రూ.170 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.148 కోట్లతో పోలిస్తే 15 శాతం వృద్ధి నమోదైంది. ఆదాయం ఇదే కాలంలో 15 శాతం వృద్ధితో రూ.1,289 కోట్లకు చేరింది. ‘‘డిసెంబర్ క్వార్టర్‌లో ఐదు పెద్ద ఆర్డర్లను సొంతం చేసుకున్నాం. ఇందులో ఒక డీల్ మొత్తం విలువ 50 మిలియన్ డాలర్లకు (రూ.415 కోట్లు) పైనే ఉంది.
మరొక డీల్ విలువ 25 మిలియన్ డాలర్లు. ఆటోమోటివ్ విభాగంలో కస్టమర్ల వ్యయాల పట్ల సానుకూలంగా ఉన్నాం. ఎందుకంటే ఓఈఎంలు ఎలక్ట్రిఫికేషన్ వైపు, ఇతర ప్రత్యామ్నాయ ప్రొపల్షన్ సిస్టమ్‌లవైపు దృష్టి సారిస్తున్నాయి. ఏరోస్పేస్ పరిశ్రమ కూడా ఉత్సాహంగా కనిపిస్తోంది. మా సామర్థ్యాలను భారీగా నిర్మించుకోవడంపై పెట్టుబడులు పెడుతున్నాం. కనుక దీర్ఘకాలానికి మా వ్యాపార మూలాల పట్ల ఎంతో విశ్వాసంతో ఉన్నాం’’ అని టాటా టెక్నాలజీస్ సీఈవో, ఎండీ వారెన్ హారిస్ ప్రకటించారు. డిసెంబర్ త్రైమాసికంలో కొత్తగా 172 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 12,623కు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment