
సాక్షి, సిటీబ్యూరో: అడుగు జాగా ఖాళీ వదలకుండా నిర్మించిన బహుళ అంతస్తుల భవంతులతో ఐటీజోన్‌గా పేరొందిన మాదాపూర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి. బహుళ అంతస్తుల వాణిజ్య భవనాల నిర్మాణానికి సంబంధించి..ఫ్లోర్‌స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ) నిబంధన నగరంలో కాగితాలకే పరిమితమౌతోంది. ఒక ఎకరం స్థలంలో నిర్మించే వాణిజ్య భవనం కేవలం 2.5 లక్షల చదరపు అడుగులకు మించరాదన్నదే ఈ ఎఫ్‌ఎస్‌ఐ నిబంధన. కానీ ఐటీ జోన్, ఫైనాన్షియల్ జిల్లా పరిధిలో ఎకరం జాగాలో సుమారు 10–15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన భవంతులే అత్యధికంగా దర్శనమిస్తున్నాయి. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే గ్రేటర్ సిటీలోని ఐటీ జోన్‌లో ఫ్లోర్‌స్పేస్ ఇండెక్స్ అత్యధికంగా ఉన్నట్లు తాజాగా కుష్మన్ వేక్‌ఫీల్డ్ అనే సంస్థ చేపట్టిన అధ్యయనంలో స్పష్టమైంది.
ఫ్లోర్‌స్పేస్ అధికమైతే కష్టాలివే..
- భారీ విస్తీర్ణంలో నిర్మించిన బహుళ వాణిజ్య భవంతుల్లో పనిచేస్తున్న వందలాదిమంది ఉద్యోగులు ఒక్కసారిగా బయటికి రావడంతో కార్లు, ద్విచక్ర వాహనాలు వేలాదిగా ప్రధాన రహదారులను ముంచెత్తుతుండడంతో గ్రిడ్‌లాక్ అయి ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభిస్తోంది.
- ఖాళీ వదలకుండా లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న భవంతుల కారణంగా సిటీ కాంక్రీట్ మహారణ్యంగా మారుతోంది.
- వర్షాకాలంలో వర్షపునీరు ఇంకే దారులు లేక వరదనీరు ప్రధాన రహదారులపైకి పోటెత్తుతోంది.
- వర్షపునీరు ఇంకేందుకు ఖాళీ ప్రదేశాలు లేకపోవడంతో భూగర్భజలమట్టాలు పడిపోతున్నాయి.
- భారీ భవనాల చుట్టూ గ్రీన్‌బెల్ట్ అవసరమైనంత మేర లేకపోవడం, వాహనాలు వదిలే పొగ, దుమ్ము, ధూళి కాలుష్యం పెరిగి వాయు నాణ్యత తగ్గి సిటీజనులు అనారోగ్యం పాలవుతున్నారు.
- కాంక్రీట్ భవంతులు, అద్దాల మేడలతో అతినీలలోహిత వికిరణ తీవ్రత పెరుగుతోంది.
- భూతాపం వాతావరణంలో కలిసే పరిస్థితి లేక అధిక వేడిమితో జనం విలవిల్లాడుతున్నారు.
ఇతర మెట్రో నగరాల్లో ఇలా..
- దేశరాజధాని ఢిల్లీలో ఎకరం స్థలంలో కేవలం 1.23 లక్షల చదరపు అడుగుల భవనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. అంతకు మించి నిర్మాణాలు చేపడితే ఢిల్లీ ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటోంది.
- వాణిజ్య రాజధాని ముంబాయి సిటీలో 2.55 లక్షల చదరపు అడుగుల భవనాలకే అనుమతి ఉంది.
- బెంగళూరులో కేవలం 2.5 లక్షల చదరపు అడుగులు మాత్రమే.
- చెన్నై సిటీలో 3.25 లక్షల చదరపు అడుగుల భవనాలకే అనుమతి ఉంది.
- పూణేలో కేవలం 2 లక్షల చదరపు అడుగుల భవనాలకే పర్మిషన్లు ఇస్తున్నారు.
- గ్రేటర్ సిటీలో ఐటీ, బీపీఓ, కేపీఓ కంపెనీలకు రెడ్‌కార్పెట్ పరిచే ఉద్దేశంతో ప్రభుత్వం ఫ్లోర్‌స్పేస్ ఇండెక్స్ నిబంధనల అమలు చేయడంలేదు.
- దీంతో ఎకరం జాగాలో ఏకంగా 10–15 లక్షల చదరపు అడుగుల మేర భారీ బహుళ అంతస్తుల భవంతులను నిర్మిస్తున్నట్లు తాజా అధ్యయనంలో స్పష్టమైంది.
Comments
Please login to add a commentAdd a comment