వీసా ట్రెండ్ మార్చేస్తున్న టెక్ దిగ్గజాలు
వీసా ట్రెండ్ మార్చేస్తున్న టెక్ దిగ్గజాలు
Published Tue, Mar 21 2017 1:59 PM | Last Updated on Wed, Sep 26 2018 6:44 PM
దేశీయ టెక్నాలజీ అవుట్సోర్సింగ్ దిగ్గజాలు తమ వ్యూహాలను మార్చేస్తున్నాయి. వైట్ హౌస్ తీసుకురాబోతున్న కఠినతరమైన నిబంధనలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. అమెరికాలో కొత్త పాలసీలు అమలయ్యే లోపలే తమ యూఎస్ వర్క్ వీసాల్లో మార్పులు తీసుకురావాలని కంపెనీలు నిర్ణయించాయి. తక్కువ అనుభవమున్న ఉద్యోగులకు హెచ్-1బీ వీసాలు దరఖాస్తు చేయకూడదని తాము నిర్ణయించినట్టు ఐటీ సర్వీసు కంపెనీ మైండ్ట్రీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్రిష్ణ కుమార్ నటరాజన్ పేర్కొన్నారు. మొత్తంగా కూడా వీసా దరఖాస్తులను తగ్గించుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు. మొత్తంగా ఐటీ ఇంటస్ట్రీలోనూ ఇదే ధోరణిలో కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికే ఇన్ఫోసిస్ నాలుగేళ్ల కంటే తక్కువ అనుభమున్న ఉద్యోగులకు వీసాలు దరఖాస్తు చేయకూడదని నిర్ణయించిందని పలు రిపోర్టులు వచ్చాయి. ఇదే బాటలో మిగతా కంపెనీలు కూడా నడుస్తున్నట్టు తెలుస్తోంది.
దేశీయ ఐటీ ఇండస్ట్రికి అమెరికా ఎంతో కీలకమైన మార్కెట్. హెచ్-1బీ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించి, స్థానిక ఉద్యోగులను ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటున్నామని నటరాజన్ చెప్పారు. ఐటీ కంపెనీలు గతేడాది ఇండియాలో లక్షమందికి జాబ్ ఆఫర్స్ ఇస్తే, ఈ ఏడాది కేవలం 60వేల మందినే తీసుకున్నాయి. ఇక్కడ క్యాంపస్ రిక్రూట్ తగ్గించి, అమెరికాలో లోకల్ టాలెంట్ ను నియమించుకుంటున్నట్టు ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రోలు కూడా అమెరికాలోనే ఉద్యోగాల నియామకాలను పెంచినట్టు తెలిసింది. ఈ కంపెనీలు గతేడాది వరకు ఇండియన్ గ్రాడ్యుయేట్లనే ఎక్కువగా ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు తీసుకునేవి. ఈ ఏడాది ఈ ట్రెండ్ ను మార్చేశాయి.
Advertisement