టర్మ్‌ పాలసీ ఎంతమొత్తానికి తీసుకోవాలి? | term policy should be taken to the fullest | Sakshi
Sakshi News home page

టర్మ్‌ పాలసీ ఎంతమొత్తానికి తీసుకోవాలి?

Published Mon, May 22 2017 12:36 AM | Last Updated on Tue, Sep 5 2017 11:40 AM

టర్మ్‌ పాలసీ ఎంతమొత్తానికి తీసుకోవాలి?

టర్మ్‌ పాలసీ ఎంతమొత్తానికి తీసుకోవాలి?

నా వయస్సు 47 సంవత్సరాలు. నాకు ముగ్గురు పిల్లలున్నారు. నేను టర్మ్‌ బీమా పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. ఎంత మొత్తానికి తీసుకోవాలి? టర్మ్‌ బీమా ఎంచుకోవడానికి ఏ అంశాలను ముఖ్యంగా పరిగణనలోకి తీసుకోవాలి?
–విరాట్‌ సాయి విశాఖపట్టణం

టర్మ్‌ బీమా ఎంత మొత్తానికి తీసుకోవాలనే విషయం వ్యక్తికి, వ్యక్తికి మారుతూ ఉంటుంది. ఒక్కో వ్యక్తి ఆదాయం, ఆర్థిక అవసరాలు, ఆ వ్యక్తిపై ఆర్థికంగా ఆధారపడి ఉన్న వ్యక్తులు, వారి ఆర్థిక అవసరాలు ఇలా వివిధ విషయాలను పరిగణనలోకి తీసుకొని ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. ఒక బండ సూత్రం ఏమిటంటే, మీ పదేళ్ల ఆదాయం ఎంత ఉంటుందో, అంత మొత్తానికి టర్మ్‌ బీమా తీసుకోవాలి. మీ విషయానికొస్తే, పదేళ్ల ఆదాయంతో పాటు, మీ ముగ్గురు పిల్లల చదువులకయ్యే ఖర్చులు, మీకు ఏమైనా రుణాలు ఉంటే వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇక మంచి టర్మ్‌ ప్లాన్‌ను ఎంచుకోవడానికి రెండు ముఖ్యమైన అంశాలు చూడాలి. మొదటిది క్లెయిమ్స్‌ సెటిల్మెంట్‌ రేషియా.  ఏ బీమా కంపెనీ క్లెయిమ్స్‌ సెటిల్మెంట్‌ రేషియో అధికంగా ఉంటుందో ఆ కంపెనీ నుంచి టర్మ్‌ బీమా పాలసీ తీసుకోవాలి. ఇక రెండో అంశం.. చెల్లించాల్సిన ప్రీమియమ్‌. సాధారణంగా టర్మ్‌  బీమా పాలసీల ప్రీమియమ్‌లు తక్కువగానే ఉంటాయి. ఒకే బీమా మొత్తానికి వివిధ బీమా కంపెనీల ప్రీమియమ్‌లు వేర్వేరుగా ఉంటాయి. తక్కువ ప్రీమియమ్‌తో కూడిన బీమా పాలసీలను ఆఫర్‌ చేసే కంపెనీని ఎంచుకోవాలి. వివిధ బీమా సంస్థల  క్లెయిమ్స్‌ సెటిల్మెంట్‌ రేషియో, ప్రీమియమ్‌ విషయాలను  సులభంగా పోల్చి చూసుకునే వెసులుబాటు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.  ఇలా పోల్చిచూసుకుని మీ ఆర్థిక అవసరాలకు తగ్గట్లుగా మంచి టర్మ్‌ బీమా పాలసీని ఎంచుకోండి.

టర్నోవర్‌ రేషియో అంటే ఏమిటి? ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం ఒక ఫండ్‌ను ఎంచుకునేటప్పుడు ఈ టర్నోవర్‌ రేషియోను కూడా పరిగణనలోకి తీసుకోవాలా ?
–ఆనంద్, విజయవాడ

ఒక మ్యూచువల్‌ ఫండ్‌..తన పోర్ట్‌ఫోలియోతో  ప్రతి ఏడాది మార్చిన షేర్‌ హోల్డింగ్స్‌ శాతాన్ని టర్నోవర్‌ రేషియోగా పరిగణిస్తారు. ఉదాహరణకు ఒక మ్యూచువల్‌ ఫండ్‌ టర్నోవర్‌ రేషియో 31 శాతంగా ఉందనుకోండి. అంటే దానర్ధం.. ఒక ఏడాది కాలంలో ఆ ఫండ్‌ షేర్‌హోల్డింగ్స్‌లో మార్పులు 31 శాతం వున్నాయని అర్థం. టర్నోవర్‌ రేషియో అధికంగా ఉంటే.., ఇన్వెస్టర్లపై వ్యయాల భారం అధికంగా ఉంటుంది. షేర్ల కొనుగోళ్లు, విక్రయాలపై కొన్ని చార్జీలు, వ్యయాలు, పన్నులు ఉంటాయి కదా! అయితే ఈక్విటీ ఫండ్స్‌ విషయానికొస్తే, సరైన ధరలో సరైన షేర్లను ఎంచుకోవడం, ఏ ధర వద్ద ఏ ఏ షేర్ల నుంచి వైదొలగడం.. ఇవన్నీ కీలకమైన అంశాలు. ఇవన్నీ సమర్థవంతంగా జరిగితే ఇన్వెస్టర్లకు మంచి రాబడులు వస్తాయి. టర్నోవర్‌ రేషియో తక్కువగా ఉండి, మంచి రాబడులు వస్తే.. అది ఒక ఫండ్‌ను ఎంచుకోవడానికి ముఖ్యమైన అంశంగా పరిగణించవచ్చు. కానీ ఒక్కోసారి టర్నోవర్‌ రేషియో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండొచ్చు. ఉదాహరణకు ఒక ఫండ్‌ను ఇన్వెస్టర్లు తరచుగా అమ్మకాలు, కొనుగోళ్లు చేస్తూ ఉంటే, ఫండ్‌ మేనేజర్స్‌ తప్పనిసరిగా ఫండ్‌ పోర్ట్‌ఫోలియోలో ఉండే షేర్లను మార్చాల్సి రావచ్చు.  అయితే ఒక మ్యూచువల్‌ ఫండ్‌లో  ఇన్వెస్ట్‌ చేయడానికి టర్నోవర్‌ రేషియో అంత కీలకమైన అంశం కాదు. ఆ ఫండ్‌ గత కొన్నేళ్లలో ఎలాంటి రాబడులు ఇచ్చింది, ఇదే కేటగిరీలోని ఇతర ఫండ్స్‌ ఎలాంటి రాబడులు ఇచ్చాయి. తదితర అంశాలను బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి.

పన్ను ప్రయోజనాల కోసం పలువురు ఇన్వెస్టర్లు ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌)లో ఇన్వెస్ట్‌ చేస్తారు. అయితే నాకు పన్ను ప్రయోజనాలు అవసరం లేదు. పన్ను ప్రయోజనాలు ప్రాధాన్యత అంశంగా కాకుండా ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా ?
–నాగేశ్వరరావు, హైదరాబాద్‌

పన్ను ప్రయోజనాలు ప్రాధాన్యత అంశం కానప్పుడు ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం సరైన నిర్ణయం కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈఎల్‌ఎస్‌ఎస్‌లకు లాక్‌ ఇన్‌ పీరియడ్‌ మూడేళ్లుగా ఉంటుంది. మూడేళ్లలోపు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోరు, కాబట్టి  దీర్ఘకాలం దృష్టిలో పెట్టుకొని ఫండ్‌ మేనేజర్‌ పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇలాంటి పన్ను ఆదాయ ఫండ్స్, సాధారణ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ కంటే మంచి రాబడులను ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తే..మీ పెట్టుబడులు అనవసరంగా మూడేళ్లు లాక్‌ అవుతాయి. మీ పెట్టుబడులకు  ఈ అనవసర లాక్‌ ఇన్‌ పీరియడ్‌ అవసరమా అని మీరు ఆలోచించుకోండి. పన్ను ఆదా, పన్ను ప్రయోజనాలు మీకు అవసరం లేనప్పుడు, మీరు ఇన్వెస్ట్‌ చేయడానికి ఈఎల్‌ఎస్‌ఎస్‌ కాకుండా మరెన్నో ఫండ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఏదైనా మంచి ఈక్విటీ లేదా బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ను ఎంచుకొని, దాంట్లో ఇన్వెస్ట్‌ చేయండి. సంవత్సరం దాటిన తర్వాత కావాలనుకుంటే ఈ ఫండ్‌ యూనిట్లను విక్రయించి, మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవచ్చు. పైగా  ఎలాంటి పన్ను భారం ఉండదు. అదే ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్‌ చేశారనుకోండి. మూడేళ్ల తర్వాతనే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ మీరు తీసుకోవడానికి వీలుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement