ముంబై: ఇంజనీరింగ్ సర్వీసుల ఐటీ కంపెనీ ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జూలె–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం స్వల్పంగా 2 శాతం పుంజుకుని రూ. 320 కోట్లకు చేరింది. లాభాల మార్జిన్లు నీరసించడం ప్రభావం చూపింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 315 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 8 శాతం ఎగసి రూ. 2,573 కోట్లను తాకింది.
యూరోపియన్ మార్కెట్ నుంచి ఆటోమొబైల్, సస్టెయినబిలిటీ సొల్యూషన్లకు ఏర్పడిన డిమాండ్ ఇందుకు తోడ్పాటునిచ్చింది. వాటాదారులకు షేరుకి రూ. 17 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఈ నెల 25 రికార్డ్ డేట్‌కాగా.. ఈ ఏడాది 2,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు ఆఫర్ చేయనున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో అమిత్ చద్దా పేర్కొన్నారు. ఈ కాలంలో 121 మందిని చేర్చుకోవడంతో సిబ్బంది సంఖ్య 23,698కు చేరింది.
అమ్మకాలు, టెక్నాలజీలపై అధిక వ్యయాలతో నిర్వహణ లాభ మార్జిన్లు 17.1 శాతం నుంచి 15.1 శాతానికి బలహీనపడ్డాయి. 8–10 శాతం వృద్ధి ప్రస్తుత ఏడాది ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ ఆదాయంలో 8–10 శాతం వృద్ధి నమోదుకానున్నట్లు అమిత్ చద్దా పేర్కొన్నారు. వార్షికంగా 2 బిలియన్ డాలర్ల ఆదాయ మార్క్‌ను అందుకోగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇకపై మార్జిన్లు మెరుగుపడనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఏడాది చివరికల్లా ఆదాయంలో 16 శాతం పురోగతిని అందుకోగలమని అంచనా వేశారు. ప్రస్తుత సమీక్షాకాలంలో 2 కోట్ల డాలర్ల విలువైన 2 డీల్స్‌తోపాటు కోటి డాలర్ల విలువైన 4 ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment