న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అధిక ఆదాయ ఊతంతో అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ (కన్సాలిడేటెడ్) నికర లాభం 60 శాతం పెరిగి రూ. 245 కోట్లకు చేరింది. క్రితం క్యూ3లో సంస్థ లాభం రూ. 153 కోట్లు. ఇక సమీక్షాకాలంలో ఆదాయం రూ. 4,264 కోట్ల నుంచి 14 శాతం పెరిగి రూ. 4,851 కోట్లకు చేరింది. షేరు ఒక్కింటికి రూ. 6 చొప్పున అపోలో హాస్పిటల్స్ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.
ప్రివెంటివ్ హెల్త్‌కేర్, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ విషయంలో ప్రజలకు సాధికారత కల్పించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. డిసెంబర్ 31 నాటికి అపోలో నెట్‌వర్క్ నిర్వహణలోని పడకల సంఖ్య 7,911కి చేరింది. ఆక్యుపెన్సీ 65 శాతానికి చేరింది. మూడో త్రైమాసికంలో ఫార్మసీకి సంబంధించి అపోలో హెల్త్ నికరంగా 119 కొత్త స్టోర్స్ ప్రారంభించడంతో మొత్తం స్టోర్స్ సంఖ్య 5,790కి చేరింది.
గురువారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు సుమారు 3 శాతం పెరిగి రూ. 6,432 వద్ద క్లోజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment