Positive Outlook
-
క్రిసిల్ పాజిటీవ్ ఔట్లుక్.. సుజ్లాన్ ఎనర్జీ రేటింగ్‌కు దన్ను
న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన సొల్యూషన్లు అందించే సుజ్లాన్ ఎనర్జీ రేటింగ్ రెండంచెలమేర మెరుగుపడింది. రేటింగ్ దిగ్గజం క్రిసిల్ తాజాగా సానుకూల ఔట్‌లుక్‌తో బీబీబీప్లస్/ఏ2కు అప్‌గ్రేడ్ చేసింది. ఇంతక్రితం బీబీబీమైనస్/ఏ3గా రేటింగ్ నమోదైంది. కంపెనీ దీర్ఘకాలిక, స్వల్పకాలిక సౌకర్యాల రేటింగ్స్‌ను క్రిసిల్ ఎగువముఖంగా సవరించినట్లు సుజ్లాన్ ఎనర్జీ తెలియజేసింది. ఇది కంపెనీ అత్యుత్తమ నిర్వహణ సామర్థ్యంతోపాటు.. బలపడిన ఫైనాన్షియల్ పరిస్థితులను వెల్లడిస్తున్నట్లు సుజ్లాన్ గ్రూప్ సీఎఫ్‌వో హిమాన్షు మోడీ పేర్కొన్నారు. పరిశ్రమసంబంధ సానుకూలతలు ఇందుకు జత కలిసినట్లు తెలియజేసింది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా సమీకరించిన రూ. 2,000 కోట్లను కాలపరిమితి రుణాల పూర్తి చెల్లింపులకు వినియోగించడం రేటింగ్ సవరణలకు కారణమైనట్లు సుజ్లాన్ వెల్లడించింది. తద్వారా విజయవంతంగా రుణ భారాన్ని తగ్గించుకోగలిగినట్లు వివరించింది. -
తయారీలో అధిక నియామకాలు
ముంబై: తయారీ రంగ కంపెనీలు అదనంగా ఉద్యోగులను తీసుకోవడం పట్ల సానుకూల అంచనాలతో ఉన్నాయి. 57 శాతం కంపెనీలు అక్టోబర్–డిసెంబర్ కాలంలో ఉద్యోగులను నియమిచుకోనున్నట్టు చెప్పాయి. టీమ్‌లీజ్ సర్వీసెస్ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ‘ఎంప్లాయిమెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్’ను విడుదల చేసింది. తయారీ, సేవల రంగ కంపెనీల్లో నియామకాల పట్ల ఉన్న ఉద్దేశ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని చూస్తే, ఇది 70 శాతం దాటుతుందని ఈ నివేదిక వెల్లడించింది. ‘‘కరోనా తర్వాత అంతర్జాతీయంగా ఉపాధి కల్పన 2.7 శాతం మేర కోలుకుంది. ఇది 2022 ద్వితీయ ఆరు నెలల కాలానికి బలంగా ఉంది. డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి నియామకాల ధోరణి కంపెనీల్లో, ముఖ్యంగా తయారీలో ఎంతో బలంగా ఉంది. పరిశ్రమల్లో ఆశావాదం పుంజుకోవడం, పండుగల సందర్భంగా వినియోగ డిమాండ్ పెరగడం, ప్రభుత్వం ప్రకటించిన అదనపు ప్రోత్సాహకాలు ఇందుకు మద్దతుగా నిలుస్తున్నాయి’’అని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేశ్ భట్ తెలిపారు. ప్రోత్సహకాలు కీలకం.. ‘‘ఉపాధి అవకాశాలను పెంచేందుకు, పర్యాటకం, ఏవియేషన్, నిర్మాణ రంగం, గృహ నిర్మాణానికి నిధుల లభ్యత పెంచేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.2.65 లక్షల కోట్ల ఉద్దీపనల ప్యాకేజీ తయారీ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచడంలో సాయంగా నిలుస్తోంది’’అని టీమ్‌లీజ్ అవుట్‌లుక్ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 14 పట్టణాల్లోని 311 తయారీ కంపెనీలను టీమ్‌లీజ్ సర్వే చేసింది. ప్రథమ శ్రేణి పట్టణాల్లోని తయారీ కంపెనీల్లో 91 శాతం నియామకాలకు సానుకూలంగా ఉన్నాయి. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని కంపెనీల్లో ఇది 69 శాతం, తృతీయ శ్రేణి పట్టణాల్లో 39 శాతం, గ్రామీణ ప్రాంతాల్లోని కంపెనీల్లో 21 శాతం మేర నియామకాలకు సానుకూలంగా ఉన్నాయి. ఈ పట్టణాల్లో మెరుగు.. ముంబైలో అత్యధికంగా 93 శాతం కంపెనీలు ప్రస్తుత త్రైమాసికంలో అదనంగా ఉద్యోగులను తీసుకోనున్నాయి. ఆ తర్వాత బెంగళూరులో 90 శాతం, చెన్నైలో 83 శాతం, ఢిల్లీలో 79 శాతం, పుణెలో 67 శాతం, హైదరాబాద్‌లో 61 శాతం, అహ్మదాబాద్‌లో 61 శాతం మేర కంపెనీలు నియామకాల ఉద్దేశ్యంతో ఉన్నాయి. బెంగళూరులో ఎఫ్ఎంసీజీ.. ముంబైలో తయారీ, ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, చెన్నైలో ఆగ్రోకెమికల్స్ కంపెనీలు ప్రస్తుత త్రైమాసికంలో ఉపాధి కల్పించనున్నాయి. -
ద్రవ్య లోటు కట్టడికి.. రుణభారం అడ్డంకి: మూడీస్
న్యూఢిల్లీ: నిరంతరం కొనసాగుతున్న విధాన సంస్కరణలతో రుణభారం తగ్గుతుందన్న సానుకూల అంచనాల కారణంగానే భారత్‌కి పాజిటివ్ అవుట్‌లుక్ ఇచ్చినట్లు రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. అయితే, భారీస్థాయిలో పెరిగిపోయిన ప్రభుత్వ రుణభారం కారణంగా ద్రవ్యలోటును తక్షణం తగ్గించుకోవడానికి అవకాశం లేదని పేర్కొంది. ఇతర దేశాలతో పోలిస్తే స్థూలదేశీయోత్పత్తి, ప్రభుత్వ రుణ భార నిష్పత్తి చాలా అధికంగా 68.6 శాతం స్థాయిలో ఉందని మూడీస్ పేర్కొంది. దీనికి తోడు మొత్తం వ్యయాల్లో జీతభత్యాల వాటా 50% మేర ఉండటం, ఇటీవలి వేతన సవరణ సిఫార్సుల అమలు తదితర అంశాల నేపథ్యంలో ద్రవ్య విధానాలపై ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని మూడీస్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో 3.9 శాతంగా ఉన్న ద్రవ్య లోటును ఈసారి 3.5 శాతానికి తగ్గించుకోవాలని కేంద్రం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే.