ఐటీజోన్ ఎంత భద్రం..!
480కి పైగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు..
3.80 లక్షల మందికి పైగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు..
రౌండ్ ది క్లాక్ పని.. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం సైబరాబాద్.
ఇక్కడి ఐటీ కంపెనీలు ఎంత సేఫ్..? అంటే అనుమానించక తప్పదు. మెజారిటీ కంపెనీల్లో ఇంకా సెక్యూరిటీ సేవలు సాధారణ పౌరులు నిర్వహిస్తున్నవే కావడంతో అందరి దృష్టి ఈ ప్రాంతం పైకి మళ్లుతోంది. తాజాగా నగరంలో వెలుగు చూసిన ఉగ్రకుట్రలో సైబరాబాద్‌లోనే పలు కంపెనీలు, మాల్స్ ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడం సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లోను ఆందోళన రేగుతోంది.
- సాక్షి, సిటీబ్యూరో
♦ మెజారిటీ కంపెనీలకు సాధారణ సెక్యూరిటీయే..
♦ దాడులు జరిగితే.. నిలువరించే వ్యూహం లేదు
♦ కొన్ని కంపెనీల్లోనే సాయుధ రక్షణ బలగం
♦ మిగతా వాటిలో సీసీ కెమెరాలతో సరి..
ఐటీ జోన్‌లో ఉన్న మొత్తం కంపెనీల్లో సుమారు 300 కంపెనీలు నామమాత్రం సెక్యూరిటీతో సరిపెడుతున్నాయి. అపరిచితులు లోనికి వెళ్లకుండా మాత్రమే చూసే సెక్యూరిటీ గార్డులకు ఆపద సమయంలో వ్యవహరించే తీరు, సాయుధులు దాడులకు పూనుకుంటే వారిని అడ్డుకునే నైపుణ్యం, సామర్థ్యం గాని లేవు. సైబరాబాద్ కమిషనరేట్‌లోని మాదాపూర్ ఐటీ లే అవుట్, నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం, గ,చ్చిబౌలి ఎస్‌ఈజెడ్‌లో ఉన్న కంపెనీల్లో విప్రో, డీఎల్‌ఎఫ్, ఇన్ఫోసిస్‌తో పాటు మరికొన్ని కంపెనీల్లో మాత్రమే సొంత సాయుధ రక్షణ ఉంది.
సీసీ కెమెరాల ఏర్పాటుతో సరి
ఐటీ జోన్‌లో లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా నేర పరిశోధనలో పనికివచ్చే సీసీ కెమెరాల ఏర్పాటు అంశానికే పోలీస్ యంత్రాంగం ప్రాధాన్యమిస్తోంది. ప్రతి నెలలో సైబరాబాద్ జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగే ఐటీ జోన్ భద్రత సమావేశంలో ప్రపంచ దేశాల్లో జరుగుతున్న దాడులు, వాటి తీరు, ఒక వేళ దాడులు జరిగితే సెక్యూరిటీ సిబ్బంది, ఉద్యోగులు వ్యవహరించాల్సిన తీరును వివరిస్తున్నారు.
అయితే, ఉగ్రవాదుల నుంచి ఐటీ పరిశ్రమలకు తీవ్ర ముంపు పొంచి ఉందని ఇప్పటికే గ్రహించిన పోలీస్ అధికారులు, ఐటీ కంపెనీలు సాయుధ రక్షణ పెట్టుకోవాలని, వారి కోరిక మేరకు ఆయుధ లెసైన్స్‌లు ఇస్తామని ప్రకటించారు. అయినా ఇప్పటి వరకు మెజారిటీ కంపెనీలు సాయుధ రక్షణపై పెద్దగా స్పందించలేదు. ఏవైనా దాడులు జరిగే సమయాల్లో సుశిక్షితులైన పోలీస్ దళాలు వచ్చే వరకైనా, నిలువరించే ప్రయత్నం చేస్తే నష్టం తక్కువగా ఉంటుందని పోలీస్ అధికారులు చెప్పినా ఆ దిశగా ప్రయత్నాలేవీ చేపట్టలేదు.
కారిడార్ చూట్టూ నిఘా నేత్రాలు
ఇక్కడి ఐటీ కారిడార్ చుట్టూ 24 గంటలూ నిఘా నేత్రాలు పనిచేస్తున్నాయి. కంపెనీల్లో ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక సీసీ కెమెరాలు కాకుండా ఐటీ కారిడార్‌లో ప్రధాన కూడళ్లు, రహదారుల్లో దాదాపు 150 కెమెరాలను అమర్చారు. త్వరలో మరో 50 అమర్చనున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా 80 కిలో మీటర్ల ఫైబర్ కేబుళ్లను ఏర్పాటు చేశారు. నెట్‌వర్కింగ్ సమర్ధవంతంగా పనిచేసేందుకు దీనిని ఏర్పాటు చేశారు. దీనిని ద్వారా మరో 200 కె మెరాలు ఏర్పాటు చేయనున్నారు.
అప్రమత్తంగా ఉన్నాం
అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రోజులాగే పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు అనుసంధానించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సిబ్బంది ఎప్పటిలాగే అప్రమత్తంగా ఉంది. ఆయా కంపెనీల్లో భద్రతను మరింత పటిష్టం చేయనున్నాం.
- నవీన్ చంద్, సైబరాబాద్ వెస్ట్ కమిషనర్