ఫ్రెషర్లకు కొలువుల పండగ! | Employers intent to hire freshers rises by 30percent for Jan-Jun | Sakshi
Sakshi News home page

ఫ్రెషర్లకు కొలువుల పండగ!

Published Fri, Feb 18 2022 3:47 AM | Last Updated on Fri, Feb 18 2022 3:47 AM

Employers intent to hire freshers rises by 30percent for Jan-Jun - Sakshi

న్యూఢిల్లీ: కాలేజీల నుంచి పట్టాలు పుచ్చుకుని కొలువుల కోసం చూస్తున్న ఫ్రెషర్లకు తీపికబురు. ఈ ఏడాది జనవరి–జూన్‌ మధ్య కాలంలో కంపెనీలు ఫ్రెషర్లను అధికంగా తీసుకోనున్నాయి. టీమ్‌లీజ్‌ ఎడ్యుటెక్‌ ‘కెరీర్‌ అవుట్‌లుక్‌ రిపోర్ట్‌’ ఈ వివరాలు వెల్లడించింది. క్రితం ఏడాది తొలి ఆరు నెలలతో పోలిస్తే ప్రస్తుత ఏడాది అర్ధ భాగంలో ఫ్రెషర్లను నియమించుకోవాలన్న ఉద్దేశం కంపెనీల్లో 30 శాతం ఎక్కువగా కనిపించినట్టు వివరించింది. 47 శాతానికి పైగా కంపెనీలు జూన్‌లోపు ఫ్రెషర్లను నియమించుకోనున్నట్టు తెలిపాయి.

గతేడాది ఇది 17 శాతంగానే ఉన్నట్టు తెలిపింది. ‘‘కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎన్నో సవాళ్లు నెలకొన్నప్పటికీ కంపెనీల్లో ఫ్రెషర్ల నియామకం పట్ల సానుకూలత పెరగడం సంతోషాన్నిస్తోంది’’ అని టీమ్‌లీజ్‌ ఎడ్‌టెక్‌ సీఈవో శంతనురూజ్‌ పేర్కొన్నారు. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం, వృద్ధిపై దృష్టి సారించడం ఈ సానుకూల ధోరణికి కారణాలుగా తెలిపారు. ఫ్రెషర్లతోపాటు అన్ని రకాల ఉద్యోగాలకు కలిపి చూస్తే నియామకాల ఉద్దేశం 50 శాతం పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఫ్రెషర్లకు ఐటీ, ఈ కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లు, టెలికమ్యూనికేషన్స్‌ రంగాల్లో అధిక కొలువులు రానున్నట్టు పేర్కొంది.

వీటికి అధిక డిమాండ్‌
‘‘డేటా అనలైటిక్స్, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్, సైబర్‌ సెక్యూరిటీ, ఏఆర్‌/వీఆర్, కంటెంట్‌ రైటింగ్‌ ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్‌ నెలకొంది. డిజిటల్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్, ఆర్టిíఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇంజనీర్, టెక్నికల్‌ రైటర్, ఫుల్‌ స్టాక్‌ డెవలపర్, సప్లయ్‌ చైన్‌ అనలిస్ట్‌ ఉద్యోగాలకూ డిమాండ్‌ ఉంటుంది. ఫ్రెషర్ల విషయానికొస్తే విశ్లేషణా సామర్థ్యాలు, ఇన్నోవేషన్, ఒత్తిడిని నియంత్రించుకోగలగడం, సమాచార నైపుణ్యాలు, భావోద్వేగాల నియంత్రణ, సానుకూల దృక్పథాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి’’ అని టీమ్‌లీజ్‌ ఎడ్యుటెక్‌ ప్రెసిడెండ్, సహ వ్యవస్థాపకుడు నీతి శర్మ తెలిపారు.   

ఐటీలో 3.6 లక్షల కొలువులు
ఐటీ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద 3.6 లక్షల మంది ఫ్రెషర్లకు ఉపాధి కల్పిస్తుందని మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ‘అన్‌ఎర్త్‌ ఇన్‌సైట్‌’ సంస్థ పేర్కొంది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్‌) 22.3%గా ఉన్నట్టు తెలిపింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో 19.5% నుంచి పెరిగినట్టు పేర్కొంది. జనవరి–మార్చి త్రైమాసికంలో 24%కి పెరగొచ్చని.. వచ్చే ఏడాది (2022–23)లో ఇది 16–18%కి తగ్గుతుందని అంచనా వేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement