పరోక్ష పన్ను వసూళ్లలో 22% వృద్ధి
ప్రత్యక్ష పన్ను వసూళ్ల వృద్ధి 11%
న్యూఢిల్లీ: పరోక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016–17) ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకూ (గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చిచూస్తే) గడిచిన 11 నెలల్లో 22.2 శాతం వృద్ధిని సాధించాయి. ప్రత్యక్ష పన్ను వసూళ్ల విషయంలో ఈ రేటు 11 శాతంగా ఉంది. తాజాగా విడుదలైన గణాంకాల్లో ముఖ్యాంశాలు ...
⇔ ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు మొత్తంగా రూ.13.89 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2016–17 బడ్జెట్ సవరించిన అంచనాల లక్ష్యం (రూ.16.99 లక్షల కోట్లు)లో ఇది 81.5 శాతం.
⇔ వేర్వేరుగా చూస్తే... ప్రత్యక్ష పన్ను వసూళ్లు 6.17 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. స్థూలంగా కార్పొరేట్ ఆదాయపు పన్ను (సీఐటీ) 11.9 శాతంవృద్ధి సాధించగా, వ్యక్తిగత ఆదాయ పన్ను (పీఐటీ) విషయంలో ఈ వృద్ధిరేటు 20.8 శాతంగా ఉంది. రిఫండ్స్‌ను భర్తీ చేసి, నికరంగా చూస్తే– ఈ శాతాలు వరుసగా 2.6 శాతం, 19.5 శాతంగా నమోదయ్యాయి. ఈ కాలంలో రిఫండ్స్ రూ. 1.48 లక్షల కోట్లు. వార్షికంగా 40.2 శాతం పెరుగుదల రిఫండ్స్ విషయంలో నమోదయ్యింది.
⇔ కాగా, పరోక్ష పన్ను వసూళ్లు రూ.7.72 లక్షల కోట్లు. తయారీ రంగం క్రియాశీలతకు సూచికయిన ఎక్సైజ్ సుంకాల వసూళ్లు 36.2 శాతం వృద్ధితో రూ.3.45 లక్షల కోట్లకు చేరాయి. సేవల విభాగం పన్ను వసూళ్లు కూడా భారీగా 20.8 శాతం పెరిగి రూ.2.21 లక్షలకు ఎగశాయి. ఇక కస్టమ్స్ సుంకాల వసూళ్లు 5.2 శాతం వృద్ధితో రూ.2.05 లక్షల కోట్లకు ఎగశాయి.