గెలుపు దారి
రియల్ ఎస్టేట్ రంగంలో మహిళల పేర్లు అరుదుగా వినిపిస్తాయి. కోడర్, స్ట్రాటజీ కన్సల్టెంట్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్, సీయీవోగా మంచి పేరు తెచ్చుకున్న 39 సంవత్సరాల అనన్య త్రిపాఠి రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టి విజయం సాధించింది. ‘రియల్ ఎస్టేట్ క్వీన్’గా పేరు తెచ్చుకుంది...
ఆర్మీ ఆఫీసర్ కూతురు అయిన అనన్య త్రిపాఠి తరచుగా ఒక స్కూల్ నుంచి మరో స్కూల్‌కు మారుతూ ఉండేది. ‘రకరకాల ప్రాంతాలలో చదువుకోవడం వల్ల ఎన్నో సంస్కృతుల గురించి తెలుసుకునే అవకాశం, అదృష్టం దొరికింది’ అంటుంది అనన్య.
పుణెలోని ఆర్మీ ఇన్‌స్టిట్యూట్‌లో ఇంజనీరింగ్ పూర్తిగా చేసిన అనన్య ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ కంపెనీ ‘టీసీఎస్’ తొలి ఉద్యోగం చేసింది.
కోడర్‌గా మంచి పేరు వచ్చినా తన దృష్టి వ్యాపారంగంపై మళ్లింది. అలా కోళికోద్ – ఐఐఎంలో ఎంబీఏ చేసింది. క్యాంపస్ సెలెక్షన్‌లో ‘మెకిన్సీ’కి ఎంపికైన ఏకైక స్టూడెంట్ అనన్య.
గ్లోబల్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ కంపెనీ ‘మెకిన్సీ’లో ఏడు సంవత్సరాల ప్రయాణం తనకు ఎన్నో పాఠాలు నేర్పింది.
మార్గదర్శకులలాంటి వ్యక్తులతో పరిచయం జరిగింది.
విశ్లేషణాత్మకంగా ఉండడంతో పాటు స్ట్రక్చర్డ్ డాటా తాలూకు సమస్యలను పరిష్కారించడానికి సంబంధించిన జ్ఞానాన్ని మెకిన్సీలో సొంతం చేసుకుంది. అయితే ఫ్యాషన్ ఇ–కామర్స్ కంపెనీ ‘మింత్రా’ నుంచి వచ్చిన అవకాశం అనన్య కెరీర్‌ను మార్చి వేసింది. ఇ–కామర్స్ గురించి ఎన్నో సందేహాలు ఉన్న ఆ కాలంలో ‘మింత్రా’ నుంచి వచ్చిన ఆఫర్‌కు వెంటనే ఓకే చెప్పడం కష్టమే. అయినప్పటికీ సందేహాలను పక్కన పెట్టి చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ హోదాలో ‘మింత్రా’లో చేరింది అనన్య. మూడున్నరేళ్లలో ‘మింత్రా’ లాభాలను పెంచింది.
ఆ తరువాత గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫర్మ్ ‘కేకేఆర్ కేప్‌స్టోన్’ నుంచి కొత్త కెరీర్ ఆపర్చునిటీ వెదుక్కుంటూ వచ్చింది. ‘కేకేఆర్’లో మాక్స్ హెల్త్‌కేర్, వినీ కాస్మెటిక్స్‌లాంటి కంపెనీలతో కలిసి పనిచేసింది. అనన్య మెటర్నిటీ లీవ్‌లో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ గ్రూప్ ‘బ్రూక్‌ఫీల్డ్’ నుండి పిలుపు వచ్చింది. మామూలుగానైతే మెటర్నిటీ బ్రేక్‌లో ఉన్నప్పుడు సెలవు కాలం పూర్తయ్యేంత వరకు చాలా కంపెనీలు వేచి చూడవు. అయితే బ్రూక్‌ఫీల్డ్ మాత్రం అనన్య ప్రతిభాసామర్థ్యాలపై నమ్మకంతో ఓపిగ్గా వేచి చూసింది.
వారి నమ్మకాన్ని అనన్య వమ్ము చేయలేదు.
‘పలు పరిశ్రమలకు సంబంధించి ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్ట్‌లలో అనన్యకు అపారమైన అనుభవం ఉంది. స్ట్రాటజీ కన్సల్టెంట్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్‌గా ఆమె ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది’ అంటాడు బ్రూక్‌ఫీల్డ్ రియల్ ఎస్టేట్ మేనేజింగ్ పార్టనర్ అంకుర్ గుప్తా.
బ్రూక్‌ఫీల్డ్ రియల్ ఎస్టేట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్‌గా మరోసారి గెలుపు జెండా ఎగరేసిన అనన్య త్రిపాఠి నుంచి వినిపించే సక్సెస్‌మంత్రా ‘కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి’.
Comments
Please login to add a commentAdd a comment