న్యూఢిల్లీ: ఫ్రెషర్లకు ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో తగినన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య ఫ్రెషర్లను నియమించుకోవాలని అనుకుంటున్నట్టు ఎక్కువ కంపెనీలు సర్వేలో వెల్లడించినట్టు టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ సంస్థ ఓ నివేదిక రూపంలో తెలిపింది. తొలి ఆరు నెలలకు సంబంధించి కెరీర్ అవుట్‌లుక్‌పై నివేదిక విడుదల చేసింది.
బలహీనమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, భారతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలు వచ్చే ఆరు నెలల్లో ఇతర రంగాల కంటే ఎక్కువ మంది ఫ్రెషర్లను నియమించుకుంటాయని స్టాఫింగ్ సంస్థ టీమ్‌లీజ్ గురువారం ప్రచురించిన కొత్త నివేదిక తెలిపింది.
భారత కంపెనీల ఫ్రెషర్ల నియామకాల ఉద్దేశ్యం 3 శాతం పెరిగి 62 శాతానికి చేరింది. 2022 జూలై-డిసెంబర్ కాలానికి ఇది 59 శాతంగా ఉంది. టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ 874 భారీ, మధ్య, చిన్న తరహా కంపెనీల అభిప్రాయాలను 2022 అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో సమీకరించి ఈ వివరాలను వెల్లడించింది. ప్రెషర్లను నియమించుకోనున్నట్టు ఐటీ కంపెనీల్లో అత్యధికంగా 67 శాతం చెప్పాయి. ఈ కామర్స్ అండ్ టెక్నాలజీ స్టార్టప్‌లలో ఇది 52 శాతంగా ఉంటే, టెలికమ్యూనికేషన్స్‌లో 51 శాతంగా ఉంది. ఫ్రెషర్ల నియామకాల పరంగా 75 శాతంతో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. ముంబై 56 శాతం, ఢిల్లీ 47 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
వీటికి డిమాండ్...
‘‘అంతర్జాతీయంగా నియామకాల పట్ల స్తబ్ధత నెలకొన్నప్పటికీ.. భారత కంపెనీల్లో అధిక శాతం ఫ్రెషర్లను నియమించుకోనున్నట్టు చెప్పాయి. కొన్ని దీర్ఘకాల మానవ వనరులను సమకూర్చుకునే పనిలో ఉన్నాయి. కొన్ని కంపెనీలు ప్రస్తుతం భారంగా మారిన మానవ వనరుల స్థానంలో తాజా శిక్షణ పొందిన నైపుణ్యాలను (తక్కువ వేతనాలపై) సర్దుబాటు చేసుకునే పనిలో ఉన్నాయి’’అని టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ వ్యవస్థాపకుడు, సీఈవో శంతనురూజ్ తెలిపారు. క్లౌడ్ డెవలపర్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ అసోసియేట్, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్, మార్కెటింగ్ అనలిస్ట్, సోషల్ మీడియా స్పెషలిస్ట్, కంటెంట్ రైటర్, కాంపెయిన్ అసోసియేట్, మైక్రోబయాలజిస్ట్, బయోమెడికల్ ఇంజనీర్ పోస్ట్‌లకు ఫ్రెషర్ల నియామకాల్లో డిమాండ్ నెలకొంది.
‘‘నియామకాల పట్ల ఆశావహంగా ఉన్న రంగాలను గుర్తించి, భవిష్యత్తులో డిమాండ్ ఉండే నైపుణ్యాల పట్ల ఉద్యోగార్థులు దృష్టి సారించాలి. ప్రస్తుత మార్కెట్ ధోరణలను అర్థం చేసుకుని, సరైన నైపుణ్యాలను నేర్చుకోవడంపై, తమ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే వాటిపై దృష్టి పెట్టాలి’’అని టీమ్‌లీజ్ ఎడ్యుటెక్ ప్రెసిడెంట్ నీతి శర్మ సూచించారు. కార్పొరేట్ ఫైనాన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ప్రాజెక్ట్‌మేనేజ్‌మెంట్ నైపుణ్యాలకు సైతం డిమాండ్ ఉన్నట్టు టీమ్‌లీజ్ నివేదిక వెల్లడించింది.
ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఉంటే జాబ్
నైపుణ్యాల ధ్రువీకరణ సర్టిఫికేషన్ ఉంటే ఉద్యోగాల్లో రాణించొచ్చని 91 శాతం మంది భారత విద్యార్థులు భావిస్తున్నారు. డిగ్రీ తర్వాత ఉద్యోగం సంపాదించేందుకు ఈ సర్టిఫికేషన్ సాయ పడుతుందని 96 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. ఆన్‌లైన్ లర్నింగ్ ప్లాట్ ఫామ్ ‘కోర్సెరా’ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు తెలిశాయి. ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాలతో పోలిస్తే భారత్‌లో కంపెనీలు ఉద్యోగుల నియామకాల సమయంలో ప్రొఫెషనల్ సర్టిఫికేషకు ఎక్కువ విలువ ఇస్తున్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఉద్యోగార్థుల అర్హతలను పెంచుతుందని భారత్‌లో 92 శాతం కంపెనీలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment