ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరోసారి పటిష్ట ఫలితాలు సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో నికర లాభం 5 శాతం బలపడి రూ. 11,909 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలం(క్యూ2)లో రూ. 11,342 కోట్లు ఆర్జించింది.
అయితే ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్)లో ఆర్జించిన రూ. 12,040 కోట్లుతో పోలిస్తే లాభాలు నామమాత్రంగా తగ్గాయి. పన్నుకుముందు లాభం రూ. 15,330 కోట్ల నుంచి రూ. 16,032 కోట్లకు మెరుగుపడింది. ఇక మొత్తం ఆదాయం 7% పుంజుకుని రూ. 64,988 కోట్లకు చేరింది. గతేడాది క్యూ2లో రూ. 60,698 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ ఏడాది క్యూ1లో రూ. 63,575 కోట్ల అందుకున్న సంగతి తెలిసిందే.
ఇతర విశేషాలు
» ఆర్డర్ బుక్ విలువ (టీసీవీ) 8.6 బి. డాలర్లకు చేరింది. దీనిలో ఉత్తర అమెరికా నుంచి 4.2 బిలియన్ డాలర్లు లభించింది.
» మొత్తం సిబ్బంది సంఖ్య 6,12,724కు చేరింది.
» షేరుకి రూ. 10 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.
» 2025–26కు క్యాంపస్ హైరింగ్ షురూ
అనిశ్చితుల ఎఫెక్ట్
గత కొన్ని త్రైమాసికాలుగా కనిపిస్తున్న అప్రమత్తత తాజా క్వార్టర్‌లోనూ కొనసాగింది. ప్రపంచ భౌగోళిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లోనూ మా అతిపెద్ద విభాగం బీఎఫ్‌ఎస్‌ఐ రికవరీ బాటలో సాగుతోంది. వృద్ధి మార్కెట్లలో పటిష్ట పనితీరు చూపాం. క్లయింట్లు, ఉద్యోగులు, వాటాదారుల విలువ పెంపుపై ప్రత్యేక దృష్టిని కొనసాగిస్తున్నాం.
– కె.కృతివాసన్, సీఈవో, ఎండీ
Comments
Please login to add a commentAdd a comment