it zone
-
హైదరాబాద్‌లో ఎందుకిలా?
సాక్షి, సిటీబ్యూరో: అడుగు జాగా ఖాళీ వదలకుండా నిర్మించిన బహుళ అంతస్తుల భవంతులతో ఐటీజోన్‌గా పేరొందిన మాదాపూర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి. బహుళ అంతస్తుల వాణిజ్య భవనాల నిర్మాణానికి సంబంధించి..ఫ్లోర్‌స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) నిబంధన నగరంలో కాగితాలకే పరిమితమౌతోంది. ఒక ఎకరం స్థలంలో నిర్మించే వాణిజ్య భవనం కేవలం 2.5 లక్షల చదరపు అడుగులకు మించరాదన్నదే ఈ ఎఫ్ఎస్ఐ నిబంధన. కానీ ఐటీ జోన్, ఫైనాన్షియల్ జిల్లా పరిధిలో ఎకరం జాగాలో సుమారు 10–15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన భవంతులే అత్యధికంగా దర్శనమిస్తున్నాయి. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే గ్రేటర్ సిటీలోని ఐటీ జోన్లో ఫ్లోర్‌స్పేస్ ఇండెక్స్ అత్యధికంగా ఉన్నట్లు తాజాగా కుష్మన్ వేక్ఫీల్డ్ అనే సంస్థ చేపట్టిన అధ్యయనంలో స్పష్టమైంది. ఫ్లోర్‌స్పేస్ అధికమైతే కష్టాలివే.. భారీ విస్తీర్ణంలో నిర్మించిన బహుళ వాణిజ్య భవంతుల్లో పనిచేస్తున్న వందలాదిమంది ఉద్యోగులు ఒక్కసారిగా బయటికి రావడంతో కార్లు, ద్విచక్ర వాహనాలు వేలాదిగా ప్రధాన రహదారులను ముంచెత్తుతుండడంతో గ్రిడ్లాక్ అయి ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఖాళీ వదలకుండా లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న భవంతుల కారణంగా సిటీ కాంక్రీట్ మహారణ్యంగా మారుతోంది. వర్షాకాలంలో వర్షపునీరు ఇంకే దారులు లేక వరదనీరు ప్రధాన రహదారులపైకి పోటెత్తుతోంది. వర్షపునీరు ఇంకేందుకు ఖాళీ ప్రదేశాలు లేకపోవడంతో భూగర్భజలమట్టాలు పడిపోతున్నాయి. భారీ భవనాల చుట్టూ గ్రీన్‌బెల్ట్ అవసరమైనంత మేర లేకపోవడం, వాహనాలు వదిలే పొగ, దుమ్ము, ధూళి కాలుష్యం పెరిగి వాయు నాణ్యత తగ్గి సిటీజనులు అనారోగ్యం పాలవుతున్నారు. కాంక్రీట్ భవంతులు, అద్దాల మేడలతో అతినీలలోహిత వికిరణ తీవ్రత పెరుగుతోంది. భూతాపం వాతావరణంలో కలిసే పరిస్థితి లేక అధిక వేడిమితో జనం విలవిల్లాడుతున్నారు. ఇతర మెట్రో నగరాల్లో ఇలా.. దేశరాజధాని ఢిల్లీలో ఎకరం స్థలంలో కేవలం 1.23 లక్షల చదరపు అడుగుల భవనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. అంతకు మించి నిర్మాణాలు చేపడితే ఢిల్లీ ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటోంది. వాణిజ్య రాజధాని ముంబాయి సిటీలో 2.55 లక్షల చదరపు అడుగుల భవనాలకే అనుమతి ఉంది. బెంగళూరులో కేవలం 2.5 లక్షల చదరపు అడుగులు మాత్రమే. చెన్నై సిటీలో 3.25 లక్షల చదరపు అడుగుల భవనాలకే అనుమతి ఉంది. పూణేలో కేవలం 2 లక్షల చదరపు అడుగుల భవనాలకే పర్మిషన్లు ఇస్తున్నారు. గ్రేటర్ సిటీలో ఐటీ, బీపీఓ, కేపీఓ కంపెనీలకు రెడ్‌కార్పెట్ పరిచే ఉద్దేశంతో ప్రభుత్వం ఫ్లోర్‌స్పేస్ ఇండెక్స్ నిబంధనల అమలు చేయడంలేదు. దీంతో ఎకరం జాగాలో ఏకంగా 10–15 లక్షల చదరపు అడుగుల మేర భారీ బహుళ అంతస్తుల భవంతులను నిర్మిస్తున్నట్లు తాజా అధ్యయనంలో స్పష్టమైంది. -
ఐటీ జోన్లో ఆకతాయిల వీరంగం
సాక్షి, సిటీబ్యూరో: సోమవారం అర్ధరాత్రి ఐటీ జోన్లో బైక్‌పై ‘స్వైర విహారం’ చేసిన ఇద్దరు యువకులు వరుస దాడులకు పాల్పడ్డారు. ఓ హోటల్ సిబ్బందిపై చేయి చేసుకోవడంతో పాటు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మరో రెండు ప్రాంతాల్లో నలుగురిపై దాడి చేసి గాయపరిచారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న మాదాపూర్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..సోమవారం రాత్రి దుర్గం చెరువు సమీపంలోని ‘సంప్రదాయ రుచులు’ రెస్టారెంట్‌ను మూసివేసిన అనంతరం సిబ్బంది రెస్టారెంట్‌ను శుభ్రం చేసే పనిలో ఉన్నారు. 11.40 గంటల ప్రాంతంలో మాదాపూర్ ఠాణా వైపు నుంచి పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు రెస్టారెంట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. లోపలకు దూసుకువచ్చిన వారు ఫర్నిచర్, కంప్యూటర్ మానిటర్‌ను ధ్వంసం చేయడంతో పాటు సిబ్బందిపై దాడి చేశారు. రెస్టారెంట్ బయట ఉన్న ఓ వాహనాన్ని కిందకు తోశారు. దీనిపై సమాచారం అందడంతో రెస్టారెంట్ యజమాని ఈశ్వర్ మాదాపూర్ ఠాణాకు వెళ్లి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన గస్తీ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నాయి. ఈ లోగా ముందుకు వెళ్లిన ఆ ఇద్దరూ ఇనార్బిట్ మాల్ సమీపంలో భార్యభర్తలపై దాడి చేసి గాయపరిచారు. అనంతరం మరో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పై దాడి చేశారు. ఈ నలుగురు బాధితుల గస్తీ బృందాలకు సమాచారం ఇచ్చినా లిఖిత పూర్వక ఫిర్యాదు చేయలేదు. ఈశ్వర్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన మాదాపూర్ పోలీసులు రెస్టారెంట్, ఇతర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను అధ్యయనం చేశారు. వాహనం నెంబర్ గుర్తించి వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఆ ఇద్దరూ మద్యం మత్తులోనో, డ్రగ్స్ ప్రభావంతోనో అలా ప్రవర్తించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఐటీజోన్ ఎంత భద్రం..!
480కి పైగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు.. 3.80 లక్షల మందికి పైగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు.. రౌండ్ ది క్లాక్ పని.. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం సైబరాబాద్. ఇక్కడి ఐటీ కంపెనీలు ఎంత సేఫ్..? అంటే అనుమానించక తప్పదు. మెజారిటీ కంపెనీల్లో ఇంకా సెక్యూరిటీ సేవలు సాధారణ పౌరులు నిర్వహిస్తున్నవే కావడంతో అందరి దృష్టి ఈ ప్రాంతం పైకి మళ్లుతోంది. తాజాగా నగరంలో వెలుగు చూసిన ఉగ్రకుట్రలో సైబరాబాద్‌లోనే పలు కంపెనీలు, మాల్స్ ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడం సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లోను ఆందోళన రేగుతోంది. - సాక్షి, సిటీబ్యూరో ♦ మెజారిటీ కంపెనీలకు సాధారణ సెక్యూరిటీయే.. ♦ దాడులు జరిగితే.. నిలువరించే వ్యూహం లేదు ♦ కొన్ని కంపెనీల్లోనే సాయుధ రక్షణ బలగం ♦ మిగతా వాటిలో సీసీ కెమెరాలతో సరి.. ఐటీ జోన్లో ఉన్న మొత్తం కంపెనీల్లో సుమారు 300 కంపెనీలు నామమాత్రం సెక్యూరిటీతో సరిపెడుతున్నాయి. అపరిచితులు లోనికి వెళ్లకుండా మాత్రమే చూసే సెక్యూరిటీ గార్డులకు ఆపద సమయంలో వ్యవహరించే తీరు, సాయుధులు దాడులకు పూనుకుంటే వారిని అడ్డుకునే నైపుణ్యం, సామర్థ్యం గాని లేవు. సైబరాబాద్ కమిషనరేట్‌లోని మాదాపూర్ ఐటీ లే అవుట్, నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం, గ,చ్చిబౌలి ఎస్ఈజెడ్లో ఉన్న కంపెనీల్లో విప్రో, డీఎల్ఎఫ్, ఇన్ఫోసిస్‌తో పాటు మరికొన్ని కంపెనీల్లో మాత్రమే సొంత సాయుధ రక్షణ ఉంది. సీసీ కెమెరాల ఏర్పాటుతో సరి ఐటీ జోన్లో లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా నేర పరిశోధనలో పనికివచ్చే సీసీ కెమెరాల ఏర్పాటు అంశానికే పోలీస్ యంత్రాంగం ప్రాధాన్యమిస్తోంది. ప్రతి నెలలో సైబరాబాద్ జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగే ఐటీ జోన్ భద్రత సమావేశంలో ప్రపంచ దేశాల్లో జరుగుతున్న దాడులు, వాటి తీరు, ఒక వేళ దాడులు జరిగితే సెక్యూరిటీ సిబ్బంది, ఉద్యోగులు వ్యవహరించాల్సిన తీరును వివరిస్తున్నారు. అయితే, ఉగ్రవాదుల నుంచి ఐటీ పరిశ్రమలకు తీవ్ర ముంపు పొంచి ఉందని ఇప్పటికే గ్రహించిన పోలీస్ అధికారులు, ఐటీ కంపెనీలు సాయుధ రక్షణ పెట్టుకోవాలని, వారి కోరిక మేరకు ఆయుధ లెసైన్స్‌లు ఇస్తామని ప్రకటించారు. అయినా ఇప్పటి వరకు మెజారిటీ కంపెనీలు సాయుధ రక్షణపై పెద్దగా స్పందించలేదు. ఏవైనా దాడులు జరిగే సమయాల్లో సుశిక్షితులైన పోలీస్ దళాలు వచ్చే వరకైనా, నిలువరించే ప్రయత్నం చేస్తే నష్టం తక్కువగా ఉంటుందని పోలీస్ అధికారులు చెప్పినా ఆ దిశగా ప్రయత్నాలేవీ చేపట్టలేదు. కారిడార్ చూట్టూ నిఘా నేత్రాలు ఇక్కడి ఐటీ కారిడార్ చుట్టూ 24 గంటలూ నిఘా నేత్రాలు పనిచేస్తున్నాయి. కంపెనీల్లో ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక సీసీ కెమెరాలు కాకుండా ఐటీ కారిడార్‌లో ప్రధాన కూడళ్లు, రహదారుల్లో దాదాపు 150 కెమెరాలను అమర్చారు. త్వరలో మరో 50 అమర్చనున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా 80 కిలో మీటర్ల ఫైబర్ కేబుళ్లను ఏర్పాటు చేశారు. నెట్వర్కింగ్ సమర్ధవంతంగా పనిచేసేందుకు దీనిని ఏర్పాటు చేశారు. దీనిని ద్వారా మరో 200 కె మెరాలు ఏర్పాటు చేయనున్నారు. అప్రమత్తంగా ఉన్నాం అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రోజులాగే పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు అనుసంధానించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సిబ్బంది ఎప్పటిలాగే అప్రమత్తంగా ఉంది. ఆయా కంపెనీల్లో భద్రతను మరింత పటిష్టం చేయనున్నాం. - నవీన్ చంద్, సైబరాబాద్ వెస్ట్ కమిషనర్ -
ఐటీ జోన్లో సింగపూర్ సోకులు
రాయదుర్గం,న్యూస్‌లైన్: ఐటీజోన్‌కు మరో మణిహారం..ఇప్పటికే అభివృద్ధిలో దూసుకెళ్తున్న ఈ ప్రాంతంలో సింగపూర్ దేశంలో మాదిరి ఫుట్‌ఓవర్‌బ్రిడ్జీ(ఎఫ్వోబీ)లను నిర్మించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 5 వంతెనలను నిర్మించనుండగా..నానక్‌రాంగూడ ఐటీజోన్ పరిధిలో రెండు, మాదాపూర్ ఐటీజోన్‌లో మూ డింటిని నిర్మించేందుకు అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నారు. తొలివిడతలో నానక్‌రాంగూడ, మాదాపూర్‌లలో ఒక్కోటి చొప్పున నిర్మాణం చేయనున్నారు. నానక్‌రాంగూడలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)-ఇన్ఫోసిస్‌ల మధ్య నిర్మించే ఈ వంతెన పనులు గురువారం ప్రారంభమయ్యాయి. మాదాపూర్‌లో రహేజా ఐటీపార్కు వద్ద రెండోదాని పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ)ప్రకాశ్ ఆర్ట్స్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం వీటి నిర్మాణం చేయడంతోపాటు నిర్వహణను కూడా చూస్తుందని అధికారులు తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో వంతెన: ఐటీజోన్‌లో నిర్మించే ఫుట్ఓవర్ బ్రిడ్జీలను సింగపూర్‌లోని వంతెనల తరహాలో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీఐఐసీ అధికారులు సూత్రప్రాయంగా చెప్పారు. సింగపూర్‌లో ఎఫ్‌వోబీకి మెట్ల స్థానంలో ఇరువైపులా ఎస్క్‌లేటర్లు ఉంటాయి. దీంతోపాటు ఆధునిక లైటింగ్ విధానం, సీసీ కెమెరాలను అమర్చుతారు. ఇటీవలకాలంలో ఐటీజోన్‌లో వాహనాల రద్దీ బాగా పెరిగినందున పాదచారుల కోసం ఎఫ్‌వోబీల నిర్మాణాలు చేపట్టాలని తలపెట్టారు. ప్రతి ఎఫ్వోబీ ఉన్నచోట ఇరువైపులా ఏసీ బస్షెల్టర్ల నిర్మాణ పనులకు కూడా శ్రీకారం చుట్టారు.