ముంబై: ఐటీ సర్వీసుల కంపెనీ ఎల్‌టీమైండ్‌ట్రీ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 8 శాతం పుంజుకుని రూ. 1,251 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,161 కోట్లు ఆర్జించింది.
మొత్తం ఆదాయం సైతం 6 శాతం ఎగసి రూ. 9,432 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 8,905 కోట్ల టర్నోవర్ సాధించింది. వాటాదారులకు షేరుకి రూ. 20 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. కీలక విభాగాలలో 20 కోట్ల డాలర్ల డీల్‌సహా పలు కాంట్రాక్టులు కుదుర్చుకున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ దేవశిష్ చటర్జీ పేర్కొన్నారు.
ఈ కాలంలో 2,504 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 84,438ను తాకింది. సెప్టెంబర్ కల్లా 742 మంది యాక్టివ్ క్లయింట్లను కలిగి ఉంది. ఫలితాల నేపథ్యంలో ఎల్‌టీమైండ్‌ట్రీ షేరు బీఎస్‌ఈలో 0.7% బలపడి రూ. 6,402 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment