న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఇండస్‌ఇండ్ బ్యాంక్ నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 52 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ2లో రూ.920 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) క్యూ2లో రూ.1,401 కోట్లకు పెరిగిందని ఇండస్‌ఇండ్ బ్యాంక్ తెలిపింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర లాభం స్వల్పంగా తగ్గిందని బ్యాంక్ సీఈఓ రమేశ్ సోబ్తి చెప్పారు. కేటాయింపులు పెరగడం, నికర వడ్డీ మార్జిన్ తక్కువ వృద్ధిని నమోదు చేయడం దీనికి కారణాలని వివరించారు. మొత్తం ఆదాయం రూ.6,755 కోట్ల నుంచి రూ.8,878 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.
నికర వడ్డీ మార్జిన్ 4.1 శాతం
నికర వడ్డీ ఆదాయం 32 శాతం వృద్ధితో రూ.2,909 కోట్లకు పెరిగిందని రమేశ్ సోబ్తి తెలిపారు. సీక్వెన్షియల్‌గా చూస్తే, నికర వడ్డీ మార్జిన్ మెరుగుపడి 4.1 శాతానికి ఎగసిందని వివరించారు. 21 శాతం రుణ వృద్ధి సాధించామని, ఇది బహుళ సంవత్సరాల కనిష్ట స్థాయి అని, మందగమనం ప్రభావం మరో ఆరు నెలల పాటు ఉండగలదని అంచనా వేస్తున్నామన్నారు.
ఎగబాకిన మొండిబకాయిలు...
నికర లాభం, ఆదాయాలతో పాటు బ్యాంక్ మొండి బకాయిలు కూడా పెరిగాయి. రుణ నాణ్యత వార్షికంగా, సీక్వెన్షియల్‌గా చూసినా క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్‌లో 1.09 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో 2.19 శాతానికి పెరిగాయని రమేశ్ సోబ్తి వెల్లడించారు. అలాగే నికర మొండి బకాయిలు 0.48 శాతం నుంచి 1.12 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. తాజా మొండి బకాయిలు ఈ క్యూ1లో రూ.725 కోట్లుగా ఉండగా, ఈ క్యూ2లో రూ.1,102 కోట్లకు పెరిగాయని తెలిపారు. దీంట్లో కంపెనీల తాజా మొండి బకాయిలు 174 శాతం, రిటైల్ రుణాలకు సంబంధించిన తాజా మొండి బకాయిలు 13 శాతం చొప్పున పెరిగాయని వివరించారు. ఇక కేటాయింపులు రూ.590 కోట్ల నుంచి 71 శాతం వృద్ధితో రూ.738 కోట్లకు చేరాయని వివరించారు. ఈ క్యూ1లో 43 శాతంగా ఉన్న ప్రొవిజన్ కవరేజ్ రేషియో ఈ క్యూ2లో 50 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు.
నికర లాభం, ఆదాయం పెరిగినా, మొండి బకాయిలు రెట్టింపై రుణనాణ్యత క్షీణించడంతో ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేరు 6.1 శాతం నష్టంతో రూ. 1,229 వద్ద ముగిసింది.
ఇండస్‌ఇండ్ లాభం రూ.1,401 కోట్లు
Published Fri, Oct 11 2019 5:58 AM | Last Updated on Fri, Oct 11 2019 5:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment