
Coffee Day Enterprises ఆర్ధిక సవాళ్లు ఎదుర్కొంటున్న కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ ఈ జులై–సెపె్టంబర్ త్రైమాసికంలో దాదాపు రూ. 434 కోట్ల రుణ(అసలు, వడ్డీ) చెల్లింపుల్లో విఫలమైనట్లు వెల్లడించింది. అంతకుముందు ఏప్రిల్–జూన్‌లోనూ రూ. 440 కోట్ల చెల్లింపుల్లో వైఫల్యం చెందడం గమనార్హం! తాజా త్రైమాసికంలో స్వల్ప, దీర్ఘకాలిక రుణాల చెల్లింపులను పూర్తిచేయలేకపోయినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్చేంజీలకు వెల్లడించింది. వీటిలో క్యాష్ క్రెడిట్ తదితర రుణాలు రూ. 189.14 కోట్లుకాగా.. వీటిలో అసలు విలువ రూ. 183.36 కోట్లుగా కంపెనీ తెలియజేసింది.
ఇక చెల్లించవలసిన అన్‌లిస్టెడ్ రుణ సెక్యూరిటీల(ఎన్‌సీడీలు, ఎన్‌సీఆర్‌పీఎస్‌లు) విలువ రూ. 244.77 కోట్లలో అసలు రూ. 200 కోట్లుకాగా.. వడ్డీ రూ. 44.77 కోట్లుగా వివరించింది. డిఫాల్ట్ నేపథ్యంలో రుణదాతలు రుణ రికవరీ నోటీసుల జారీతోపాటు.. న్యాయ వివాద చర్యలకు దిగినట్లు తెలియజేసింది. రికవరీ నోటీసులు, న్యాయ వివాదాలు, రుణదాతలతో వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పెండింగ్‌లోఉన్న కారణంగా 2021 ఏప్రిల్ నుంచి వడ్డీ మదింపు చేయలేదని వెల్లడించింది.