టీసీఎస్ అంచనాలు మిస్!
జూన్ క్వార్టర్‌లో నికర లాభం 5.9 శాతం డౌన్; రూ.5,945 కోట్లు
♦ ఆదాయం 29,584 కోట్లు; వృద్ధి 1 శాతమే
♦ రూపాయి విలువ పెరుగుదల, వేతనాల పెంపు ఎఫెక్ట్
♦ షేరుకి రూ. 7 మధ్యంతర డివిడెండ్
ఒకపక్క వీసా సమస్యలు... మరోపక్క రూపాయి అనూహ్య పెరుగుదల... వేతనాల పెంపు... ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవలకు డిమాండ్ మందగమనం... ఇవన్నీ దేశీ ఐటీ రంగానికి పెను సవాల్‌నే విసురుతున్నాయి. తాజాగా భారత సాఫ్ట్‌వేర్ అగ్రగామి టీసీఎస్ ఫలితాలు ఐటీ పరిశ్రమ పరిస్థితిని కళ్లకు కట్టాయి. కంపెనీ నికర లాభం జూన్ క్వార్టర్‌లో అంచనాలకు మించి దిగజారింది. ఆర్థిక ఫలితాల సీజన్‌ను నిరుత్సాహకరంగా బోణీ చేసింది. గడిచిన రెండేళ్లలో లాభం ఇంత భారీగా తగ్గిపోవడం ఇదే తొలిసారి.
ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(2017–18, క్యూ1)లో పేలవ పనితీరును నమోదుచేసింది. కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.5,945 కోట్లకు పరిమితం అయింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.6,317 కోట్లతో పోలిస్తే 5.9% దిగజారింది. ఇక మొత్తం ఆదాయం స్వల్పంగా 1 శాతమే పెరిగి రూ.29,584 కోట్లుగా నమోదైంది. గతేడాది క్యూ1లో మొత్తం ఆదాయం రూ.29,305 కోట్లు.
ప్రధానంగా డాల రుతో రూపాయి మారకం విలువ పెరుగుదల(క్యూ1లో దాదాపు 3.5 శాతం పెరిగింది. ప్రస్తుతం 64.5 వద్ద కదలాడుతోంది), ఇతర ప్రధాన కరెన్సీలతో డాలరు విలువ తగ్గుదల(క్రాస్ కరెన్సీ హెచ్చుతగ్గులు)తో పాటు సిబ్బంది వేతనాల పెంపు వంటివి కంపెనీ పనితీరుపై ప్రభావం చూపినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, క్యూ1లో విశ్లేషకులు కంపెనీ రూ.6,195 కోట్ల నికర లాభాన్ని రూ.29,580 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయొచ్చని అంచనా వేశారు. లాభాలు అంచనాలను అందుకోవడంలో విఫలం కాగా, ఆదాయం మాత్రం దాదాపు అదేస్థాయిలో నమోదైంది.
సీక్వెన్షియల్‌గా చూస్తే...
గత ఆర్థిక సంవత్సరం క్యూ4(డిసెంబర్–మార్చి)లో టీసీఎస్ రూ.6,608 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. దీంతో పోలిస్తే సీక్వెన్షియల్ ప్రాతిపదికన లాభం క్యూ1లో 10% పడిపోయింది. ఇక ఆదాయం కూడా సీక్వెన్షియల్‌గా(క్యూ4లో రూ.29,642 కోట్లు) వృద్ధి లేకపోగా, 0.2% క్షీణించడం గమనార్హం. బ్లూంబర్గ్ వార్తా సంస్థ చేపట్టిన ఎనలిస్టుల సర్వేలో టీసీఎస్ క్యూ1 నికర లాభం 6 శాతం తగ్గొచ్చని అంచనా వేశారు. దీనికంటే అధికంగా లాభం దిగజారడం విశేషం. ఇక డాలరు రూపంలో ఆదాయం క్యూ1లో సీక్వెన్షియల్‌గా 3.1% వృద్ధితో 4,591 మిలియన్ డాలర్లుగా నమోదైంది.
ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
⇔ జూన్ క్వార్టర్‌లో మార్జిన్లు 2.3% దిగజారి 23.4 శాతానికి తగ్గాయి. ఆపరేటింగ్ మార్జిన్ లక్ష్యం 26–28 శాతంగా కంపెనీ నిర్దేశించుకుంది. స్థూల లాభం(పన్నులు, వడ్డీ చెల్లింపులకు ముందు) 9.34 శాతం తగ్గింది. రూ.6,914 కోట్లుగా నమోదైంది.
⇔ రిటైల్, బ్యాంకింగ్–ఫైనాన్షియల్ సేవల విభాగం(బీఎఫ్‌ఎస్‌ఐ) మినహా అన్ని పరిశ్రమ విభాగాల నుంచి సీక్వెన్షియల్‌గా 3.5 శాతం ఆదాయ వృద్ధిని సాధించినట్లు కంపెనీ పేర్కొంది. అయితే, కంపెనీ మొత్తం ఆదాయంలో అత్యధిక వాటా కలిగిన బీఎఫ్‌ఎస్‌ఐ మాత్రం 2.3% వృద్ధినే నమోదు చేసింది. ఆదాయాల్లో ఈ విభాగం వాటా కూడా 40% నుంచి 33%కి తగ్గింది.
⇔ డిజిటల్ సేవల ఆదాయం భారీగా 26 శాతం వృద్ధి చెందింది. ఈ విభాగం వాటా మొత్తం ఆదాయంలో 19 శాతానికి చేరింది.
⇔ 50, 100 మిలియన్ డాలర్ల కేటగిరీల్లో క్యూ1లో కంపెనీ ఇద్దరు క్లయింట్లను దక్కించుకుంది. ఇక 10 మి. డాలర్ల కేటగిరీలో 12, మిలియన్ డాలర్ల కేటగిరీలో 8 కొత్త క్లయింట్లను జతచేసుకుంది.
⇔ రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.7 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.
⇔ తీవ్రమైన కరెన్సీ హెచ్చుతగ్గులు (రూపాయి భారీ పెరుగుదలతో సహా) రూ.650 కోట్ల మేర ఆదాయ నష్టాలకు కారణమైనట్లు టీసీఎస్ సీఎఫ్‌ఓ వి.రామకృష్ణన్ పేర్కొన్నారు. ఆర్థిక నిర్వహణలో మరింత క్రమశిక్షణతో పాటు డిజిటల్ వ్యాపారంపై పెట్టుబడులు పెంచనున్నట్లు కూడా ఆయన తెలిపారు. వేతనాల పెంపు ప్రభావం ఉన్నప్పటికీ.. లాభదాయకత తాము అనుకున్న స్థాయిలోనే కొనసాగుతోందని చెప్పారు.
⇔ ఆర్తి సుబ్రమణియన్‌ను ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టు నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మార్చేందుకు(ఆగస్ట్ 17 నుంచి) డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. అయితే, ఆమెకు టాటా గ్రూప్(టాటా సన్స్) చీఫ్ డిజిటల్ ఆఫీసర్‌గా కొత్త బాధ్యతలు అప్పగించనున్నారు.
⇔ గురువారం టీసీఎస్ షేరు ధర బీఎస్‌ఈలో స్వల్పంగా 0.2 శాతం లాభపడి రూ.2,444 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలను ప్రకటించింది.
ఉద్యోగాలు తొలగించలేదు: ముఖర్జీ
కంపెనీ స్థూలంగా క్యూ–1లో 11,202 మంది ఉద్యోగులను నియమించుకుంది. అయితే, 12,616 మంది కంపెనీని వీడిపోయారు. దీంతో నికరంగా 1,414 ఉద్యోగాలు తగ్గిపోయాయి. దీంతో జూన్ చివరినాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 3,85,809కి చేరింది. ఉద్యోగుల వలసల రేటు(అట్రిషన్) కన్సాలిడేటెడ్‌గా 12.4 శాతం, ఐటీ సేవల్లో 11.6 శాతంగా నమోదైంది. గడిచిన మూడు నెలల్లో కంపెనీ ఉద్యోగులెవరినీ తొలగించలేదని హెచ్‌ఆర్ హెడ్ అజోయ్ ముఖర్జీ చెప్పారు. అయితే, గత ఆర్థిక సంవత్సరంలో అధికంగా నియామకాలు చేపట్టిన నేపథ్యంలో ఈ ఏడాది కొత్త ఉద్యోగాల కల్పన కాస్త తక్కువగా ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు.
డిజిటల్ నైపుణ్యాల్లో 2.15 లక్షల మందికిపైగా ఉద్యోగులకు శిక్షణనిచ్చినట్లు కూడా ఆయన వెల్లడించారు. కాగా, లక్నోలోని తమ డెవలప్‌మెంట్ సెంటర్‌ను మూసేస్తున్నట్లు టీసీఎస్ తెలిపింది. పలు ప్రాంతాల్లోని కార్యకలాపాలను స్థిరీకరించే చర్యల్లో భాగంగానే లక్నో సెంటర్‌ను మూసేస్తున్నామని.. అయితే ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులెవరినీ(దాదాపు 1,000 మంది పనిచేస్తున్నారు) తొలగించడం లేదని స్పష్టం చేసింది. ఈ కార్యకలాపాలను నోయిడా సెంటర్‌కు తరలిస్తున్నట్లు వివరించింది.
వివిధ పరిశ్రమలు, వ్యాపార విభాగాలకు సంబంధించి జూన్ క్వార్టర్లో నిలకడైన వృద్ధిని నమోదు చేశాం. చిన్న ప్రాజెక్టులకు ముఖ్యంగా డిజిటల్ సేవల్లో పటిష్టమైన డిమాండ్ నెలకొంది. అన్ని మార్కెట్ల నుంచి కాంట్రాక్టులను చేజిక్కించుకోవడంలో మంచి పురోగతి సాధించాం. మరిన్ని డీల్స్‌కు సిద్ధంగా ఉన్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆకర్షణీయమైన వృద్ధిని సాధిస్తామన్న నమ్మకం ఉంది.
– రాజేశ్ గోపీనాథన్, టీసీఎస్ ఎండీ, సీఈఓ