స్మాల్‌క్యాప్ ఫండ్స్, మిడ్‌క్యాప్ ఫండ్స్, లార్జ్‌క్యాప్ ఫండ్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ, ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు పెద్దగా పరిచయం లేని, పట్టించుకోని విభాగం ఒకటి ఉంది. అదే లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ విభాగం. దీర్ఘకాలంలో ఈ విభాగం మంచి సంపద సృష్టిస్తుందని చెప్పడానికి ఇప్పటి వరకు ఉన్న గణాంకాలు ఆధారంగా నిలుస్తాయి.
లార్జ్‌క్యాప్ స్థిరత్వానికి, రిస్క్ తక్కువకు వీలు కల్పిస్తుంది. మిడ్‌క్యాప్ మోస్తరు రిస్క్‌తో, అధిక రాబడులకు మార్గం కల్పిస్తుంది. ఈ రెండు రకాల విభాగాల్లో పెట్టుబడులకు వీలు కల్పించేదే లార్జ్ అండ్ మిడ్‌క్యాప్. ఈ విభాగంలో సుదీర్ఘకాల చరిత్ర (25 ఏళ్లకు పైగా) ఉండి, మంచి రాబడులను అందిస్తున్న పథకంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్‌కు ట్రాక్ రికార్డు ఉంది.
పెట్టుబడుల విధానం..
సెబీ నిబంధనల ప్రకారం ఈ పథకం లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్‌లో 35 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ, కొన్ని సందర్భాల్లో విభాగాల వారీ కేటాయింపుల్లో పరిమిత కాలం స్వేచ్ఛ ఉంటుంది. ఈ పథకం మేనేజర్ టాప్‌డౌన్, బోటమ్ అప్ విధానాలను స్టాక్ ఎంపికకు వినియోగించుకోవడాన్ని గమనించొచ్చు. ఈ విధానాల ద్వారా లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ విభాగాల నుంచి స్టాక్స్ ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఆకర్షణీయమైన అవకాశాలు ఎక్కడ కనిపించినా, ఫండ్ మేనేజర్ గుర్తించి అందులో ఇన్వెస్ట్ చేస్తుంటారు. స్మాల్‌క్యాప్‌లో ఆకర్షణీయమైన అవకాశాలు కనిపించినా సొంతం చేసుకునే విధంగా ఈ పథకం పనిచేస్తుంటుంది. ఇన్వెస్టర్లకు అదనపు ఆల్ఫా అందించడమే దీని ఉద్దేశ్యం. ఈక్విటీల్లో తీవ్ర అస్థిరతలు ఉన్న సందర్భాల్లో 30 శాతం వరకు డెట్ సాధనాలకు సైతం కేటాయించగలదు.
పోర్ట్‌ఫోలియో
డిసెంబర్ 31 నాటికి చూసుకుంటే ఈ పథకం నిర్వహణలో రూ.10,268 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 93.74 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించగా, డెట్ సాధనాల్లో 0.87 శాతం, నగదు, నగదు సమానాల్లో 5.4 శాతం మేర కలిగి ఉంది. ప్రస్తుతం ఈక్విటీ కేటాయింపులను పరిశీలించగా, 70.42 శాతం లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 26 శాతం మేర ఇన్వెస్ట్ చేయగా, స్మాల్‌క్యాప్ కంపెనీలకు కేవలం 2 శాతాన్నే కేటాయించింది. ప్రస్తుతం స్మాల్‌క్యాప్ కంపెనీల వ్యాల్యూషన్లు చారిత్రక గరిష్ట స్థాయిలో ఉన్నందున అప్రమత్త ధోరణితో ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ రికవరీతో లాభపడే రంగాలు, స్టాక్స్‌కు ఎక్కువ కేటాయింపులు చేసినట్టు ప్రస్తుత పోర్ట్‌ఫోలియోను గమనిస్తే తెలుస్తుంది. అంటే ఆర్థిక వ్యవస్థ మెరుగైన వృద్ధికి అనుగుణంగా ఆయా స్టాక్స్ ర్యాలీకి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని భావించొచ్చు.
రాబడులు
ఈ పథకం 1998 నవంబర్ 30న ప్రారంభమైనంది. నాటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు వార్షిక రాబడి 18.60 శాతంగా ఉంది. ఈ పథకం ఎక్స్‌పెన్స్ రేషియో 1.80 శాతంగా ఉంది. అంటే ఇన్వెస్టర్ తన పెట్టుబడుల విలువపై ఏటా ఈ మేరకు చార్జీల రూపంలో కోల్పోవాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని ప్రస్తుతం ఇహబ్ దల్వాయ్ నిర్వహిస్తున్నారు. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 33 శాతం రాబడిని అందించింది. మూడేళ్లలో 25.63 శాతం, ఐదేళ్లలో 20 శాతం, ఏడేళ్లలో 16.44 శాతం, పదేళ్లలో 16.62 శాతం చొప్పున రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. ఈ పథకం ప్రారంభమైన నాడు ఏకమొత్తంలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, అది ఇప్పుడు రూ.72.15 లక్షలు అయి ఉండేది. ఈ కాలంలో బెంచ్‌మార్క్ నిఫ్టీ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ 250 టీఆర్‌ఐ కంటే మెరుగైన పనితీరు చూపించింది. పథకం ఆరంభం నుంచి ప్రతి నెలా రూ.10వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వస్తే రూ.4.03 కోట్లు సమకూరి ఉండేది.
టాప్ ఈక్విటీ హోల్డింగ్స్
కంపెనీ పెట్టుబడుల శాతం
ఐసీఐసీఐ బ్యాంక్ 6.84
మారుతి సుజుకీ 4.50
ఎన్‌టీపీసీ 3.79
భారతీ ఎయిర్‌టెల్ 3.22
ఇన్ఫోసిస్ 3.14
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2.89
ఎస్‌బీఐ కార్డ్స్ 2.83
రిలయన్స్ 2.53
ఎన్‌హెచ్‌పీసీ 2.36
ముత్తూట్ ఫైనాన్స్ 2.35
Comments
Please login to add a commentAdd a comment