ఇండస్ఇండ్ బ్యాంక్ లాభం 26 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగంలోని ఇండస్‌ఇండ్ బ్యాంక్ నికరలాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 26 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు రూ.560 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు రూ.704 కోట్లకు పెరిగిందని ఇండస్‌ఇండ్ బ్యాంక్ తెలిపింది. వడ్డీ ఆదాయం ఆరోగ్యకరమైన వృద్ధి సాధించడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని బ్యాంక్ ఎండీ, సీఈఓ రమేశ్ సోబ్తి చెప్పారు, నికర వడ్డీ ఆదాయం 33 శాతం వృద్ధితో రూ.1,460 కోట్లకు పెరగడంతో నికర లాభం 26 శాతం వృద్ధి సాధించిందని వివరించారు.
గత క్యూ2లో రూ.3,581 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.4,440 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. స్థూల మొండి బకాయిలు 0.77 శాతం నుంచి 0.90 శాతానికి, నికర మొండి బకాయిలు 0.31 శాతం నుంచి 0.37 శాతానికి పెరిగాయని వివరించారు. కేటాయింపులు రూ.158 కోట్ల నుంచి రూ.214 కోట్లకు పెరిగాయని తెలిపింది. నికర వడ్డీ మార్జిన్(ఎన్‌ఐఎం) 4%కి పెరిగిందని, మార్జిన్లు అధికంగా వచ్చే రిటైల్ రుణాలు వేగంగా వృద్ధిచెందడం, నిధుల వ్యయం తగ్గడం వంటి కారణాల వల్ల నికర వడ్డీ మార్జిన్ పెరిగిందని పేర్కొన్నారు. ఫీజులు, ఫారెక్స్, ట్రెజరీ కార్యకలాపాలు కలగలసిన ఇతర ఆదాయం 24% వృద్ధి చెంది రూ.970 కోట్లకు పెరిగిందని వివరించారు. వినియోగదారుల రుణాలు 42%, కార్పొరేట్ రుణాలు 27% పెరగడంతో మొత్తం మీద రుణాలు 26% వృద్ధి చెందిందని తెలిపారు.