ఇండస్ఇండ్ బ్యాంక్ లాభం 26% అప్
ముంబై : వివిధ వ్యాపార విభాగాల్లో వృద్ధి ఊతంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇండస్‌ఇండ్ బ్యాంక్ లాభం 26 శాతం ఎగిసి రూ. 661 కోట్లుగా నమోదైంది. మరోవైపు ఆదాయం 34 శాతం వృద్ధితో రూ. 1,742 కోట్ల నుంచి రూ. 2,329 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం మరింత మెరుగ్గా 38% వృద్ధి చెంది రూ. 981 కోట్ల నుంచి రూ. 1,356 కోట్లకు చేరగా, వడ్డీయేతర ఆదాయం 28 శాతం పెరుగుదలతో రూ. 973 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్లు (నిమ్) 3.68 శాతం నుంచి 3.97 శాతానికి మెరుగుపడ్డాయి. ప్రతీ త్రైమాసికంలో నికర వడ్డీ మార్జిన్లు కనీసం 2-3 బేసిస్ పాయింట్ల మేర మెరుగుపర్చుకుంటున్నామని, ఇదే ధోరణి ఇక ముందు కూడా కొనసాగగలదని బ్యాంక్ ఎండీ రమేష్ సోబ్తి ఆశాభావం వ్యక్తం చేశారు. డిపాజిట్లు 31 శాతం వృద్ధితో రూ. 1,01,768 కోట్లకు, మంజూరు చేసిన రుణాలు 30 శాతం పెరుగుదలతో రూ. 93,678 కోట్లకు చేరాయి. నికర నిరర్ధక ఆస్తులు స్వల్పంగా 0.31% నుంచి 0.38 శాతానికి పెరిగాయి.