ఐటీ సంస్థ మైండ్‌ట్రీ కోసం ఇటు వ్యవస్థాపకులు, అటు దిగ్గజ సంస్థ ఎల్‌అండ్‌టీ మధ్య పోరు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. కంపెనీపై పట్టు కోల్పోకుండా చూసుకునేందుకు ఇటు వ్యవస్థాపకులు ప్రయత్నిస్తుండగా.. టేకోవర్ చేసేందుకు అటు ఎల్‌అండ్‌టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మెజారిటీ వాటాదారు కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థకి చెందిన 20.3 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఓపెన్ ఆఫర్ కూడా ప్రకటిస్తున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కూడా తెలియజేసింది. టేకోవర్ తర్వాత కూడా మైండ్‌ట్రీ .. లిస్టెడ్ కంపెనీగానే కొనసాగుతుందని ఎల్‌అండ్‌టీ సీఈవో ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు, కంపెనీ చేజారిపోకుండా కాపాడుకునేందుకు మైండ్‌ట్రీ వ్యవస్థాపకుల్లో ఒకరైన సుబ్రతో బాగ్చీ.. తాజాగా (మార్చి 17న) ఒడిశా స్కిల్ డెవలప్‌మెంట్ అథారిటీ పదవికి రాజీనామా చేసి వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. ’మైండ్‌ట్రీని బలవంతంగా టేకోవర్ చేసే ముప్పు ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వ పదవికి రాజీనామా చేసి, కంపెనీని కాపాడుకునేందుకు వెళ్లక తప్పడం లేదు. చెట్టును (ట్రీ) నరికేసి ఆ స్థానంలో షాపింగ్ మాల్ కట్టేందుకు బుల్‌డోజర్లు, రంపాలతో వచ్చిన వాళ్ల నుంచి కంపెనీని కాపాడుకోవాల్సి ఉంది’ అంటూ ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఒకవేళ మైండ్‌ట్రీని గానీ ఎల్‌అండ్‌టీ చేజిక్కించుకోగలిగిందంటే.. దేశీ ఐటీ రంగంలో ఇది తొలి హోస్టైల్ టేకోవర్ కానుంది.
ఎల్‌అండ్‌టీ ఆఫర్ ..
మైండ్‌ట్రీలో పెద్ద వాటాదారైన సిద్ధార్థ నుంచి వాటాల కొనుగోలు కోసం ఎల్‌అండ్‌టీ షేరు ఒక్కింటికి రూ. 980 చొప్పున దాదాపు రూ. 3,269 కోట్లు వెచ్చిస్తోంది. అలాగే ఓపెన్ మార్కెట్ నుంచి ఇంకో 15 శాతం కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ. 2,434 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. మరోవైపు, షేరు ఒక్కింటికి రూ. 980 చొప్పున రేటుతో మరో 31 శాతం వాటాల కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఇందుకోసం దాదాపు రూ. 5,027 కోట్లు వెచ్చించాల్సి రానుంది. మొత్తం మీద మూడంచెల ఈ డీల్‌తో మైండ్‌ట్రీలో ఎల్‌అండ్‌టీకి 66.3 శాతం దాకా వాటాలు లభించే అవకాశం ఉంది. ఇందుకోసం మొత్తం రూ. 10,730 కోట్ల దాకా వెచ్చించే అవకాశం ఉంది. ఈ ఆఫర్‌కు యాక్సిస్ క్యాపిటల్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా సంస్థలు మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. మరోవైపు, టేకోవర్ యత్నాలను ఎదుర్కొనేందుకు వ్యవస్థాపకులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సిద్ధార్థ నుంచి వాటాలను బైబ్యాక్ చేయడంపైనా దృష్టి పెడుతున్నారు. ఇందుకోసం గత రెండు నెలలుగా కేకేఆర్, బేరింగ్ ఏషియా, క్రిస్‌క్యాపిటల్ తదితర ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నారు. అయితే, ఇవి ముందుకు సాగుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇందుకు మూడు ప్రధాన కారణాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. కంపెనీ యాజమాన్య అధికారాన్ని ఎక్కువగా వదులుకునేందుకు వ్యవస్థాపకులు సిద్ధంగా లేకపోవడం, ఎల్‌అండ్‌టీ ఇచ్చే ఆఫర్‌కి దీటుగా చాలా మటుకు ఇన్వెస్టర్లు నిధులు వెచ్చించే అవకాశాలు లేకపోవడం, ఎల్‌అండ్‌టీతో పోరాటమంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం ఇందుకు కారణాలుగా తెలుస్తోంది.
టేకోవర్‌కు బీజం..
1999లో సుబ్రతో బాగ్చీ, అశోక్ సూతా, నమకల్ పార్థసారథి, కృష్ణకుమార్ నటరాజన్, స్కాట్ స్టేపుల్స్ తదితరులు 10 మంది కలిసి మైండ్‌ట్రీ కన్సల్టింగ్ సంస్థను ఏర్పాటు చేశారు. 2000లో వీజీ సిద్ధార్థ నుంచి తొలి విడతగా కొంత మేర పెట్టుబడులు సమీకరించారు. 2008లో మైండ్‌ట్రీ కన్సల్టింగ్ పేరు మైండ్‌ట్రీగా మారింది. 2011లో వ్యవస్థాపక చైర్మన్ అశోక్ సూతా రాజీనామా చేసినప్పుడు ఆయన వాటాలను కూడా కొనుగోలు చేసిన సిద్ధార్థ.. అతి పెద్ద షేర్‌హోల్డర్‌గా మారారు. 2018లో మైండ్‌ట్రీ డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్న సిద్ధార్థ.. తన వాటాలను విక్రయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఐటీæ కార్యకలాపాల విభాగం (ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ –ఎల్‌టీఐ) కూడా ఉన్న ఎల్‌అండ్‌టీ అప్పుడే ఇతర సంస్థల కొనుగోలు ప్రయత్నాల్లో ఉండటంతో.. దీనిపైనా దృష్టి సారించింది. ఎల్‌అండ్‌టీ చైర్మన్ ఏఎం నాయక్‌తో సిద్ధార్థ చర్చలు కూడా జరిపారు. మిగతా వ్యవస్థాపకులను కూడా ఒప్పించగలిగితే.. మరింత అధిక రేటు ఇస్తామంటూ నాయక్ ఆఫర్ ఇవ్వడంతో.. సిద్ధార్థ ఆ ప్రయత్నాలూ చేశారు. కానీ, వ్యవస్థాపకులు ఇందుకు ఇష్టపడటం లేదు. రెండు సంస్థల నిర్వహణ తీరు, పని సంస్కృతిలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని వారు భావిస్తుండటమే ఇందుకు కారణం. ఇవే కారణాలతో సంస్థాగత ఇన్వెస్టర్లు, క్లయింట్లు, ఉద్యోగులు ఈ డీల్‌పై విముఖంగా ఉన్నారంటూ ఇటీవలే ఎల్‌అండ్‌టీ బోర్డుకు కూడా వారు లేఖ రాసినట్లు సమాచారం. సోమవారం మైండ్‌ట్రీ షేరు బీఎస్‌ఈలో 1.74 శాతం పెరిగి రూ. 962.50 వద్ద క్లోజయ్యింది.
రెండూ కలిస్తే..
దాదాపు 1 బిలియన్ డాలర్ల ఆదాయాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. క్లౌడ్, బిగ్ డేటా వంటి కొంగొత్త టెక్నాలజీల్లో నైపుణ్యాలు మైండ్‌ట్రీకి ప్లస్‌పాయింట్స్‌గా ఉండటంతో .. ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ (ఎల్‌టీఐ) దీనిపై ఆసక్తిగా కనపరుస్తోంది. ఎల్‌టీఐ నికర విలువ దాదాపు రూ. 4,387 కోట్లుగా ఉండగా.. 2018 డిసెంబర్ ఆఖరు నాటికి సంస్థ దగ్గర సుమారు రూ. 2,032 కోట్ల మేర నగదు, లిక్విడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి. మైండ్‌ట్రీలో 51 శాతం వాటాలు దక్కించుకున్న పక్షంలో.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే ఎల్‌టీఐకి అదనంగా మైండ్‌ట్రీ నుంచి రూ. 460 కోట్ల దాకా లాభాలు దఖలుపడతాయి. రెండూ కలిశాయంటే.. ఆదాయాలు 1.7 బిలియన్ డాలర్ల దాకా ఉంటాయని అంచనా. తద్వారా దేశీ ఐటీలో ఆరు పెద్ద సంస్థ ఏర్పాటైనట్లవుతుంది. రెండింటికీ అమెరికా, యూరప్‌లే ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయి. టెక్నాలజీ, మీడియా, సర్వీసెస్ విభాగాల్లో మైండ్‌ట్రీ పటిష్టంగా ఉండటం.. ఎల్‌టీఐకి లాభించనుంది. మైండ్‌ట్రీ మొత్తం వ్యాపారంలో డిజిటల్ వాటా 49.5 శాతం కాగా ఎల్‌టీఐకి 37 శాతమే ఉంది. అంతేకాకుండా ఉద్యోగిపై సగటు ఆదాయాన్ని చూస్తే ఎల్‌టీఐ కన్నా మైండ్‌ట్రీదే పైచేయిగా ఉంది. మైండ్‌ట్రీకి ప్రస్తుతం 19,908 మంది ఉద్యోగులు, 340 మంది క్లయింట్స్ ఉన్నారు.
వ్యవస్థాపకులకు 13 శాతం వాటాలు...
ప్రస్తుతం ప్రమోటర్ల గ్రూప్‌లో భాగమైన బాగ్చీ, పార్థసారథి, నటరాజన్, మైండ్‌ట్రీ సీఈవో రోస్టో రవనన్ తదితరులకు 13 శాతం వాటాలు ఉన్నాయి. నటరాజన్‌కు 3.72 శాతం, పార్థసారథికి 1.43 శాతం, రవనన్‌కు 0.71 శాతం, బాగ్చీకి 3.1 శాతం వాటాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment