లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌ను ఎంచుకోవడం ఎలా? | How to choose a large-cap fund? | Sakshi
Sakshi News home page

లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌ను ఎంచుకోవడం ఎలా?

Published Mon, Apr 10 2017 3:01 AM | Last Updated on Tue, Sep 5 2017 8:22 AM

లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌ను ఎంచుకోవడం ఎలా?

లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌ను ఎంచుకోవడం ఎలా?

నేను 2004లో నా కొడుకు పేరు మీద బిర్లా సన్‌ లైఫ్‌ ఫ్లెక్సి సేవ్‌ ప్లస్‌ ఎండోమెంట్‌ ప్లాన్‌ను తీసుకున్నాను. ఏడాదికి రూ.50,000 చొప్పున 19 సంవత్సరాల పాటు ప్రీమియమ్‌ చెల్లించాల్సి ఉంటుంది. గత మూడేళ్ల నుంచి ప్రీమియమ్‌ చెల్లించడం లేదు. ఇప్పటిదాకా రూ.6 లక్షల వరకూ ప్రీమియమ్‌ చెల్లించాను. ఈ ప్లాన్‌ను సరెండర్‌ చేస్తే ఇప్పుడు నాకు రూ.6,70,000 వస్తాయి. ఈ ప్లాన్‌ను సరెండర్‌ చేయమంటారా? లేక కొనసాగించమంటారా?
–రమేశ్, విజయవాడ

బీమా తీసుకున్న వ్యక్తి మరణిస్తే, ఆ వ్యక్తిపై ఆధారపడిన కుటుంబం ఆర్థిక అవసరాలు తీర్చడం బీమా ముఖ్య ఉద్దేశం. అందుకని మీ కొడుకు పేర బీమా పాలసీ తీసుకోవడం సరైనది కాదు. బీమా కావలసినది మీకు. మీ కొడుకు ఆర్థికంగా ప్రయోజకుడు అయ్యేంత వరకూ మీ కుటుంబం, అతడి ఆర్థిక అవసరాలు తీర్చడం కోసం మీకు బీమా అవసరం. అందుకుని మీరు తక్షణం టర్మ్‌ బీమా ప్లాన్‌ తీసుకోండి. ఇక బిర్లా సన్‌లైఫ్‌ ఎండోమెంట్‌ ప్లాన్‌ విషయానికొస్తే, ఇదొక యూనిట్‌ లింక్డ్‌ ఇన్‌కమ్‌ ప్లాన్‌(యులిప్‌). ఇన్వెస్ట్‌మెంట్‌ కలగలసిన బీమా ప్లాన్‌ ఇది. ఇవి తక్కువ బీమా కవరేజ్‌ను, తక్కువ రాబడులను ఇస్తాయి. మీ విషయమై తీసుకుంటే పన్నేండేళ్ల కాలంలో మీరు ఇప్పటిదాకా రూ.6 లక్షల వరకూ ప్రీమియమ్‌ చెల్లించారు.  మీ ఇన్వెస్ట్‌మెంట్‌  విలువ రూ.6.70,000గానే ఉంది. ఇది బ్యాంక్‌ సేవింగ్స్‌ ఖాతా కంటే తక్కువ రాబడి. అందుకని ఈ పాలసీని సరెండర్‌ చేయడమే ఉత్తమం. మీరు ఈ ప్లాన్‌ తీసుకొని ఐదేళ్లు దాటినందున ఎలాంటి సరెండర్‌ చార్జీలు లేకుండానే ఈ ప్లాన్‌ను సరెండర్‌ చేయవచ్చు. మీరు సరెండర్‌ చేసేటప్పుడు ఈ ఫండ్‌ విలువ ఎంత ఉంటుందో అదే మీ సరెండర్‌ వేల్యూ అవుతుంది.  ఈ పాలసీని సరెండర్‌ చేసి దీనికి చెల్లించే రూ.50,000 మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. ఏదైనా 2–4 డైవర్సిఫైడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంచుకొని వాటిల్లో ఈ మొత్తాన్ని  ఇన్వెస్ట్‌ చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు. ఇప్పుడు మీరు ఫండ్స్‌లో చేసే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌.. రేపు మీ అబ్బాయి ఉన్నత విద్యాభ్యాసానికి, ఇతర అవసరాలకు పనికివస్తాయి.

నేను నెలకు రూ.10,000 చొప్పున ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌)ల్లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. అయితే వీటికి మూడేళ్ల లాక్‌–ఇన్‌ పీరియడ్‌ ఉంటుంది కదా! ఒకవేళ ఈ లాక్‌ ఇన్‌ పీరియడ్‌ కంటే ముందే నాకు డబ్బులు అవసరమైతే నేను విత్‌డ్రా చేసుకునే వీలు ఉందా?                           
–రాఘవ, విశాఖ పట్టణం

పన్ను ఆదా చేసే ప్రతి ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌కు లాక్‌–ఇన్‌ పీరియడ్‌ తప్పనిసరి. మీరు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్న ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌)కు లాక్‌–ఇన్‌ పీరియడ్‌ మూడేళ్లుగా ఉంది. అంటే మీరు ఇన్వెస్ట్‌ చేసిన మూడేళ్ల తర్వాత మాత్రమే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఉపసంహరించుకునే వీలు ఉంది. అంతకంటే ముందే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకునే వీలు లేదు.


నేను కొంత మొత్తం ప్రతి నెలా ఏదైనా ఒక లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. అయితే  ప్రతి లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌ పోర్ట్‌ఫోలియో దాదాపు ఒకే విధంగా ఉంటున్నాయి. వీటిల్లోంచి ఉత్తమమైన ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలి?           
 –నాని, హైదరాబాద్‌  

ఏదైనా ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే,  ఆ ఫండ్‌ పోర్ట్‌ఫోలియోను బట్టి ఇన్వెస్ట్‌ చేయకూడదు. దీర్ఘకాలంలో ఆయా ఫండ్స్‌ ఇచ్చిన రాబడులను పరిశీలించాలి.  అంతేకాకుండా దీర్ఘకాలంలో ఆ ఫండ్స్‌ ఏ మేరకు ఒడిదుడుకులకు గురయ్యాయో చూడాలి. దాదాపు 70–80 వరకూ లార్జ్‌క్యాప్‌ ఫండ్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిల్లో 20–30 వరకూ ఫండ్స్‌ ఇండెక్స్‌ స్థాయి రాబడులను కూడా ఇవ్వడం లేదు. కేవలం కొన్ని ఫండ్స్‌ మాత్రమే 5–10 ఏళ్ల కాలానికి 10 శాతానికి మించి రాబడులనిస్తున్నాయి. ఈ ఫండ్స్‌ పోర్ట్‌ఫోలియోలు ఒకే విధంగా ఉన్నప్పటికీ, రాబడుల్లో  తేడాలుంటున్నాయి. ఒక షేర్‌ను ఎప్పుడు కొనాలో, ఎప్పుడు అమ్మేయాలో, ఎంత కాలం పోర్ట్‌ఫోలియోలో కొనసాగించాలో.. తదితర అంశాలన్నీ ఫండ్‌ పనితీరుపై ప్రభావం చూపుతాయి. కాబట్టి ఫండ్‌ పోర్ట్‌ఫోలియోను కాకుండా, ఫండ్‌ గత కాలపు పనితీరును బట్టి ఇన్వెస్ట్‌మెంట్‌ నిర్ణయాలు తీసుకోవాలి.

నేను కెనాడాలో పనిచేస్తున్నాను. ఒక ప్రవాస భారతీయుడిగా నేను భారత మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా?
–అగర్వాల్, ఈ మెయిల్‌ ద్వారా
చాలా మ్యూచువల్‌ ఫండ్స్‌ అమెరికా, కెనడాల్లో పనిచేస్తున్న ప్రవాస భారతీయుల నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ తీసుకోవడం ఆపేస్తున్నాయి. కొన్ని శాసనపరమైన నిబంధనల వల్ల పలు మ్యూచువల్‌ ఫండ్స్‌ అమెరికా, కెనడాల్లో ఉంటున్న ప్రవాస భారతీయుల ఇన్వెస్ట్‌మెంట్స్‌ను అంగీకరించడం లేదు.    ప్రవాస భారతీయులతో సహా అమెరికా, కెనడాల్లో నివసించే వ్యక్తులు జరిపే ఆర్థిక లావాదేవీలను ప్రపంచంలోని అన్ని ఆర్థిక సంస్థలు అమెరికా, కెనడా ప్రభుత్వాలకు నివేదించాలని ఫారిన్‌ అకౌంట్‌ ట్యాక్స్‌ కంప్లయన్సెస్‌ యాక్ట్‌(ఫ్యాట్‌కా)  తప్పనిసరి చేసింది. అయితే గత ఏడాది డిసెంబర్‌ నాటికి అమెరికా, కెనడాల్లోని ప్రవాస భారతీయుల నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొన్ని భారత ఫండ్స్‌ అంగీకరిస్తున్నాయి. ఆ ఫండ్స్‌ వివరాలు.., బిర్లా సన్‌లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్, ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్, యూటీఐ మ్యూచువల్‌ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమెరికా మ్యూచువల్‌ ఫండ్, ఎల్‌ అండ్‌  టీ మ్యూచువల్‌ ఫండ్, పీపీఎఫ్‌ఏఎస్‌ మ్యూచువల్‌ ఫండ్, సుందరమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement