మైండ్ ట్రీ లాభాలకు కరెన్సీ, వీసాల సెగ
క్యూ1 స్వల్ప క్షీణత; రూ.122 కోట్లు
న్యూఢిల్లీ: మధ్య స్థాయి ఐటీ కంపెనీ మైండ్‌ట్రీ లాభం జూన్ త్రైమాసికంలో స్వల్పంగా క్షీణించింది. రూ.121.7కోట్ల లాభాన్ని ఆర్జించింది. కరెన్సీ విలువల్లో అస్థిరతలు, వీసా వ్యయాలు అధికం కావడం, అనుబంధ సంస్థల నుంచి ఎదురైన ప్రతికూలతలు ఇందుకు కారణంగా కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే రూ.1,347 కోట్ల నుంచి రూ.1,355 కోట్లకు పెరిగింది. కంపెనీ సీఈవో, ఎండీ రోస్టోవ్ రావణన్ మాట్లాడుతూ..
తమ సబ్సిడరీలైన మ్యాగ్నెట్, బ్లూఫిన్ ప్రభావం లాభాలపై పడిందని, ఓ క్లయింట్ ప్రాజెక్టు నిలిచిపోయినట్టు చెప్పారు. తాము కొనుగోలు చేసిన ఈ సబ్సిడరీల నుంచి కొంత కాలం పాటు ప్రతికూలతలు ఉండొచ్చన్నారు. ఈ కారణంగానే ఈ ఏడాది వృద్ధి అంచనాలను సవరించాల్సి వస్తుందన్నారు. వేతన పెంపు ప్రభావం మార్జిన్లపై 1.5 – 2 శాతం మేర ఉంటుందని తెలిపారు.