న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవల మధ్యస్థాయి కంపెనీ ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 17 శాతం వృద్ధితో దాదాపు రూ. 638 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2021) ఇదే కాలంలో రూ. 545 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 32 శాతం వరకూ ఎగసి రూ. 4,302 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 3,269 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కంపెనీ నికర లాభం 19 శాతం పుంజుకుని రూ.2,297 కోట్లయ్యింది. 2020–21లో రూ. 1,936 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 27 శాతం అధికమై రూ. 15,669 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది కేవలం రూ. 12,370 కోట్ల టర్నోవర్ నమోదైంది.
విలీనం ఊహాజనితం
గ్రూప్ కంపెనీ మైండ్‌ట్రీతో విలీనంపై ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ యాజమాన్యం ఊహాజనితమంటూ స్పందించింది. ఊహాగానాలపై వ్యాఖ్యానించబోమంటూ క్యూ4 ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ సీఈవో, ఎండీ సంజయ్ జలోనా స్పష్టం చేశారు. మైండ్‌ట్రీతో విలీనంపై ఎలాంటి వివరాలూ అందుబాటులో లేవని, మీడియా అంచనాలపై వ్యాఖ్యానించబోమని ఎక్సే్ఛంజీలకు తెలిపారు.
6,000 మందికి ఉద్యోగాలు...
వాటాదారులకు షేరుకి రూ. 30 చొప్పున డివిడెండును ఎల్‌అండ్‌టీ ఇన్ఫో ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో 6,000 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలివ్వనున్నట్లు పేర్కొంది. గతేడాది 6,200 మందికి ఉపాధి కల్పించినట్లు ప్రస్తావించింది. ప్రస్తుతం కంపెనీ సిబ్బంది సంఖ్య 46,648కు చేరినట్లు వెల్లడించింది. ఎట్రిషన్ రేటు 24 శాతంగా నమోదైంది.
ఫలితాల నేపథ్యంలో ఎల్‌అండ్‌టీ ఇన్ఫో షేరు 8.3% పతనమై రూ. 5,385 వద్ద ముగిసింది.
చదవండి: ఎల్‌అండ్‌టీ ఇన్ఫో, మైండ్‌ట్రీ విలీనం!
అదరగొట్టిన ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్..మైండ్‌ట్రీతో విలీనంపై కీలక వ్యాఖ్యలు..!
Published Wed, Apr 20 2022 8:17 AM | Last Updated on Wed, Apr 20 2022 8:19 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment