న్యూఢిల్లీ: ఈఎస్‌జీ (ఎన్విరాన్‌మెంటల్, సోషల్, గవర్నెన్స్) ఫండ్స్ జూన్ త్రైమాసికంలో రూ.520 కోట్ల పెట్టుబడులను కోల్పోయాయి. అంతకుముందు మార్చి త్రైమాసికంలో ఈఎస్‌జీ ఫండ్స్ నుంచి ఉపసంహరించుకున్న రూ.470 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే పెరగడం గమనార్హం. ‘‘కొత్త ఈఎస్‌జీ పథకాల ఆవిష్కరణతో ఏఎంసీలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. కానీ, స్థిరంగా ఈఎస్‌జీ పథకాలు పెట్టుబడులను ఆకర్షించే వాతావరణం ఇంకా ఏర్పడాల్సి ఉంది’’అని మార్నింగ్ స్టార్ నివేదిక తెలిపింది.
ఇక ఏడాది జనవరి నుంచి చూస్తే ఇప్పటి వరకు ఈఎస్‌జీ పథకాల నుంచి నికరంగా రూ.1,060 కోట్లు బయటకు వెళ్లాయి. గతేడాది ఇదే కాలంలో పెట్టుబడుల ఉపసంహరణ రూ.1,020 కోట్లుగా ఉంది. కానీ, ఈ ఏడాది ఇప్పటి వరకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నికరంగా రూ.1.83 లక్షల కోట్లను ఆకర్షించడంతో పోలిస్తే, ఈఎస్‌జీ పథకాల్లో విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది.
ఇంకా ఆరంభ దశలోనే..
‘‘సస్టెయినబుల్ ఫండ్ (ఈఎస్‌జీ ఫండ్స్) మార్కెట్ భారత్‌లో ఇంకా ఆరంభ దశలోనే ఉంది. కరోనా తర్వాత ఇన్వెస్టర్లలో ఆసక్తికి అనుగుణంగా ఎన్నో ఈఎస్‌జీ పథకాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత నుంచి గడిచిన 24 నెలల్లో కొత్త పథకాలు ఊసే లేదు’’అని మార్నింగ్ స్టార్ నివేదిక తెలిపింది.
దీంతో భారత్‌లోని ఈఎస్‌జీ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు రెండేళ్లుగా రూ.10,000–12,000 కోట్ల స్థాయిలోనే ఉండిపోయినట్టు పేర్కొంది. జూన్ చివరికి ఇవి రూ.11,040 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. మొత్తం మీద ఈఎస్‌జీ ఫండ్స్ విభాగంలో 11 పథకాలే అందుబాటులో ఉన్నాయి. ఇందులోనూ టాప్–5 పథకాల్లోనే 87 శాతం నిర్వహణ ఆస్తులు ఉన్నట్టు మార్నింగ్ స్టార్ నివేదిక తెలిపింది. ఈ 11 పథకాల్లోనూ 8 ఫండ్స్ యాక్టివ్ నిర్వహణలో ఉన్నవి.
Comments
Please login to add a commentAdd a comment