ద్రవ్య లోటు కట్టడికి.. రుణభారం అడ్డంకి: మూడీస్
న్యూఢిల్లీ: నిరంతరం కొనసాగుతున్న విధాన సంస్కరణలతో రుణభారం తగ్గుతుందన్న సానుకూల అంచనాల కారణంగానే భారత్‌కి పాజిటివ్ అవుట్‌లుక్ ఇచ్చినట్లు రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. అయితే, భారీస్థాయిలో పెరిగిపోయిన ప్రభుత్వ రుణభారం కారణంగా ద్రవ్యలోటును తక్షణం తగ్గించుకోవడానికి అవకాశం లేదని పేర్కొంది. ఇతర దేశాలతో పోలిస్తే స్థూలదేశీయోత్పత్తి, ప్రభుత్వ రుణ భార నిష్పత్తి చాలా అధికంగా 68.6 శాతం స్థాయిలో ఉందని మూడీస్ పేర్కొంది.
దీనికి తోడు మొత్తం వ్యయాల్లో జీతభత్యాల వాటా 50% మేర ఉండటం, ఇటీవలి వేతన సవరణ సిఫార్సుల అమలు తదితర అంశాల నేపథ్యంలో ద్రవ్య విధానాలపై ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని మూడీస్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో 3.9 శాతంగా ఉన్న ద్రవ్య లోటును ఈసారి 3.5 శాతానికి తగ్గించుకోవాలని కేంద్రం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే.