
ఇండస్ ఇండ్ బ్యాంక్ లాభం 21 శాతం అప్
ముంబై: ప్రైవేట్ రంగంలోని ఇండస్‌ఇండ్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.752 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం రూ.620 కోట్లతో పోలిస్తే 21 శాతం వృద్ధి సాధించినట్లు బ్యాంక్ తెలియజేసింది. నికర వడ్డీ, ఇతర ఆదాయాలు పెరగడంతో పాటు రుణ వృద్ధి, నిర్వహణ లాభం కూడా పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో వృద్ధి చెందిందని వివరించింది. నికర వడ్డీ ఆదాయం 32 శాతం వృద్ధితో రూ.1,667 కోట్లకు పెరగ్గా, రుణ వృద్ధి 28 శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. ఇతర ఆదాయం 33 శాతం వృద్ధితో రూ1,211 కోట్లకు, నిర్వహణ లాభం 37% వృద్ధితో రూ.1,572 కోట్లకు చేరింది.
మొత్తం ఆదాయం 32 శాతం అప్..
మొత్తం ఆదాయం రూ.4,120 కోట్ల నుంచి 22 శాతం వృద్ధితో రూ.5,041 కోట్లకు పెరిగిందని వివరించింది. స్థూల మొండిబకాయిలు 0.87 శాతం నుంచి 0.93 శాతానికి, నికర మొండిబకాయిలు 0.36 శాతం నుంచి 0.39 శాతానికి పెరిగాయని పేర్కొంది. కేటాయింపులు రూ.214 కోట్ల నుంచి రూ.430 కోట్లకు పెంచామని వివరించింది. ఇక 2016–17 పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 25 శాతం వృద్ధితో రూ.2,868 కోట్లకు పెరిగిందని పేర్కొంది. అలాగే మొత్తం ఆదాయం రూ.15,169 కోట్ల నుంచి 23 శాతం వృద్ధితో రూ.18,577 కోట్లకు ఎగసిందని వివరించింది. గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని పేర్కొంది.
ఫలితాలు నేపథ్యంలో బీఎస్‌ఈలో ఈ బ్యాంక్ షేర్ 0.6% క్షీణించి రూ.1,423 వద్ద ముగిసింది.