న్యూఢిల్లీ: జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ మరోసారి పటిష్ట పనితీరు ప్రదర్శించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి రూ.9,444 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.6,334 కోట్లతో పోలిస్తే 49 శాతం పెరిగింది. నికర ప్రీమియం ఆదాయం రూ.1,11,788 కోట్ల నుంచి రూ.1,17,017 కోట్లకు వృద్ధి చెందింది. ఎల్‌ఐసీ మొత్తం ఆదాయం రూ.1,96,891 కోట్ల నుంచి రూ.2,12,447 కోట్లకు చేరింది.
ఒక్కో షేరుకు రూ.4 చొప్పున మధ్యంతర డివిడెండ్ పంపిణీ చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఫిబ్రవరి 21 రికార్డు తేదీగా ప్రకటించింది. 30 రోజుల్లోపు డివిడెండ్ పంపిణీ చేస్తామని తెలిపింది. మొదటి ఏడాది ప్రీమియం ఆదాయం (కొత్త పాలసీల నుంచి)లో ఎల్‌ఐసీ ఇప్పటికీ జీవిత బీమా మార్కెట్లో 58.90 శాతం వాటాతో దిగ్గజ సంస్థగా కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ వరకు తొమ్మిది నెలల్లో ఎల్‌ఐసీ నికర లాభం అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న రూ.22,969 కోట్ల నుంచి రూ.26,913 కోట్లకు వృద్ధి చెందింది.
ఫలితాల నేపథ్యంలో ఎల్‌ఐసీ షేరు ధర 6.50% ఎగసి రూ.1,112 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment