మైండ్ ట్రీ ఆదాయం 44 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: మధ్య తరహా ఐటీ కంపెనీ మైండ్ ట్రీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 21 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ4లో రూ.129 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2015-16) క్యూ4లో రూ.156 కోట్లకు పెరిగిందని మైండ్ ట్రీ పేర్కొంది. ఆదాయం(కన్సాలిడేటెడ్) రూ.918 కోట్ల నుంచి 44 శాతం వృద్ధితో రూ.1,324 కోట్లకు ఎగిసిందని కంపెనీ సీఈఓ, ఎండీ రోస్టో రావణన్ తెలిపారు. డాలర్ టర్మ్‌ల్లో నికర లాభం 11 శాతం వృద్ధితో 2.3 కోట్ల డాలర్లకు, ఆదాయం 32 శాతం వృద్ధితో 20 కోట్ల డాలర్లకు పెరిగాయని పేర్కొన్నారు.
గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో కొత్తగా 1,020 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నామని, దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 16,623కు పెరిగిందని వివరించారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి వస్తే, నికర లాభం 13% వృద్ధితో రూ.603 కోట్లకు, ఆదాయం 32 శాతం వృద్ధితో రూ.4,690 కోట్లకు పెరిగినట్లు వివరించారు.