అమెరికాను బట్టి అంచనా వేయొద్దు! | Experts advice on Bond funds performance | Sakshi
Sakshi News home page

అమెరికాను బట్టి అంచనా వేయొద్దు!

Published Mon, Nov 19 2018 1:28 AM | Last Updated on Mon, Nov 19 2018 1:28 AM

Experts advice on Bond funds performance - Sakshi

బాండ్‌ ఫండ్స్‌ పనితీరు గత ఏడాది కాలంలో సంతృప్తికరంగా లేదు. బాండ్ల రాబడులు పెరగడం వల్ల ఈ బాండ్‌ ఫండ్స్‌ ఎలాంటి రాబడులనివ్వలేదు. కొన్నైతే నష్టాలనూ ఇచ్చాయి. ఇప్పుడైతే అమెరికాలో బాండ్ల రాబడులు స్థిరంగా ఉన్నాయి. ఈ ప్రభావంతో భారత్‌లో కూడా బాండ్ల రాబడులు స్థిరత్వాన్ని పొందుతాయా? ఇప్పుడు బాండ్ల ఫండ్లు మంచి రాబడులనిచ్చే అవకాశాలున్నాయా? – వినయ్, హైదరాబాద్‌  
సాధారణంగా ఇన్వెస్టర్లు ఆదాయం ఖచ్చితంగా వస్తుందనే అంచనాలుంటేనే బాండ్‌ ఫండ్లలో ఇన్వెస్ట్‌  చేస్తారు. ఇక ఈ ఏడాది అన్ని బాండ్ల ఫండ్లు నెగిటివ్‌ రాబడులిచ్చాయనేది నిజం కాదు. దీర్ఘకాల బాండ్‌ ఫండ్స్‌ మాత్రమే నష్టాలనిచ్చాయి. వడ్డీరేట్లు తగ్గుతాయేమోనని అందరూ అంచనాలు వేశారు. కానీ ఈ అంచనాలకు భిన్నంగా వడ్డీ రేట్లు పెరిగాయి. బాండ్‌ ఫండ్ల రాబడులు వడ్డీరేట్లకు విలోమంగా ఉంటాయి. అంటే వడ్డీరేట్లు తగ్గితే బాండ్‌ ఫండ్ల రాబడులు పెరుగుతాయి. వడ్డీరేట్లు పెరిగితే బాండ్‌ ఫండ్ల రాబడులు తగ్గుతాయి.

అమెరికాలో బాండ్ల రాబడులు స్థిరంగా ఉన్నాయని, మన మార్కెట్లోనూ అలాంటి పరిస్థితే ఉంటుందని అంచనా వేయకూడదు. విదేశీ మార్కెట్ల ప్రభావం మనపై పెద్దగా ఉండదు.  ద్రవ్యోల్బణం, నగదు సరఫరా తదితర అంశాలపై బాండ్‌ ఫండ్ల రాబడులు ఆధారపడి ఉంటాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని, ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయాన్ని బట్టి బాండ్‌ ఫండ్స్‌ రాబడులను అంచనా వేయొచ్చు. ఆ దృష్ట్యా చూస్తే, బాండ్‌ ఫండ్ల విషయంలో ఒక తటస్థ పరిస్థితి ఉత్పన్నమవ్వగలదని తెలుస్తోంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో వడ్డీరేట్లు తగ్గే అవకాశాలున్నాయి. దీంతో బాండ్ల ఫండ్లకు ప్రయోజనం చేకూరుతుంది. బాండ్ల ఫండ్లలో ఇన్వెస్ట్‌  చేయడం వల్ల మన ఇన్వెస్ట్‌మెంట్స్‌కు స్థిరత్వం కలుగుతుంది. ఒకవేళ నష్టాలు రావడం సంభవించినా, మన పెట్టుబడి పెద్ద స్థాయిలో హరించుకుపోయే ప్రమాదం ఉండకపోవచ్చు. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీల వల్ల తలెత్తిన సంక్షోభం కారణంగా ఇటీవల కొన్ని లిక్విడ్, బాండ్‌ ఫండ్లకు నష్టాలు వచ్చాయి. ఇది తాత్కాలికమే. ఇది వడ్డీరేట్లపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు.  

నా పోర్ట్‌ఫోలియోలో 10–15 వరకూ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉన్నాయి. ఏ ఫండ్‌ ఏ రేంజ్‌లో ఎంత రాబడులు ఇచ్చిందో నాకు అంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి ? –ఖదీర్, విజయవాడ  
దీనికి ఒకటే పరిష్కారం. మీ పోర్ట్‌ఫోలియోను ప్రక్షాళన చేయండి. మీ పోర్ట్‌ఫోలియోలో 4–5 మంచి ఫండ్స్‌ను మాత్రమే ఉంచుకోండి. మీ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌  ఏడాది దాటితే, ఆ ఫండ్స్‌ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుంటే, వాటికి ఎలాంటి ఎగ్జిట్‌ లోడ్‌ ఉండదు. ఇలా ఎలాంటి ఎగ్జిట్‌ లోడ్‌ ఉండని, పనితీరు సరిగ్గా లేని, అంతంత మాత్రం పనితీరు ఉన్న ఫండ్స్‌ను, ఒకే పోర్ట్‌ఫోలియో ఉన్న ఫండ్స్‌ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోండి. మీ పోర్ట్‌ఫోలియోలో 4–5 మంచి మల్టీక్యాప్‌ ఫండ్స్‌ ఉండేలా చూసుకోండి. ఈ 4–5 మల్టీ క్యాప్‌ ఫండ్స్‌ డైవర్సిఫైడ్‌గా ఉండాలన్న విషయాన్ని మర్చిపోకండి. ఇక కొత్త ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలన్న కోరికను అదుపులో పెట్టుకోండి.
 
నేను సీనియర్‌ సిటిజన్‌ను. అమెరికా షేర్లలో నేరుగా ఇన్వెస్ట్‌ చేయవచ్చా? లేక అమెరికా, యూరప్‌ ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేసే భారత మ్యూచువల్‌ ఫండ్స్‌ ఏమైనా ఉన్నాయా? ఉంటే, అలాంటి వాటిల్లో కొన్ని మంచి ఫండ్స్‌ను సూచించండి? – ఆనంద రావు, విశాఖపట్టణం  
విదేశీ ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేయడానికి భారతీయులకు రెండు, మూడు మార్గాలున్నాయి. భారతీయులెవరైనా సరే 2 లక్షల డాలర్ల వరకూ అమెరికా షేర్లలో నేరుగా ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అమెరికా షేర్లలో ఇన్వెస్ట్‌ చేయడానికి సలహా, సహకారాలు అందించే స్టాక్‌ బ్రోకర్లు ఇక్కడ చాలా మందే ఉన్నారు. ఇక మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా కూడా విదేశీ స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఇలా మీరు ఇన్వెస్ట్‌ చేయడానికి మోతిలాల్‌ ఓస్వాల్‌ నాస్‌డాక్‌ 100 ఈటీఎఫ్‌ ఫండ్‌ను పరిశీలించవచ్చు.

గత ఏడాది కాలంలో ఈ ఫండ్‌ 20 శాతం వరకూ రాబ డినిచ్చింది. ఈ ఫండ్‌ ఆరంభమై... ఏడేళ్లు. ఈ ఏడేళ్లలో కూడా ఈ ఫండ్‌ మంచి రాబడులనే ఇచ్చింది. మీరు ఇన్వెస్ట్‌ చేయడానికి మరికొన్ని ఫండ్స్‌ను కూడా పరిశీలించవచ్చు. అవి ఫ్రాంక్లిన్‌ యూఎస్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్, రిలయన్స్‌ యూఎస్‌ ఈక్విటీ అపర్చునిటీస్‌ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ యూఎస్‌ బ్లూచిప్‌ ఈక్విటీ ఫండ్‌. 

కొన్ని ఫండ్స్‌ తమ మొత్తం నిధుల్లో 65 శాతం వరకూ భారత షేర్లలో, మిగిలిన 35 శాతం వరకూ ఇతర దేశాల షేర్లలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాయి. ఇలాంటి ఫండ్లలో పరాగ్‌ పరిఖ్‌ లాంగ్‌ టర్మ్‌ ఈక్విటీ ఫండ్‌ను పరిశీలించవచ్చు. ఈ ఫండ్‌ తన నిధుల్లో 30 శాతం వరకూ అమెరికా షేర్లలో ఇన్వెస్ట్‌ చేస్తోంది. ఒక పూర్తి మార్కెట్‌ సైకిల్‌ కాలంలో ఈ ఫండ్‌ మంచి రాబడులనే ఇచ్చింది. ఈ ఫండ్‌లో డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు బాగా ఉన్నాయి.


- ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement