దుబాయ్: భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు ముంబై నగరానికే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు యూఏఈకి చెందిన ప్రవాస భారతీయులు. దుబాయ్‌లో ఇటీవల సుమాంశ ఎగ్జిబిషన్ అనే సంస్థ ఇండియన్ ప్రోపర్టీ షో నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈ సర్వే ప్రకారం.. యూఏఈ దేశాల్లో ఉన్న ప్రవాసభారతీయులు వచ్చే కొద్దినెలల్లో భారత్‌లో నివాస స్థలాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా, ఎన్‌ఆర్‌ఐలలో 31.86 శాతం మంది ముంబైలోనే స్థలాల కొనుగోలుకు ఆసక్తి చూపించారు. బెంగళూరులో స్థలాలపై పెట్టుబడులు పెట్టేందుకు 24.35 శాతం మంది ముందుకు వచ్చారు. ఇదిలా ఉండగా, చెన్నై, పుణే నగరాలు సంయుక్తంగా మూడోస్థానంలో నిలిచాయి. నాలుగోస్థానంలో ఢిల్లీ, తర్వాత స్థానాల్లో వరుసగా కొచ్చిన్, నవీ ముంబై, గుర్గావ్, హైదరాబాద్ నిలిచాయి.
‘బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది. అక్కడ మార్కెట్‌లో పలు కొత్త వెంచర్‌లను మొద లుపెట్టడం, ప్లాట్‌లు, ఫ్లాట్‌లకు మంచి డిమాండ్ ఉండటం, రేట్లు కూడా అందుబాటులో ఉండటంతో ప్రవాస భారతీయులు ముంబై తర్వాత బెంగళూరులో ఆస్తుల కొనుగోలుపై దృష్టి పెడుతున్నార’ని సుమాంశ ఎగ్జిబిషన్స్ సీఈవో సునీల్ జైస్వాల్ తెలిపారు. విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస కుబేరులు అత్యధిక మంది భవిష్యత్తులో స్థిరనివాసమేర్పరుచుకునేందుకు అనువైన స్థలంగా బెంగళూరులో భావిస్తుండటంతో మున్ముందు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడుపువ్వులు- ఆరు కాయలుగా వర్ధిల్లబోతోందని జైస్వాల్ జోస్యం చెప్పారు.
ఇదిలా ఉండగా, ఈ గ్రూప్ ఆధ్వర్యంలో జూన్ 12-14 మధ్య ప్రోపర్టీ ఎగ్జిబిషన్ జరగనుంది. వీరు నిర్వహించిన సర్వే ప్రకారం.. రూ.76 లక్షలు ఆపై స్థాయి స్థలాల కొనుగోలు కోసం 31 శాతం మంది ఆసక్తి చూపిస్తుండగా, రూ.26-75 లక్షల మధ్య స్థాయిలో ఆస్తుల కొనుగోలుకు 52.57 శాతం మంది ముందుకు వస్తున్నారు. రూ. కోటికిపైగా పలికే ఆస్తుల కోసం 16 శాతం ముందుకు వస్తున్నారు. అలాగే, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువస్తున్న వారిలో 67 శాతం మంది 36-50 ఏళ్ల మధ్య వయస్కులు కావడం విశేషం. వీరిలో 72 శాతం మంది వచ్చే ఆరునెలల్లోనే తమకు అందుబాటులో ఉన్న ధరల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. యూఏఈ వ్యాప్తంగా ఈ సర్వేలో 14,700 మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు వివరించారు.
ముంబైకే మొదటి ఓటు..!
Published Tue, May 27 2014 10:48 PM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM
Advertisement
Advertisement