mindtree
-
ఎల్‌టీమైండ్‌ట్రీ లాభం ప్లస్.. 2,504 మందికి ఉద్యోగాలు
ముంబై: ఐటీ సర్వీసుల కంపెనీ ఎల్‌టీమైండ్‌ట్రీ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 8 శాతం పుంజుకుని రూ. 1,251 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,161 కోట్లు ఆర్జించింది.మొత్తం ఆదాయం సైతం 6 శాతం ఎగసి రూ. 9,432 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 8,905 కోట్ల టర్నోవర్ సాధించింది. వాటాదారులకు షేరుకి రూ. 20 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. కీలక విభాగాలలో 20 కోట్ల డాలర్ల డీల్సహా పలు కాంట్రాక్టులు కుదుర్చుకున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ దేవశిష్ చటర్జీ పేర్కొన్నారు.ఈ కాలంలో 2,504 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 84,438ను తాకింది. సెప్టెంబర్ కల్లా 742 మంది యాక్టివ్ క్లయింట్లను కలిగి ఉంది. ఫలితాల నేపథ్యంలో ఎల్‌టీమైండ్‌ట్రీ షేరు బీఎస్ఈలో 0.7% బలపడి రూ. 6,402 వద్ద ముగిసింది. -
నిఫ్టీలో ఎల్‌టీఐమైండ్‌ట్రీ హెచ్డీఎఫ్సీ స్థానంలో చోటు
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్ఛేంజి దిగ్గజం ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ–50లో ఎల్‌టీఐమైండ్‌ట్రీ చోటు సాధించనుంది. మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ స్థానే ఇండెక్స్‌లో చేరనుంది. ఈ నెల 13 నుంచి ఇండెక్స్‌లో ప్రాతినిధ్యం వహించనుంది. హెచ్డీఎఫ్సీ దిగ్గజాల విలీనం నేపథ్యంలో నిఫ్టీ–50తోపాటు..నిఫ్టీ 100, నిఫ్టీ–500 ఇండెక్స్లలోనూ సవరణలు చేపట్టినట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. నిఫ్టీ–100లో హెచ్‌డీఎఫ్‌సీకి బదులు జిందాల్ స్టీల్ అండ్ పవర్‌కు చోటు లభించనుంది. ఎన్ఎస్ఈ ఇండెక్సుల నిర్వహణ ఉపకమిటీ(ఈక్విటీ) ఈ మేరకు మార్పులు చేపట్టినట్లు ఎన్ఎస్ఈ పేర్కొంది. ఈ బాటలో నిఫ్టీ–500లో హెచ్డీఎఫ్సీ స్థానంలో మ్యాన్‌కైండ్ ఫార్మా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ స్థానంలో జిందాల్ స్టీల్ అండ్ పవర్ ప్రాతినిధ్యం వహించనున్నాయి. తాజా సవరణలు 2023 జూలై 13 నుంచి అమలుకానున్నట్లు ఎన్ఎస్ఈ తెలియజేసింది. -
అదరగొట్టిన ఎల్అండ్టీ ఇన్ఫోటెక్..మైండ్‌ట్రీతో విలీనంపై కీలక వ్యాఖ్యలు..!
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల మధ్యస్థాయి కంపెనీ ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 17 శాతం వృద్ధితో దాదాపు రూ. 638 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021) ఇదే కాలంలో రూ. 545 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 32 శాతం వరకూ ఎగసి రూ. 4,302 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 3,269 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కంపెనీ నికర లాభం 19 శాతం పుంజుకుని రూ.2,297 కోట్లయ్యింది. 2020–21లో రూ. 1,936 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 27 శాతం అధికమై రూ. 15,669 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది కేవలం రూ. 12,370 కోట్ల టర్నోవర్ నమోదైంది. విలీనం ఊహాజనితం గ్రూప్ కంపెనీ మైండ్‌ట్రీతో విలీనంపై ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ యాజమాన్యం ఊహాజనితమంటూ స్పందించింది. ఊహాగానాలపై వ్యాఖ్యానించబోమంటూ క్యూ4 ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ సీఈవో, ఎండీ సంజయ్ జలోనా స్పష్టం చేశారు. మైండ్‌ట్రీతో విలీనంపై ఎలాంటి వివరాలూ అందుబాటులో లేవని, మీడియా అంచనాలపై వ్యాఖ్యానించబోమని ఎక్సే్ఛంజీలకు తెలిపారు. 6,000 మందికి ఉద్యోగాలు... వాటాదారులకు షేరుకి రూ. 30 చొప్పున డివిడెండును ఎల్అండ్టీ ఇన్ఫో ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో 6,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలివ్వనున్నట్లు పేర్కొంది. గతేడాది 6,200 మందికి ఉపాధి కల్పించినట్లు ప్రస్తావించింది. ప్రస్తుతం కంపెనీ సిబ్బంది సంఖ్య 46,648కు చేరినట్లు వెల్లడించింది. ఎట్రిషన్ రేటు 24 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఎల్అండ్టీ ఇన్ఫో షేరు 8.3% పతనమై రూ. 5,385 వద్ద ముగిసింది. చదవండి: ఎల్అండ్టీ ఇన్ఫో, మైండ్‌ట్రీ విలీనం! -
మైండ్‌ట్రీ లాభం జూమ్...
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల కంపెనీ మైండ్‌ట్రీ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో నికర లాభం 34% జంప్‌చేసి రూ. 437 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 326 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 36 శాతం పురోగమించి రూ. 2,750 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 2,024 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. డాలర్ల రూపేణా ఈ ఏడాది క్యూ3లో మైండ్‌ట్రీ డాలర్ల రూపేణా 58.3 మిలియన్ డాలర్ల నికర లాభం ఆర్జించింది. ఇది 32 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం 34 శాతం పుంజుకుని 366.4 మిలియన్ డాలర్లకు చేరింది. డిసెంబర్ చివరికల్లా కంపెనీ యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 265ను తాకగా.. 31,959 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. తాజా త్రైమాసికంలో 4,500 మంది ఉద్యోగులను చేర్చుకుంది. వచ్చే ఏడాది(2022–23)లో క్యాంపస్‌ల ద్వారా మరింత మందిని ఎంపిక చేసుకోనున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ దేవశిష్ చటర్జీ పేర్కొన్నారు. గత 12 నెలల్లో ఉద్యోగ వలసల రేటు 21.9 శాతంగా నమోదైనట్లు తెలియజేశారు. కోయంబత్తూర్, వరంగల్‌లో కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో మైండ్‌ట్రీ షేరు బీఎస్ఈలో 2.4% లాభపడి రూ. 4,744 వద్ద ముగిసింది. -
మైండ్ ట్రీ డివిడెండ్ రూ.10
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ మైండ్‌ట్రీకి గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.206 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) ఇదే క్వార్టర్లో రూ.198 కోట్ల నికర లాభం వచ్చిందని, 4 శాతం వృద్ధి సాధించామని మైండ్‌ట్రీ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.1,839 కోట్ల నుంచి 12 శాతం వృద్ధితో రూ.2,051 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ, ఎమ్డీ దేబాశిష్ చటర్జీ పేర్కొన్నారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.10 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని వివరించారు. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం ఫ్లాట్‌గా 2.8 కోట్ల డాలర్లకు చేరగా, ఆదాయం మాత్రం 6 శాతం వృద్ధితో 28 కోట్ల డాలర్లకు పెరిగిందని తెలిపారు. నిర్వహణ లాభ మార్జిన్ ఒకటిన్నర శాతం పెరిగిందని, 40 కోట్ల డాలర్ల విలువైన డీల్స్ సాధించామని వివరించారు. పూర్తి సంవత్సరానికి లాభం తగ్గింది: పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర లాభం 16% తగ్గి రూ.631 కోట్లకు చేరగా, ఆదాయం మాత్రం 11% ఎగసి రూ.7,764 కోట్లకు పెరిగిందని చటర్జీ తెలిపారు. మార్చి నాటికి యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 307కు చేరిందని, మొత్తం ఉద్యోగుల సంఖ్య 21,991గా ఉందని, అట్రిషన్ రేటు(ఉద్యోగుల వలస) 17.4%గా ఉందని వివరించారు. -
మైండ్‌ట్రీ ఆదాయం రూ.1,965 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ మైండ్‌ట్రీకి ఈ ఆర్థిక సంవత్సరం(2019–20) డిసెంబర్ క్వార్టర్లో రూ.197 కోట్ల నికరలాభం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.191 కోట్ల నికర లాభం ఆర్జించామని కంపెనీ సీఈఓ, ఎమ్డీ దేబాశిష్ చటర్జీ తెలిపారు. 3 శాతం వృద్ధి సాధించామని పేర్కొన్నారు. గత క్యూ3లో రూ.1,787 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ3లో 10 శాతం వృద్ధితో రూ.1,965 కోట్లకు పెరిగిందని వివరించారు. సీక్వెన్షియల్‌గా చూస్తే, నిర్వహణ లాభ మార్జిన్ 2.6 శాతం, నికర లాభం 45 శాతం చొప్పున పెరిగాయని తెలిపారు. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 3 శాతం వృద్ధితో 2.8 కోట్ల డాలర్లకు, ఆదాయం 9 శాతం వృద్ధితో 28 కోట్ల డాలర్లకు పెరిగాయని చటర్జీ పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ నాటికి చురుకైన క్లయింట్ల సంఖ్య 320గా ఉందని వివరించారు. తమ కంపెనీలో మొత్తం 21,561 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఆట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస) 17.2 శాతంగా ఉందని తెలిపారు. ఆదాయంలో వృద్ధి సాధిస్తున్నామని, లాభదాయక వృద్ధి సాధించడంపైనా దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. గత ఏడాది జూలైలో ఈ కంపెనీని ఎల్ అండ్ టీ టేకోవర్ చేసిన విషయం తెలిసిందే. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో మైండ్‌ట్రీ షేర్ 2.8% లాభంతో రూ.864 వద్ద ముగిసింది. -
మైండ్ ట్రీకి ఎల్ అండ్ టీ ఓపెన్ ఆఫర్
న్యూఢిల్లీ: మైండ్ ట్రీ కంపెనీ టేకోవర్‌లో భాగంగా ఎల్ అండ్ టీ కంపెనీ రూ.5,029.8 కోట్ల ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా మైండ్ ట్రీ కంపెనీలో 31 శాతం వాటాకు సమానమైన 5.13 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేస్తామని ఎల్ అండ్ టీ తెలిపింది. ఒక్కో షేర్‌కు రూ.980 ధరను (మైండ్ ట్రీ షేర్ శుక్రవారం రూ.969 ధర వద్ద ముగిసింది) ఆఫర్ చేస్తోంది. ఈ ఓపెన్ ఆఫర్ ఈ నెల 17 న మొదలై 28న ముగుస్తుంది. షెడ్యూల్ ప్రకారమైతే ఈ ఓపెన్ ఆఫర్ మే 14 నుంచే మొదలు కావలసి ఉంది. అయితే మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ నుంచి అనుమతి రావడం ఆలస్యం కావడంతో ఓపెన్ ఆఫర్లో జాప్యం చోటు చేసుకుంది. అసెట్– లైట్ సర్వీసెస్ బిజినెస్ పోర్ట్‌ఫోలియోలో ఆదాయం, లాభాలు పెంచుకునే వ్యూహంలో భాగంగా మైండ్ ట్రీ కంపెనీని ఎల్ అండ్ టీ కొనుగోలు చేస్తోంది. మొత్తం రూ.10,700 కోట్లు... ఎల్ అండ్‌టీ కంపెనీ ఇప్పటికే మైండ్ ట్రీలో 35.15 శాతం వాటా షేర్లను కొనుగోలు చేసింది. తాజా ఓపెన్ ఆఫర్ పూర్తిగా సబ్‌స్క్రైబయితే మైండ్‌ట్రీలో ఎల్ అండ్ టీ వాటా 66 శాతానికి చేరుతుంది. మొత్తం మీద మైండ్ ట్రీలో 66 శాతం వాటా కోసం ఎల్ అండ్ టీ కంపెనీ రూ.10,700 కోట్లు వెచ్చిస్తోంది. వి.జి. సిద్ధార్థ, కాఫీ డే ట్రేడింగ్ లిమిటెడ్, కాఫీ డే ఎంటర్ప్రైజెస్ల నుంచి 20.15 శాతం వాటాకు సమానమైన 3.33 కోట్ల షేర్లను ఎల్ అండ్ టీ కొనుగోలు చేసింది. ఒక్కో షేర్‌కు రూ.980 చెల్లించింది. ఈ వాటా షేర్ల కోసం మొత్తం రూ.3,269 కోట్లను వెచ్చించింది. ఇక మార్చి 18న యాక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్ ద్వారా 15 శాతం వాటాకు సమానమైన 2.48 కోట్ల షేర్లను రూ.2,434 కోట్లకు కొనుగోలు చేసింది. -
మైండ్‌ట్రీలో ఎల్అండ్టీకి 20 శాతం వాటాలు
న్యూఢిల్లీ: ఐటీ సంస్థ మైండ్‌ట్రీని టేకోవర్ చేసే యత్నాల్లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) మెజారిటీ వాటాల కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టింది. కెఫే కాఫీ డే, ఆ సంస్థ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థకు మైండ్‌ట్రీలో ఉన్న 3.27 కోట్ల షేర్లు (20.32 శాతం వాటాలు) మంగళవారం బ్లాక్ డీల్ ద్వారా ఎల్అండ్టీ కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 3,210 కోట్లు వెచ్చించింది. స్టాక్ ఎక్సే్చంజీ బీఎస్ఈకి కంపెనీ ఇచ్చిన సమాచారం ద్వారా ఈ విషయం వెల్లడైంది. మైండ్‌ట్రీని బలవంతంగా టేకోవర్ చేసేందుకు 66 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు ఎల్అండ్టీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. -
స్టార్టప్స్‌కి ఏం సందేశమిస్తున్నట్లూ..
బెంగళూరు: బలవంతపు టేకోవర్ యత్నాలు చేస్తున్న లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ)పై ఐటీ సంస్థ మైండ్‌ట్రీ వ్యవస్థాపకులు నిప్పులు చెరిగారు. దిగ్గజ సంస్థ అయి ఉండి .. సొంతంగా ఒక పెద్ద టెక్నాలజీ కంపెనీని నిర్మించుకోలేదా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇలాంటి బలవంతపు టేకోవర్ ప్రయత్నాలతో విశ్వసనీయత.. నిజాయితీ గల స్టార్టప్స్‌కి, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఏం సందేశం ఇవ్వదల్చుకున్నారని ప్రశ్నించారు. ఎల్అండ్టీకి మైండ్‌ట్రీ వ్యవస్థాపకులు అయిదు ప్రశ్నలు సంధించారు. టేకోవర్ని తమ ఉద్యోగులు కూడా ఇష్టపడటం లేదని, ఒకవేళ బలవంతంగా చేజిక్కించుకున్న పక్షంలో వారు నిష్క్రమిస్తే కంపెనీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించాలని సూచించారు. ‘మీ కంపెనీ టర్నోవరు రూ. 1,20,000 కోట్లకు పైగా ఉంటుంది. మా కంపెనీతో పోలిస్తే ఏకంగా 18 రెట్లు పెద్దది. అలాంటప్పుడు పక్క కంపెనీని దెబ్బతీయకుండా మీ సొంత వనరులు, సామర్థ్యాలతో ఒక గొప్ప టెక్నాలజీ సంస్థను నిర్మించుకోలేరా? మైండ్‌ట్రీ ఉద్యోగులు కేవలం జీతం కోసమే పనిచేయరు. వారికంటూ ఒక లక్ష్యం ఉంది. దాన్ని లాగేసుకుంటే.. వారూ ఉండరు. అప్పుడు ఎవరూ లేని ఈ కంపెనీని ఏం చేసుకుంటారు‘ అని మంగళవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మైండ్‌ట్రీ ప్రమోటరు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణకుమార్ నటరాజన్ ప్రశ్నించారు. ఒకవేళ ఎల్అండ్టీ ఏకపక్షంగా ముందుకే వెడితే.. ఒక చెడ్డ ఉదాహరణగా నిల్చిపోతుందన్నారు. మైండ్‌ట్రీ ప్రత్యేక సంస్కృతికి ఆకర్షితులై వచ్చిన క్లయింట్లు.. బలవంతపు టేకోవర్ జరిగితే వేరే కంపెనీలవైపు మళ్లే ప్రమాదముందని చెప్పారు. ‘అదే జరిగితే ఇటు మా సంస్థ, అటు మీ కంపెనీల షేర్‌హోల్డర్ల ప్రయోజనాలను దెబ్బతీసినవారవుతారు. ఇలా చేయడం సబబేనా‘ అని ఆయన ప్రశ్నించారు. దాదాపు రూ. 10,800 కోట్లతో మైండ్‌ట్రీని బలవంతంగా టేకోవర్ చేసేందుకు ఎల్అండ్టీ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే కంపెనీలో మెజారిటీ ఇన్వెస్టర్ అయిన కెఫే కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ నుంచి 20.32 శాతం వాటాల కొనుగోలుకు ఎల్అండ్టీ ఒప్పందం కుదుర్చుకుంది. బహిరంగ మార్కెట్ నుంచి మరో 15 శాతం, ఓపెన్ ఆఫర్ ద్వారా ఇంకో 31 శాతం వాటాలు కొనుగోలు చేయాలని యోచిస్తోంది. అయితే, ఈ టేకోవర్‌ను మైండ్‌ట్రీ వ్యవస్థాపకులు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కంపెనీ తమ చేతుల నుంచి జారిపోకుండా ప్రమోటర్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వీలైతే షేర్ల బైబ్యాక్ కూడా చేపట్టనున్నారు. సోమవారం ముగింపుతో పోలిస్తే కేవలం 1.81 శాతం ప్రీమియం ఆఫర్ చేయడంపై అటు మైండ్‌ట్రీలో వాటాలున్న మ్యూచువల్ ఫండ్స్ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఇదే ఎల్అండ్టీని 1980లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ బలవంతంగా టేకోవర్ చేసేందుకు ప్రయత్నించడం గమనార్హం. అప్పట్లో ఉద్యోగులే ఆ ప్రయత్నాలను తిప్పికొట్టారు. టేకోవర్ వివాదం వార్తల నేపథ్యంలో మంగళవారం ఎల్అండ్టీ, మైండ్‌ట్రీ షేర్లు క్షీణించాయి. బీఎస్ఈలో మైండ్‌ట్రీ షేరు ధర 2.03 శాతం తగ్గి రూ. 943 వద్ద క్లోజయ్యింది. అటు ఎల్అండ్టీ షేరు 1.60 శాతం క్షీణించి రూ. 1,356.75 వద్ద ముగిసింది. అయితే, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ స్టాక్ మాత్రం 3.99 శాతం పెరిగి రూ. 1,636.05 వద్ద క్లోజయ్యింది. ప్రమోటర్లనూ ఒప్పిస్తాం: ఎల్అండ్టీ ఎండీ సుబ్రహ్మణ్యన్ బలవంతపు టేకోవర్ ప్రయత్నాలపై విమర్శలు ఎదుర్కొంటున్న ఎల్అండ్టీ ఈ వ్యవహారంపై స్పందించింది. మూడు నెలల క్రితం వీజీ సిద్ధార్థ తన వాటాల విక్రయం కోసం తమను సంప్రదించడం వల్లే ఈ డీల్‌కు బీజం పడిందని ఎల్అండ్టీ ఎండీ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఇతర వ్యాపారాలకి సంబంధించి నిధుల అవసరం ఉన్న సిద్ధార్థ... తాము కాకపోతే మరొకరికైనా సరే ఎలాగూ వాటాలను విక్రయించేసి ఉండేవారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘ప్రేమాభిమానాల’తో అందరి మనసూ చూరగొంటామని, ప్రమోటర్లను కూడా ఒప్పించగలమనే నమ్మకం తమకుందని ధీమా వ్యక్తం చేశారు. మైండ్‌ట్రీలో కనీసం 26 శాతం వాటాలైన దక్కించుకోవాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. మైండ్‌ట్రీ రాబోయే రోజుల్లోనూ ప్రత్యేక సంస్థగానే కొనసాగుతుందని, దాన్ని విలీనం చేసుకునే యోచనేదీ లేదన్నారు. తమ ప్రధాన వ్యాపారమైన ఈపీసీ (ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) విభాగంలో లాభాల మార్జిన్లు 5–6 శాతంగా ఉంటాయని, కానీ ఐటీ సర్వీసుల్లో సాధారణంగా 15–16 శాతం మేర ఉంటాయని.. అందుకే మైండ్‌ట్రీ కొనుగోలుపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు. నియంత్రణ సంస్థలన్నింటి నుంచి 30–45 రోజుల్లోగా ఈ డీల్‌కు అనుమతులు రాగలవని భావిస్తున్నట్లు గ్రూప్ సీఎఫ్‌వో ఆర్ శంకరరామన్ చెప్పారు. -
మైండ్‌ట్రీపై మైండ్‌గేమ్!!
ఐటీ సంస్థ మైండ్‌ట్రీ కోసం ఇటు వ్యవస్థాపకులు, అటు దిగ్గజ సంస్థ ఎల్అండ్టీ మధ్య పోరు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. కంపెనీపై పట్టు కోల్పోకుండా చూసుకునేందుకు ఇటు వ్యవస్థాపకులు ప్రయత్నిస్తుండగా.. టేకోవర్ చేసేందుకు అటు ఎల్అండ్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మెజారిటీ వాటాదారు కాఫీ డే ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థకి చెందిన 20.3 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఓపెన్ ఆఫర్ కూడా ప్రకటిస్తున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కూడా తెలియజేసింది. టేకోవర్ తర్వాత కూడా మైండ్‌ట్రీ .. లిస్టెడ్ కంపెనీగానే కొనసాగుతుందని ఎల్అండ్టీ సీఈవో ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు, కంపెనీ చేజారిపోకుండా కాపాడుకునేందుకు మైండ్‌ట్రీ వ్యవస్థాపకుల్లో ఒకరైన సుబ్రతో బాగ్చీ.. తాజాగా (మార్చి 17న) ఒడిశా స్కిల్ డెవలప్మెంట్ అథారిటీ పదవికి రాజీనామా చేసి వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. ’మైండ్‌ట్రీని బలవంతంగా టేకోవర్ చేసే ముప్పు ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వ పదవికి రాజీనామా చేసి, కంపెనీని కాపాడుకునేందుకు వెళ్లక తప్పడం లేదు. చెట్టును (ట్రీ) నరికేసి ఆ స్థానంలో షాపింగ్ మాల్ కట్టేందుకు బుల్డోజర్లు, రంపాలతో వచ్చిన వాళ్ల నుంచి కంపెనీని కాపాడుకోవాల్సి ఉంది’ అంటూ ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఒకవేళ మైండ్‌ట్రీని గానీ ఎల్అండ్టీ చేజిక్కించుకోగలిగిందంటే.. దేశీ ఐటీ రంగంలో ఇది తొలి హోస్టైల్ టేకోవర్ కానుంది. ఎల్అండ్టీ ఆఫర్ .. మైండ్‌ట్రీలో పెద్ద వాటాదారైన సిద్ధార్థ నుంచి వాటాల కొనుగోలు కోసం ఎల్అండ్టీ షేరు ఒక్కింటికి రూ. 980 చొప్పున దాదాపు రూ. 3,269 కోట్లు వెచ్చిస్తోంది. అలాగే ఓపెన్ మార్కెట్ నుంచి ఇంకో 15 శాతం కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ. 2,434 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. మరోవైపు, షేరు ఒక్కింటికి రూ. 980 చొప్పున రేటుతో మరో 31 శాతం వాటాల కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఇందుకోసం దాదాపు రూ. 5,027 కోట్లు వెచ్చించాల్సి రానుంది. మొత్తం మీద మూడంచెల ఈ డీల్‌తో మైండ్‌ట్రీలో ఎల్అండ్టీకి 66.3 శాతం దాకా వాటాలు లభించే అవకాశం ఉంది. ఇందుకోసం మొత్తం రూ. 10,730 కోట్ల దాకా వెచ్చించే అవకాశం ఉంది. ఈ ఆఫర్‌కు యాక్సిస్ క్యాపిటల్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా సంస్థలు మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. మరోవైపు, టేకోవర్ యత్నాలను ఎదుర్కొనేందుకు వ్యవస్థాపకులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సిద్ధార్థ నుంచి వాటాలను బైబ్యాక్ చేయడంపైనా దృష్టి పెడుతున్నారు. ఇందుకోసం గత రెండు నెలలుగా కేకేఆర్, బేరింగ్ ఏషియా, క్రిస్‌క్యాపిటల్ తదితర ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నారు. అయితే, ఇవి ముందుకు సాగుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇందుకు మూడు ప్రధాన కారణాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. కంపెనీ యాజమాన్య అధికారాన్ని ఎక్కువగా వదులుకునేందుకు వ్యవస్థాపకులు సిద్ధంగా లేకపోవడం, ఎల్అండ్టీ ఇచ్చే ఆఫర్‌కి దీటుగా చాలా మటుకు ఇన్వెస్టర్లు నిధులు వెచ్చించే అవకాశాలు లేకపోవడం, ఎల్అండ్టీతో పోరాటమంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం ఇందుకు కారణాలుగా తెలుస్తోంది. టేకోవర్‌కు బీజం.. 1999లో సుబ్రతో బాగ్చీ, అశోక్ సూతా, నమకల్ పార్థసారథి, కృష్ణకుమార్ నటరాజన్, స్కాట్ స్టేపుల్స్ తదితరులు 10 మంది కలిసి మైండ్‌ట్రీ కన్సల్టింగ్ సంస్థను ఏర్పాటు చేశారు. 2000లో వీజీ సిద్ధార్థ నుంచి తొలి విడతగా కొంత మేర పెట్టుబడులు సమీకరించారు. 2008లో మైండ్‌ట్రీ కన్సల్టింగ్ పేరు మైండ్‌ట్రీగా మారింది. 2011లో వ్యవస్థాపక చైర్మన్ అశోక్ సూతా రాజీనామా చేసినప్పుడు ఆయన వాటాలను కూడా కొనుగోలు చేసిన సిద్ధార్థ.. అతి పెద్ద షేర్‌హోల్డర్‌గా మారారు. 2018లో మైండ్‌ట్రీ డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్న సిద్ధార్థ.. తన వాటాలను విక్రయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఐటీæ కార్యకలాపాల విభాగం (ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ –ఎల్టీఐ) కూడా ఉన్న ఎల్అండ్టీ అప్పుడే ఇతర సంస్థల కొనుగోలు ప్రయత్నాల్లో ఉండటంతో.. దీనిపైనా దృష్టి సారించింది. ఎల్అండ్టీ చైర్మన్ ఏఎం నాయక్‌తో సిద్ధార్థ చర్చలు కూడా జరిపారు. మిగతా వ్యవస్థాపకులను కూడా ఒప్పించగలిగితే.. మరింత అధిక రేటు ఇస్తామంటూ నాయక్ ఆఫర్ ఇవ్వడంతో.. సిద్ధార్థ ఆ ప్రయత్నాలూ చేశారు. కానీ, వ్యవస్థాపకులు ఇందుకు ఇష్టపడటం లేదు. రెండు సంస్థల నిర్వహణ తీరు, పని సంస్కృతిలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని వారు భావిస్తుండటమే ఇందుకు కారణం. ఇవే కారణాలతో సంస్థాగత ఇన్వెస్టర్లు, క్లయింట్లు, ఉద్యోగులు ఈ డీల్‌పై విముఖంగా ఉన్నారంటూ ఇటీవలే ఎల్అండ్టీ బోర్డుకు కూడా వారు లేఖ రాసినట్లు సమాచారం. సోమవారం మైండ్‌ట్రీ షేరు బీఎస్ఈలో 1.74 శాతం పెరిగి రూ. 962.50 వద్ద క్లోజయ్యింది. రెండూ కలిస్తే.. దాదాపు 1 బిలియన్ డాలర్ల ఆదాయాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. క్లౌడ్, బిగ్ డేటా వంటి కొంగొత్త టెక్నాలజీల్లో నైపుణ్యాలు మైండ్‌ట్రీకి ప్లస్‌పాయింట్స్‌గా ఉండటంతో .. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ (ఎల్టీఐ) దీనిపై ఆసక్తిగా కనపరుస్తోంది. ఎల్టీఐ నికర విలువ దాదాపు రూ. 4,387 కోట్లుగా ఉండగా.. 2018 డిసెంబర్ ఆఖరు నాటికి సంస్థ దగ్గర సుమారు రూ. 2,032 కోట్ల మేర నగదు, లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. మైండ్‌ట్రీలో 51 శాతం వాటాలు దక్కించుకున్న పక్షంలో.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే ఎల్‌టీఐకి అదనంగా మైండ్‌ట్రీ నుంచి రూ. 460 కోట్ల దాకా లాభాలు దఖలుపడతాయి. రెండూ కలిశాయంటే.. ఆదాయాలు 1.7 బిలియన్ డాలర్ల దాకా ఉంటాయని అంచనా. తద్వారా దేశీ ఐటీలో ఆరు పెద్ద సంస్థ ఏర్పాటైనట్లవుతుంది. రెండింటికీ అమెరికా, యూరప్‌లే ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయి. టెక్నాలజీ, మీడియా, సర్వీసెస్ విభాగాల్లో మైండ్‌ట్రీ పటిష్టంగా ఉండటం.. ఎల్‌టీఐకి లాభించనుంది. మైండ్‌ట్రీ మొత్తం వ్యాపారంలో డిజిటల్ వాటా 49.5 శాతం కాగా ఎల్‌టీఐకి 37 శాతమే ఉంది. అంతేకాకుండా ఉద్యోగిపై సగటు ఆదాయాన్ని చూస్తే ఎల్టీఐ కన్నా మైండ్‌ట్రీదే పైచేయిగా ఉంది. మైండ్‌ట్రీకి ప్రస్తుతం 19,908 మంది ఉద్యోగులు, 340 మంది క్లయింట్స్ ఉన్నారు. వ్యవస్థాపకులకు 13 శాతం వాటాలు... ప్రస్తుతం ప్రమోటర్ల గ్రూప్‌లో భాగమైన బాగ్చీ, పార్థసారథి, నటరాజన్, మైండ్‌ట్రీ సీఈవో రోస్టో రవనన్ తదితరులకు 13 శాతం వాటాలు ఉన్నాయి. నటరాజన్‌కు 3.72 శాతం, పార్థసారథికి 1.43 శాతం, రవనన్కు 0.71 శాతం, బాగ్చీకి 3.1 శాతం వాటాలు ఉన్నాయి. -
పన్ను బకాయిలేమీ లేవు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ చెబుతున్నట్లుగా తమ కంపెనీ కట్టాల్సిన పన్ను బాకీలేమీ లేవని కాఫీ డే ఎంటర్ప్రైజెస్ స్పష్టం చేసింది. బాకీలు రాబట్టుకోవడం కోసమంటూ ఆదాయపన్ను శాఖ అటాచ్ చేసుకున్న మైండ్‌ట్రీ షేర్లను విడిపించుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని తెలిపింది. ‘ఆదాయ పన్ను శాఖ 148, 153ఎ సెక్షన్ల కింద ఇచ్చిన నోటీసులకు అనుగుణంగా ప్రమోటరు, కంపెనీ సవరించిన రిటర్నులను దాఖలు చేయడం జరిగింది. వీటి ప్రకారం.. కంపెనీ, దాని అనుబంధ సంస్థలు గానీ, ప్రమోటరు గానీ కట్టాల్సిన పన్ను బాకీలేమీ లేవు‘ అని స్టాక్ ఎక్సే్ఛంజీలకు కాఫీ డే ఎంటర్ప్రైజెస్ తెలిపింది. సీసీడీ కాఫీ చెయిన్‌ను కాఫీ డే ఎంటర్ప్రైజెస్ నిర్వహిస్తోంది. కాఫీ డే ఎంటర్ప్రైజెస్, దాని ప్రమోటరు సిద్ధార్థ రిటర్నుల్లో చూపిన దానికంటే మరింత ఎక్కువ మొత్తం పన్నులు చెల్లించాల్సి ఉంటుందనే కారణంతో.. ఐటీ సంస్థ మైండ్‌ట్రీలో వారికున్న వాటాల్లో కొంత భాగాన్ని ఐటీ శాఖ అటాచ్ చేసింది. వీటినే విడిపించుకునేందుకు కాఫీ డే, సిద్ధార్థ ప్రయత్నాల్లో ఉన్నారు. వివాదమిదీ.. ఐటీ సంస్థ మైండ్‌ట్రీ ఏర్పాటైన తొలినాళ్ల నుంచి పెట్టుబడులతో తోడ్పాటునందించిన వీజీ సిద్ధార్థ గ్రూప్‌నకు ఈ కంపెనీలో 21 శాతం వాటాలు ఉన్నాయి. ప్రస్తుతం మరో ఐటీ సంస్థ ఎల్అండ్టీ ఇన్ఫోటెక్‌కు ఈ వాటాలను విక్రయించేందుకు సిద్ధార్థ చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ ఇది పూర్తయితే నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం టేకోవర్ చేసిన కంపెనీ ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి రావొచ్చు. అయితే, మైండ్‌ట్రీలో కాఫీ డే వాటాల విక్రయాన్ని సుబ్రతో బాగ్చి, ఎన్ఎస్ పార్థసారథి తదితర వ్యవస్థాపకులు వ్యతిరేకిస్తున్నారు. మేనేజ్మెంట్ మద్దతు లేకుండా ఈ డీల్ సాకారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈలోగా మైండ్‌ట్రీలో సిద్ధార్థకు ఉన్న షేర్లలో 22.2 లక్షల షేర్లు, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌కున్న 52.7 లక్షల షేర్లను ఐటీ శాఖ అటాచ్ చేసుకుంది. జనవరి 25తో మొదలుకుని ఆరు నెలల పాటు ఈ ఆర్డరు అమల్లో ఉండనుంది. దీంతో సిద్ధార్థ వాటాల విక్రయ ప్రక్రియకు మరిన్ని అడ్డంకులు ఎదురయ్యేట్లు కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. -
మైండ్ ట్రీ లాభాలకు కరెన్సీ, వీసాల సెగ
క్యూ1 స్వల్ప క్షీణత; రూ.122 కోట్లు న్యూఢిల్లీ: మధ్య స్థాయి ఐటీ కంపెనీ మైండ్‌ట్రీ లాభం జూన్ త్రైమాసికంలో స్వల్పంగా క్షీణించింది. రూ.121.7కోట్ల లాభాన్ని ఆర్జించింది. కరెన్సీ విలువల్లో అస్థిరతలు, వీసా వ్యయాలు అధికం కావడం, అనుబంధ సంస్థల నుంచి ఎదురైన ప్రతికూలతలు ఇందుకు కారణంగా కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే రూ.1,347 కోట్ల నుంచి రూ.1,355 కోట్లకు పెరిగింది. కంపెనీ సీఈవో, ఎండీ రోస్టోవ్ రావణన్ మాట్లాడుతూ.. తమ సబ్సిడరీలైన మ్యాగ్నెట్, బ్లూఫిన్ ప్రభావం లాభాలపై పడిందని, ఓ క్లయింట్ ప్రాజెక్టు నిలిచిపోయినట్టు చెప్పారు. తాము కొనుగోలు చేసిన ఈ సబ్సిడరీల నుంచి కొంత కాలం పాటు ప్రతికూలతలు ఉండొచ్చన్నారు. ఈ కారణంగానే ఈ ఏడాది వృద్ధి అంచనాలను సవరించాల్సి వస్తుందన్నారు. వేతన పెంపు ప్రభావం మార్జిన్లపై 1.5 – 2 శాతం మేర ఉంటుందని తెలిపారు. -
మైండ్‌ట్రీ రూ.270 కోట్ల బైబ్యాక్
న్యూఢిల్లీ: ఐటీ సంస్థ మైండ్‌ట్రీ డైరెక్టర్ల బోర్డు రూ. 270 కోట్ల బైబ్యాక్ ప్రతిపాదనకు బుధవారం ఆమోదం తెలిపింది. షేరుకు రూ. 625 ధరను మించకుండా 43.2 లక్షల షేర్లను (కంపెనీ ఈక్విటీలో 2.5 శాతం) బైబ్యాక్ చేయనున్నట్లు కంపెనీ ఎక్సే్ఛంజీలకు తెలిపింది. టెండర్ ఆఫర్ మార్గంలో ఈ బైబ్యాక్‌ను మైండ్‌ట్రీ అమలుచేయనుంది. ఐటీ దిగ్గజం టీసీఎస్ ఇటీవలే రూ. 16,000 కోట్ల బైబ్యాక్ ఆఫర్‌ను పూర్తిచేసింది. ఇతర ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్‌లు రూ. 13,000 కోట్లు, 3.4 బిలియన్ డాలర్ల చొప్పున బైబ్యాక్ లేదా డివిడెండ్ల రూపంలో చెల్లించనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. మరో ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ బోర్డు కూడా రూ. 3,500 కోట్ల బైబ్యాక్ ప్రతిపాదనకు ఓకే చెప్పింది. విప్రో కూడా ఇదే బాటలో ఉంది. -
వీసా ట్రెండ్ మార్చేస్తున్న టెక్ దిగ్గజాలు
దేశీయ టెక్నాలజీ అవుట్సోర్సింగ్ దిగ్గజాలు తమ వ్యూహాలను మార్చేస్తున్నాయి. వైట్ హౌస్ తీసుకురాబోతున్న కఠినతరమైన నిబంధనలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. అమెరికాలో కొత్త పాలసీలు అమలయ్యే లోపలే తమ యూఎస్ వర్క్ వీసాల్లో మార్పులు తీసుకురావాలని కంపెనీలు నిర్ణయించాయి. తక్కువ అనుభవమున్న ఉద్యోగులకు హెచ్-1బీ వీసాలు దరఖాస్తు చేయకూడదని తాము నిర్ణయించినట్టు ఐటీ సర్వీసు కంపెనీ మైండ్‌ట్రీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్రిష్ణ కుమార్ నటరాజన్ పేర్కొన్నారు. మొత్తంగా కూడా వీసా దరఖాస్తులను తగ్గించుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు. మొత్తంగా ఐటీ ఇంటస్ట్రీలోనూ ఇదే ధోరణిలో కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికే ఇన్ఫోసిస్ నాలుగేళ్ల కంటే తక్కువ అనుభమున్న ఉద్యోగులకు వీసాలు దరఖాస్తు చేయకూడదని నిర్ణయించిందని పలు రిపోర్టులు వచ్చాయి. ఇదే బాటలో మిగతా కంపెనీలు కూడా నడుస్తున్నట్టు తెలుస్తోంది. దేశీయ ఐటీ ఇండస్ట్రికి అమెరికా ఎంతో కీలకమైన మార్కెట్. హెచ్-1బీ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించి, స్థానిక ఉద్యోగులను ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటున్నామని నటరాజన్ చెప్పారు. ఐటీ కంపెనీలు గతేడాది ఇండియాలో లక్షమందికి జాబ్ ఆఫర్స్ ఇస్తే, ఈ ఏడాది కేవలం 60వేల మందినే తీసుకున్నాయి. ఇక్కడ క్యాంపస్ రిక్రూట్ తగ్గించి, అమెరికాలో లోకల్ టాలెంట్ ను నియమించుకుంటున్నట్టు ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రోలు కూడా అమెరికాలోనే ఉద్యోగాల నియామకాలను పెంచినట్టు తెలిసింది. ఈ కంపెనీలు గతేడాది వరకు ఇండియన్ గ్రాడ్యుయేట్లనే ఎక్కువగా ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు తీసుకునేవి. ఈ ఏడాది ఈ ట్రెండ్ ను మార్చేశాయి. -
మైండ్ ట్రీ ఆదాయం 44 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: మధ్య తరహా ఐటీ కంపెనీ మైండ్ ట్రీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 21 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ4లో రూ.129 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2015-16) క్యూ4లో రూ.156 కోట్లకు పెరిగిందని మైండ్ ట్రీ పేర్కొంది. ఆదాయం(కన్సాలిడేటెడ్) రూ.918 కోట్ల నుంచి 44 శాతం వృద్ధితో రూ.1,324 కోట్లకు ఎగిసిందని కంపెనీ సీఈఓ, ఎండీ రోస్టో రావణన్ తెలిపారు. డాలర్ టర్మ్‌ల్లో నికర లాభం 11 శాతం వృద్ధితో 2.3 కోట్ల డాలర్లకు, ఆదాయం 32 శాతం వృద్ధితో 20 కోట్ల డాలర్లకు పెరిగాయని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో కొత్తగా 1,020 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నామని, దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 16,623కు పెరిగిందని వివరించారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి వస్తే, నికర లాభం 13% వృద్ధితో రూ.603 కోట్లకు, ఆదాయం 32 శాతం వృద్ధితో రూ.4,690 కోట్లకు పెరిగినట్లు వివరించారు.