Information technology companies
-
ఫ్రెషర్లకు గుడ్ న్యూస్: రానున్న ఆరు నెలల్లో భారీ అవకాశాలు
న్యూఢిల్లీ: ఫ్రెషర్లకు ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో తగినన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య ఫ్రెషర్లను నియమించుకోవాలని అనుకుంటున్నట్టు ఎక్కువ కంపెనీలు సర్వేలో వెల్లడించినట్టు టీమ్‌లీజ్ ఎడ్టెక్ సంస్థ ఓ నివేదిక రూపంలో తెలిపింది. తొలి ఆరు నెలలకు సంబంధించి కెరీర్ అవుట్‌లుక్‌పై నివేదిక విడుదల చేసింది. బలహీనమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, భారతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలు వచ్చే ఆరు నెలల్లో ఇతర రంగాల కంటే ఎక్కువ మంది ఫ్రెషర్లను నియమించుకుంటాయని స్టాఫింగ్ సంస్థ టీమ్‌లీజ్ గురువారం ప్రచురించిన కొత్త నివేదిక తెలిపింది. భారత కంపెనీల ఫ్రెషర్ల నియామకాల ఉద్దేశ్యం 3 శాతం పెరిగి 62 శాతానికి చేరింది. 2022 జూలై-డిసెంబర్ కాలానికి ఇది 59 శాతంగా ఉంది. టీమ్‌లీజ్ ఎడ్టెక్ 874 భారీ, మధ్య, చిన్న తరహా కంపెనీల అభిప్రాయాలను 2022 అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో సమీకరించి ఈ వివరాలను వెల్లడించింది. ప్రెషర్లను నియమించుకోనున్నట్టు ఐటీ కంపెనీల్లో అత్యధికంగా 67 శాతం చెప్పాయి. ఈ కామర్స్ అండ్ టెక్నాలజీ స్టార్టప్‌లలో ఇది 52 శాతంగా ఉంటే, టెలికమ్యూనికేషన్స్‌లో 51 శాతంగా ఉంది. ఫ్రెషర్ల నియామకాల పరంగా 75 శాతంతో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. ముంబై 56 శాతం, ఢిల్లీ 47 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. వీటికి డిమాండ్... ‘‘అంతర్జాతీయంగా నియామకాల పట్ల స్తబ్ధత నెలకొన్నప్పటికీ.. భారత కంపెనీల్లో అధిక శాతం ఫ్రెషర్లను నియమించుకోనున్నట్టు చెప్పాయి. కొన్ని దీర్ఘకాల మానవ వనరులను సమకూర్చుకునే పనిలో ఉన్నాయి. కొన్ని కంపెనీలు ప్రస్తుతం భారంగా మారిన మానవ వనరుల స్థానంలో తాజా శిక్షణ పొందిన నైపుణ్యాలను (తక్కువ వేతనాలపై) సర్దుబాటు చేసుకునే పనిలో ఉన్నాయి’’అని టీమ్‌లీజ్ ఎడ్టెక్ వ్యవస్థాపకుడు, సీఈవో శంతనురూజ్ తెలిపారు. క్లౌడ్ డెవలపర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అసోసియేట్, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్, మార్కెటింగ్ అనలిస్ట్, సోషల్ మీడియా స్పెషలిస్ట్, కంటెంట్ రైటర్, కాంపెయిన్ అసోసియేట్, మైక్రోబయాలజిస్ట్, బయోమెడికల్ ఇంజనీర్ పోస్ట్‌లకు ఫ్రెషర్ల నియామకాల్లో డిమాండ్ నెలకొంది. ‘‘నియామకాల పట్ల ఆశావహంగా ఉన్న రంగాలను గుర్తించి, భవిష్యత్తులో డిమాండ్ ఉండే నైపుణ్యాల పట్ల ఉద్యోగార్థులు దృష్టి సారించాలి. ప్రస్తుత మార్కెట్ ధోరణలను అర్థం చేసుకుని, సరైన నైపుణ్యాలను నేర్చుకోవడంపై, తమ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే వాటిపై దృష్టి పెట్టాలి’’అని టీమ్‌లీజ్ ఎడ్యుటెక్ ప్రెసిడెంట్ నీతి శర్మ సూచించారు. కార్పొరేట్ ఫైనాన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ప్రాజెక్ట్‌మేనేజ్‌మెంట్ నైపుణ్యాలకు సైతం డిమాండ్ ఉన్నట్టు టీమ్‌లీజ్ నివేదిక వెల్లడించింది. ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఉంటే జాబ్ నైపుణ్యాల ధ్రువీకరణ సర్టిఫికేషన్ ఉంటే ఉద్యోగాల్లో రాణించొచ్చని 91 శాతం మంది భారత విద్యార్థులు భావిస్తున్నారు. డిగ్రీ తర్వాత ఉద్యోగం సంపాదించేందుకు ఈ సర్టిఫికేషన్ సాయ పడుతుందని 96 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. ఆన్లైన్ లర్నింగ్ ప్లాట్ ఫామ్ ‘కోర్సెరా’ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు తెలిశాయి. ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాలతో పోలిస్తే భారత్‌లో కంపెనీలు ఉద్యోగుల నియామకాల సమయంలో ప్రొఫెషనల్ సర్టిఫికేషకు ఎక్కువ విలువ ఇస్తున్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఉద్యోగార్థుల అర్హతలను పెంచుతుందని భారత్‌లో 92 శాతం కంపెనీలు తెలిపాయి. -
ఐటీజోన్ ఎంత భద్రం..!
480కి పైగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు.. 3.80 లక్షల మందికి పైగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు.. రౌండ్ ది క్లాక్ పని.. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం సైబరాబాద్. ఇక్కడి ఐటీ కంపెనీలు ఎంత సేఫ్..? అంటే అనుమానించక తప్పదు. మెజారిటీ కంపెనీల్లో ఇంకా సెక్యూరిటీ సేవలు సాధారణ పౌరులు నిర్వహిస్తున్నవే కావడంతో అందరి దృష్టి ఈ ప్రాంతం పైకి మళ్లుతోంది. తాజాగా నగరంలో వెలుగు చూసిన ఉగ్రకుట్రలో సైబరాబాద్‌లోనే పలు కంపెనీలు, మాల్స్ ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడం సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లోను ఆందోళన రేగుతోంది. - సాక్షి, సిటీబ్యూరో ♦ మెజారిటీ కంపెనీలకు సాధారణ సెక్యూరిటీయే.. ♦ దాడులు జరిగితే.. నిలువరించే వ్యూహం లేదు ♦ కొన్ని కంపెనీల్లోనే సాయుధ రక్షణ బలగం ♦ మిగతా వాటిలో సీసీ కెమెరాలతో సరి.. ఐటీ జోన్లో ఉన్న మొత్తం కంపెనీల్లో సుమారు 300 కంపెనీలు నామమాత్రం సెక్యూరిటీతో సరిపెడుతున్నాయి. అపరిచితులు లోనికి వెళ్లకుండా మాత్రమే చూసే సెక్యూరిటీ గార్డులకు ఆపద సమయంలో వ్యవహరించే తీరు, సాయుధులు దాడులకు పూనుకుంటే వారిని అడ్డుకునే నైపుణ్యం, సామర్థ్యం గాని లేవు. సైబరాబాద్ కమిషనరేట్‌లోని మాదాపూర్ ఐటీ లే అవుట్, నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం, గ,చ్చిబౌలి ఎస్ఈజెడ్లో ఉన్న కంపెనీల్లో విప్రో, డీఎల్ఎఫ్, ఇన్ఫోసిస్‌తో పాటు మరికొన్ని కంపెనీల్లో మాత్రమే సొంత సాయుధ రక్షణ ఉంది. సీసీ కెమెరాల ఏర్పాటుతో సరి ఐటీ జోన్లో లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా నేర పరిశోధనలో పనికివచ్చే సీసీ కెమెరాల ఏర్పాటు అంశానికే పోలీస్ యంత్రాంగం ప్రాధాన్యమిస్తోంది. ప్రతి నెలలో సైబరాబాద్ జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగే ఐటీ జోన్ భద్రత సమావేశంలో ప్రపంచ దేశాల్లో జరుగుతున్న దాడులు, వాటి తీరు, ఒక వేళ దాడులు జరిగితే సెక్యూరిటీ సిబ్బంది, ఉద్యోగులు వ్యవహరించాల్సిన తీరును వివరిస్తున్నారు. అయితే, ఉగ్రవాదుల నుంచి ఐటీ పరిశ్రమలకు తీవ్ర ముంపు పొంచి ఉందని ఇప్పటికే గ్రహించిన పోలీస్ అధికారులు, ఐటీ కంపెనీలు సాయుధ రక్షణ పెట్టుకోవాలని, వారి కోరిక మేరకు ఆయుధ లెసైన్స్‌లు ఇస్తామని ప్రకటించారు. అయినా ఇప్పటి వరకు మెజారిటీ కంపెనీలు సాయుధ రక్షణపై పెద్దగా స్పందించలేదు. ఏవైనా దాడులు జరిగే సమయాల్లో సుశిక్షితులైన పోలీస్ దళాలు వచ్చే వరకైనా, నిలువరించే ప్రయత్నం చేస్తే నష్టం తక్కువగా ఉంటుందని పోలీస్ అధికారులు చెప్పినా ఆ దిశగా ప్రయత్నాలేవీ చేపట్టలేదు. కారిడార్ చూట్టూ నిఘా నేత్రాలు ఇక్కడి ఐటీ కారిడార్ చుట్టూ 24 గంటలూ నిఘా నేత్రాలు పనిచేస్తున్నాయి. కంపెనీల్లో ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక సీసీ కెమెరాలు కాకుండా ఐటీ కారిడార్‌లో ప్రధాన కూడళ్లు, రహదారుల్లో దాదాపు 150 కెమెరాలను అమర్చారు. త్వరలో మరో 50 అమర్చనున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా 80 కిలో మీటర్ల ఫైబర్ కేబుళ్లను ఏర్పాటు చేశారు. నెట్వర్కింగ్ సమర్ధవంతంగా పనిచేసేందుకు దీనిని ఏర్పాటు చేశారు. దీనిని ద్వారా మరో 200 కె మెరాలు ఏర్పాటు చేయనున్నారు. అప్రమత్తంగా ఉన్నాం అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రోజులాగే పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు అనుసంధానించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సిబ్బంది ఎప్పటిలాగే అప్రమత్తంగా ఉంది. ఆయా కంపెనీల్లో భద్రతను మరింత పటిష్టం చేయనున్నాం. - నవీన్ చంద్, సైబరాబాద్ వెస్ట్ కమిషనర్